అంతా ఊహించినట్టే V సినిమా వాయిదాపడింది. నాని, సుధీర్ బాబు నటించిన ఈ సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏప్రిల్ లో ఏ తేదీకి వస్తామనే విషయంపై మాత్రం నిర్మాత దిల్ రాజు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
“V సినిమా కోసం మేమంతా చాలా కష్టం. ఆ కష్టాన్ని మీ ముందుకు తీసుకురావాలని చాలా ఎక్సయిట్ అయ్యాం. కానీ కరోనా వైరస్ రావడంతో.. పబ్లిక్ సేఫ్టీ మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేం ఆలోచనలో పడ్డాం. ప్రస్తుతానికి మా సినిమాను వాయిదా వేయడానికి నిర్ణయించాం. ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.”
ఇలా దిల్ రాజు ఆఫీస్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. లెక్కప్రకారం ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలి. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు నడుస్తున్నప్పటికీ సినిమాను రిలీజ్ చేయాలనే అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఊహించని విధంగా ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు బయటపడ్డంతో తమ సినిమాను వాయిదా వేశారు.
ప్రస్తుతం ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా, యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమౌతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిని కూడా వాయిదా వేస్తారా లేక చెప్పిన తేదీకే థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది చూడాలి. ప్రేక్షకులు మాత్రం కరోనా భయంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు.