ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ బయోపిక్‌ యిలాగే తీయాలా?

ఎన్టీయార్‌ బయోపిక్‌ నేనింకా చూడలేదు. అందువలన యిది ఆ చిత్రసమీక్ష కాదు. పాత్రధారుల అభినయం, సాంకేతిక అంశాల, సంగీతం గురించి చర్చ ఏమీ ఉండదు. బయోపిక్‌ తీయడంలో ఉన్న కష్టాల గురించి, యీ సినిమాలో…

ఎన్టీయార్‌ బయోపిక్‌ నేనింకా చూడలేదు. అందువలన యిది ఆ చిత్రసమీక్ష కాదు. పాత్రధారుల అభినయం, సాంకేతిక అంశాల, సంగీతం గురించి చర్చ ఏమీ ఉండదు. బయోపిక్‌ తీయడంలో ఉన్న కష్టాల గురించి, యీ సినిమాలో డీల్‌ చేసిన కథ గురించి మాత్రమే నా వ్యాఖ్యానమంతా! కథ యిప్పటికే బయటకు వచ్చేసింది కాబట్టి, ఎలా చూపారో తెలియకపోయినా ఏం చూపారో తెలుసు.

మనుషులందరికీ జీవితం ఉంటుంది. కానీ అందరం ఆత్మకథలు రాయలేం. మనకు రాయడం రాదు కాబట్టి అనుకున్నా, ఇంకోళ్లు కూడా రాయలేరు. ఎందుకంటే చాలాభాగం సాధారణ విషయాలే ఉంటాయి. అసాధారణమైన మనుషుల గురించి రాసినా కాస్తే చదువుతాం. మన దేశ పతాక నిర్మాత పింగళి వెంకయ్య గారి గురించి ఒక వ్యాసం చాలనిపిస్తుంది. బెనారస్‌ హిందూ యూనివర్శిటీ స్థాపించిన మదన్‌ మోహన్‌ మాలవ్యా గురించి మహా అయితే 20 పేజీల చిన్న పుస్తకం చాలనిపిస్తుంది. సినిమా తారలకైతే గ్లామరుంటుంది కాబట్టి వాళ్ల గురించి చదువుతారు అనుకోవచ్చు. అవును, చదువుతారు, సినిమా పత్రికల్లో వార్తలుగా, విశేషాలుగా చదువుతారు. పుస్తకాలుగా వేస్తే వెయ్యి, రెండు, మహా అయితే పది వేల కాపీల కంటె అమ్ముడుపోవడం కష్టం – అభిమానులు కోట్లలో ఉన్నా! ఎందుకంటే తెరమీద అయితే ఫిక్షన్‌ కాబట్టి పాత్రచిత్రణలో విపరీతంగా ఎత్తుపల్లాలు అమర్చి రసోత్పత్తి కలిగిస్తారు. నిజజీవితంలో అంత ఎగుడుదిగుడులుండవు, డ్రామా ఉండదు. డ్రామా అంటూ ఉంటే ఆ హీరో లేదా హీరోయిన్‌ తెర మీదకు వచ్చేందుకు పడిన స్ట్రగుల్‌లో ఉంటుంది. దాన్ని ఆసక్తికరంగా చెప్పగలగాలి.

ఎయన్నార్‌ ప్రస్థానంపై ముళ్లపూడి వెంకటరమణ గారు ''కథానాయకుని కథ'' పేర 1963 లో బయోగ్రఫీ రాస్తే వెలువడిన నెలలోనే 15 వేల కాపీలు అమ్ముడుపోయాయి. రెండో ఎడిషన్‌ కూడా అతి త్వరగా అయిపోయాయి. అవి పుస్తకాలు చదివే రోజులు. 2004లో దాన్ని నేను ''సినీరమణీయం-2''లో భాగంగా మళ్లీ ప్రజల్లోకి తెచ్చేవరకూ 40 ఏళ్లపాటు ఆ పుస్తకం అలభ్యం. నాగేశ్వరరావు 100 సినిమాలు పూర్తి చేసిన దశ వరకు ఉంటుందా రచన. కొన్నాళ్లు పోయాక దానికి సీక్వెల్‌ రాయించాలనే కోరిక కలిగింది నాగేశ్వరరావు గారికి. రమణ గారిని అడిగారు. 'అబ్బే, రక్తి కట్టదు. సినీరంగాన్ని మీరు శాసించే స్థితికి వచ్చేశాక, పాఠకుడికి కుతూహలం ఏముంటుంది?' అంటూ రమణగారు నిరాకరించారు. నిజమే కదా, తోటరాముడు రాకుమారిని పెళ్లాడేవరకే మజా, ఆ తర్వాత అతను ఎలా పాలించాడు, ఎలా పిల్లల్ని కన్నాడు అనేది బోరింగు సబ్జక్టు. అయినా ఫర్వాలేదని తర్వాతి రోజుల్లో ఎయన్నార్‌పై చాలామంది పుస్తకాలు రాశారు. ఆదరణ అంతంత మాత్రమే!

రామారావుగారిపై సరైన జీవితచరిత్ర ఎవరూ రాయలేదు. ఆ లోటు ఎత్తి చూపించి తను రాస్తానంటూ లక్ష్మీపార్వతి ఆయనకు దగ్గరయ్యారు. పెళ్లాడారు. చివరకు ఆయన పోయిన 8 ఏళ్లకు, లక్ష్మీపార్వతి అన్ని ఘట్టాలూ పూర్తయ్యాక 2004లో పుస్తకం బయటకు వచ్చింది – ''ఎదురులేని మనిషి'' పేర! 10 వేల కాపీలు వేశారు. విజయా వారితో ఒప్పందం కుదిరేవరకు జరిగిన స్ట్రగుల్‌ పీరియడ్‌ గురించి 318 పేజీల్లో విపులంగా ఉంటుంది. ఇంకో 16 పేజీల్లో సినిమా జీవితం మొత్తం సమీక్షించేశారు. అప్పటికే ఎన్టీయార్‌ గురించి సాధారణ పాఠకుడికి కూడా అన్ని విషయాలూ తెలిసిపోవడం చేత, పుస్తకపఠనం తగ్గిపోవడం చేత, అది పెద్దగా ప్రజాదరణ పొందలేదు. రెండో భాగం ''తెలుగు తేజం'' ఆయన రాజకీయ జీవితం గురించి. ఆయన జీవితంపై ఇంకా కొంతమంది రాశారు.

వాటి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కృష్ణ, శోభనబాబుల గురించి కూడా పుస్తకాలు రాశారు. ఏవీ హాట్‌కేక్స్‌లా అమ్ముడుపోలేదు. అంతంత మాత్రమే. ఎందుకు? ఎందుకంటే వాళ్ల పుట్టిన రోజులని, మరోటని, టీవీలు వాళ్ల జీవిత విశేషాలు సినిమా క్లిప్పింగులతో సహా మాటిమాటికీ చూపిస్తూనే ఉంటాయి. కొత్తగా తెలుసుకునేందుకు ఏముంటుంది – వాళ్ల గురించి నెగటివ్‌గా ఆ పుస్తకాల్లో రాస్తే తప్ప! భానుమతి, జమున, గుమ్మడి, పద్మనాభం వీళ్లంతా ఆత్మకథలు రాసుకున్నారు. ఏవీ గొప్పగా అమ్ముడుపోలేదు. పెద్దగా ఖర్చు లేని పుస్తకాలకే రిసెప్షన్‌ యిలా వుంటే, యిక సినిమా తీస్తే ఎలా వుంటుంది? ఎయన్నార్‌ బయోపిక్‌ తీయగలరా? ఎన్టీయార్‌తో సమానస్థాయి నటుడు, తీయలేదేం? తీద్దామని కూడా ఎవరూ అనుకోవడం లేదేం? ఎన్టీయార్‌ది కూడా అదే పరిస్థితి అయి వుండేది – ఆయన రాజకీయనాయకుడు కూడా కాకపోయి వుంటే!

ఎన్టీయార్‌ మామూలు ముఖ్యమంత్రి అయి వుంటే క్రేజ్‌ వుండేది కాదు. బ్రహ్మానంద రెడ్డి గురించో, వెంగళరావు గురించో సినిమా చూస్తే ఎవరు చూస్తారు? రామారావు సొంతంగా పార్టీ పెట్టడం, చైతన్యయాత్ర, అనూహ్యంగా పెద్ద మెజారిటీతో నెగ్గడం, వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్లడం, కుట్రకు బలి కావడం, పదవి పోగొట్టుకోవడం, ప్రజాపోరాటంతో మళ్లీ అధికారంలోకి రావడం, ఎన్నికలలో ఓడిపోవడం, ఐదేళ్ల తర్వాత మళ్లీ రావడం, మళ్లీ కుట్రకు బలి కావడం, మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతూ గుండెపోటుతో మరణించడం… యిన్ని ఉత్థానపతనాలు ఉన్నాయి కాబట్టి కథ రంజుగా వుంటుంది. అదీయిదీ కలిపితేనే ఒక బయోపిక్‌కు కావలసిన డ్రామా వస్తుంది.

ఉదాహరణకి జయలలిత బయోపిక్‌లో డ్రామా ఉంది. సినిమాల వరకూ అయితే బాల్యంలో కష్టాలు, తల్లి అవస్థలు వరకే డ్రామా ఉంటుంది. కానీ ప్రేమ వైఫల్యం, ఎమ్జీయార్‌తో లవ్‌-హేట్‌ గేమ్‌, రాజకీయాలు, అవమానాలు, పోరాటం, గెలుపు, పాలనలో అవినీతి, జైలుపాలు కావడం, మళ్లీ అధికారం, అహంకారంతో పతనం, మళ్లీ గెలుపు, చివరకు విచిత్ర పరిస్థితుల్లో మరణం అన్నీ కలిపితే బ్రహ్మాండమైన నాటకీయత! రాజకీయాలు లేకుండా కేవలం సినిమా జీవితంపైనే బయోపిక్‌ తీయాలంటే గొప్ప ఎమోషన్‌ ఉండాలి. ముఖ్యంగా, విషాదం ఉండాలి. సిల్క్‌ స్మిత, సావిత్రి వంటి వారి జీవితాలు తెర కెక్కడానికి కారణం అదే. అంజలి, జమున, భానుమతి కథలు సినిమాలుగా తీస్తే ఆ విధమైన ఆదరణ ఉండదు. నవల, సీరియల్‌, నాటకం, సినిమా – ఏదైనా సరే, ముఖ్యపాత్రధారి కష్టాలు పడాలి, ఎదగాలి, పడాలి, మళ్లీ లేవాలి – యిదీ ఫార్ములా! అప్పుడే ప్రేక్షకుడు ఆనందిస్తాడు.

శంకరాభరణంలో శంకరశాస్త్రికి మళ్లీ గుర్తింపు వస్తే సంతోషిస్తాం, అతని మంచిచెడులకు సాక్షిగా నిలిచిన అల్లు రామలింగయ్యతో మనం ఐడెంటిఫై అవుతాం. ఉదాహరణకి ''మహానటి'' బయోపిక్‌ కాకుండా మామూలు సినిమాయే అయితే హీరోయిన్‌ దురలవాట్ల లోంచి బయటకు వచ్చి, ఆరోగ్యాన్ని పుంజుకుని మళ్లీ సినిమాల్లో వేస్తుంది, అది సూపర్‌ హిట్‌ అవుతుంది, ''మయూరి''లో పాతప్రియుడిలా, వదిలిపెట్టేసిన భర్త వచ్చి క్షమాపణ కోరతాడు, మనం పొంగిపోతాం. సావిత్రి నిజజీవిత గాథ అంటూ తీశారు కాబట్టి హిస్టరీ మార్చలేరు కాబట్టి విషాదాంతంగానే చూపారు. సావిత్రిలో చిన్నప్పటి చిలిపితనం, పెద్దయ్యాక అమాయకత్వం, చివర్లో మోసపోవడం చూసి చలించాం, ఆ పాత్ర పట్ల సింపతీ పెరిగి అయ్యో అనుకుని ఖేదపడ్డాం. ఆ పాత్ర వేసిన కీర్తి సురేశ్‌లో క్యూట్‌నెస్‌ ఉంది, అది లవబుల్‌గా ఉండి, మనింటి అమ్మాయి అనిపించింది. ఎమోషన్‌ వర్కవుట్‌ అయి సినిమా హిట్‌ అయింది.

ఎన్టీయార్‌ బయోపిక్‌ యీ భాగం వరకు చూస్తే – ఇక్కడ హీరో గడుసువాడు, విజయాలే తప్ప అపజయాలు చవి చూడనివాడు అనడంతో సింపతీ ఏముంది? మనం ఐడెండిఫై కాము. పాత్రతో ఎలియనేషన్‌ కలిగే ప్రమాదం ఉంది. ఎవడో గొప్పవాడి కథ చూస్తున్నాం అనుకుంటాం తప్ప మమేకం కాము. ఎన్టీయార్‌ సినిమాల్లోకి వస్తూనే అతి కొద్ది ప్రయత్నంతో స్టారయిపోయారు. రంగంలో ప్రవేశించడానికి ఈ సినిమాలో చూపించిన కష్టాలు ప్రతి సినిమా జీవి ఏకరువు పెట్టే వాటితో పోలిస్తే టుమ్రీలే. హీరోకి హర్డిల్‌ లేకపోతే ఇక డ్రామా ఏముంది? పాత్రధారి ప్రకారం చూసినా బాలయ్య దగ్గర గాంభీర్యమే కనబడుతుంది తప్ప, కీర్తి సురేశ్‌ తరహా క్యూట్‌నెస్‌ ఎందుకుంటుంది? ఇది మనసులో పెట్టుకుని బయోపిక్‌ ప్లాన్‌ చేసి వుండాల్సింది.

నేను మరో వ్యాసంలో రాసినట్లు ఎన్టీయార్‌ జీవితమంతా చూపితే ఒక షేక్‌స్పియర్‌ ట్రాజెడీ అంత సినిమా అవుతుంది. తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉండడం చేత, అధికారంలో వుండడం చేత రెండో వెన్నుపోటు ఘట్టం చూపలేరు, మనం అర్థం చేసుకోగలం. అందువలన నాదెండ్ల ఎపిసోడ్‌తో ఆపినా కథ రక్తి కట్టేది. ఇంటర్వెల్‌ వరకు హీరో తొలిదశలో కష్టాలు చూపాలి, యాక్టర్‌గా విజయాలు, సినిమాలు చాలనుకోవడం వరకు చూపి, ఇంటర్వెల్‌ తర్వాత పాలిటిక్స్‌లో ఓనమాలు, విజయం, పతనం, మళ్లీ లేవడం చూపితే కథకు కావలసిన ప్రి క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ అన్నీ అమిరేవి. దీన్నంతా 140 ని.లలో చూపితే కథ చిక్కగా ఉండి చకచకా పరిగెట్టేది. ఆ లెక్కన చూస్తే సినిమా జీవితం 70 ని.లలో పూర్తయిపోవాలి. కానీ దాన్ని 170 ని.లకు సాగదీశారు. అందుకే సినిమా స్లోగా వుంది అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

బయోపిక్కే కాదు, బయోడేటా కూడా బ్రీఫ్‌గా వుండాలి. ఉద్యోగానికనే కాదు, వేదిక మీద పరిచయం చేసినప్పుడన్నా సరే, ముఖ్యమైన అంశాలు చెప్పి వూరుకోవాలి. సోది అక్కరలేదు. ఎన్టీయార్‌ గతతరం నటుడు. టీవీల కారణంగా ఆయన సినిమాలు యింకా జనాల్లో ఉన్నాయి కాబట్టి, పేరు పరిచితంగానే ఉంది. మా తరం వాళ్లకు ఆయనపై ఉన్న అభిమానం మా తర్వాతి తరాల వారికి లేదు. వాళ్ల దృష్టిలో ఆయన సాంఘికాల్లో ఓవరాక్టింగు చేసిన ఒక నటుడు, అంతే. ఆయన గురించి మరీ విస్తారంగా తెలుసుకోవాలన్న కుతూహలం ఏమీ లేదు వాళ్లకు. నా బోటి వాళ్లు రాసే ఎనెక్డోట్స్‌ ఆయన గురించి అప్పటికే తెలిసున్నవాళ్లు మాత్రమే చదువుతారు, అవి కొందరికే ఎప్పీల్‌ అవుతాయి. తక్కినవాళ్లు పేజీలు తిప్పేస్తారు. దానిలో వింతేమీ లేదు. నాగయ్య గురించి, సిఎచ్‌ నారాయణరావు గురించి చెప్తే నేను వింటానా? బాలసరస్వతి గురించి, కాంచనమాల గురించి నేను చదువుతానా? కాంచన, గిరిజ గురించి నేను రాస్తే మీరు చదువుతారా? తెలియనివాళ్ల గురించి విశదంగా చెపితే బోరే కదా.

తానావారు అమెరికాలో నాగేశ్వరరావుగారికి ఏదో అవార్డు యిస్తూ ఎయన్నార్‌పై అంటే తెలియని అమెరికా వాళ్ల కోసం ఇంగ్లీషులో డాక్యుమెంటరీ కావాలన్నారు. ''ఫిలిగ్రిమ్స్‌ ప్రోగ్రెస్‌'' పేర నేను రాసిన ఆ డాక్యుమెంటరీ 7 ని.లు ఉంటుందంతే. సినిమా అనే మాధ్యమం ద్వారా ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగేడు అన్నది థీమ్‌. అంత క్రిస్ప్‌గా చెపితేనే ఆదరిస్తారు. వాళ్లకు విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ అందరూ ఒకేలా అనిపిస్తారు. అందువలన అన్ని వివరాలు అక్కరలేదు. యాక్టరు ముక్కూమొహం తెలియనివాడు కూడా ఆ జీవితంలో డ్రామా చూసి పరవశించాలి. ''దంగల్‌''లో ఆ కుస్తీ పట్టే అమ్మాయిలెవరో నాకు తెలియదు, చైనావాళ్లకూ తెలిసి వుండదు. కానీ సినిమా అక్కడా నడిచింది. ఇక్కడ ఎమోషన్స్‌ ముఖ్యం. అది దీనిలో పండిందా అన్నది చూసినవాళ్లే చెప్పగలుగుతారు. ఎన్టీయార్‌ ఎవరో తెలియనివారు యిప్పుడీ బయోపిక్‌ చూసి డ్రామా ఉందనుకుంటారా? అనేదే ప్రశ్న.

దంగల్‌ సినిమాలో ఆ అమ్మాయిలు ఆ స్థాయికి రావడానికి పడిన కష్టాలే సినిమా. మొదట్లో శ్రమించడం, తర్వాత ఫోకస్‌ చెడడం, కోచ్‌-తండ్రి మధ్య ఘర్షణ, చివర్లో విజయం. ఆ తర్వాత ఎన్ని ఎవార్డులు తెచ్చుకున్నా అవి మనకు చూపించలేదు, మనకు అనవసరం కూడా. అలాగే ఎన్టీయార్‌ సినీజీవితం 70 ని.లు అనుకుంటే దానిలోనే చదువులో ఫెయిలవడం, బాంబేలో విఫల ప్రయత్నాలు, పాల వ్యాపారం ఎట్సెట్రా చూపిస్తే హీరో ఆత్మీయుడిగా అనిపిస్తాడు. కానీ అది చూపించాలంటే బాలకృష్ణ కంటె వయసు తక్కువున్న మరో నటుణ్ని మొదటి ఎన్టీయార్‌గా చూపాలి, కానీ బాలయ్య ఒప్పుకున్నట్లు లేదు, అందువలన ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచే మొదలు పెట్టారు, దానికి ముందున్న కష్టాలు ఎగిరిపోయాయి. సినీనిర్మాతగా మారిన తర్వాత రెండు అపజయాలు ఎదురైతే అదీ చూపించినట్లు లేదు. అందువలన చివరకు గొప్పవాడి గురించిన డాక్యుమెంటరీలా తయారైంది.

ఇలాటి కథలలో హీరో తక్కువగా కనబడుతూ అభిమాని దృక్కోణంలోంచి తీస్తే బాగుంటాయి. చూడండి, దేవుడి సినిమాల కంటె పాండురంగడు, అన్నమయ్య, తుకారాం వంటి, భక్తుడి సినిమాలు బాగా ఆడతాయి. అలాగే హీరో కంటె అభిమానిని మెయిన్‌ కారెక్టరు చేయాలి. అప్పుడు ఆ పాత్రతో ప్రేక్షకుడు తాదాత్మ్యం చెందుతాడు. ఆ అభిమానిని ఎన్టీయార్‌ అభిమానసంఘం సభ్యుడిగా చేస్తే అతని ద్వారా చాలా కథ వేగంగా చెప్పేయవచ్చు. ఎన్టీయార్‌  గెలిచినప్పుడు గంతులేసినట్లు, పదవి పోగొట్టుకున్నపుడు ఏడ్చినట్లు, ఆ ప్రజాపోరాటంలో పాలు పంచుకున్నట్లు, మళ్లీ పదవి దక్కినపుడు పొంగిపోయినట్లు చూపిస్తే ప్రేక్షకుడు అతనితో ఐడెండిఫై అవుతాడు. ఎందుకోగానీ ఆ బాట ఎంచుకోలేదు దర్శకరచయితలు.

మహానటిలో ఫ్యామిలీ విషయాలు చూపిస్తే జనాలకు నచ్చింది కాబట్టి దీన్ని కూడా ఫ్యామిలీ సెంటిమెంటు సినిమాగా మలచబోయారనుకుంటా. ఇది మా అమ్మానాన్న ల సినిమా అంటున్నారు బాలకృష్ణ. ఎన్టీయార్‌, ఆయన భార్యల మధ్య అనుబంధం గురించి యిప్పటిదాకా ఎక్కువగా చర్చలోకి రాలేదు. రామారావు ఆవిడను వెలుగులోకి తీసుకురాలేదు. ఆవిడ పోయాక ఆవిడ పేర కాన్సర్‌ ఆసుపత్రి పెట్టారు తప్ప బతికి వుండగా ఆవిడ పేర ఏ సంస్థా పెట్టలేదు, రామకృష్ణ థియేటర్‌, రామకృష్ణ స్టూడియో… అంటూ చనిపోయిన పెద్దకొడుకు పేరే పెట్టారు. తన పేర పెట్టిన 'తారకరామ' సినిమా హాలు పేరులో ఆవిడ పేరు కలిసిందని తృప్తి పడాలంతే. అదే ఎయన్నార్‌ అయితే భార్య పేర అన్నపూర్ణ పల్వరైజింగ్‌ అనే పరిశ్రమ పెట్టారు, స్టూడియో కట్టారు.

భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంత బలమైనది అనేది వారికే తెలుస్తుంది. తనకు అందరు బిడ్డలను కనియిచ్చిన భార్య వ్యాధిపీడితురాలై చనిపోయాక ఎన్టీయార్‌ సన్యాసిగా మిగిలిపోయి వుంటే ఆయనకు ఆవిడ మీద అంతులేని ప్రేమ అనే మాట స్థిరపడేది. నిజానికి ఆయన సన్యాసం తీసుకున్నపుడు ఎందుకు తీసుకున్నారో పలు రకాల కారణాలు చెప్పారు కానీ భార్యపోయిన వైరాగ్యంతో అని మాత్రం చెప్పలేదు. భార్యపోయిన 8 ఏళ్లకే తోడుకోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక హుందాతనం మరచి, పూలరంగడిలా రంగురంగు బట్టలు వేసుకుని రాజకీయవేదికలపై రెండో భార్యతో కలిసి స్టెప్పులు వేశారు. అందువలన రామారావు-బసకతారకం గార్ల ప్రేమ అనేది ఆవిడ పక్షం నుంచి మాత్రమే కనబడుతుంది. అసలా యాంగిల్‌ తీసుకోకుండా ఉంటే బాగుండేది.

కానీ సినిమా ప్రారంభమే ఆవిడ అనారోగ్యంతో మొదలుపెట్టి, ఆవిడ త్యాగాన్ని, నమ్మకాన్ని ఎస్టాబ్లిష్‌ చేసి, ఆవిణ్ని ఎలివేట్‌ చేశారు. కానీ ఆ క్రమంలో ముఖ్యపాత్రధారిపై విముఖత కలుగుతుంది – 'పాపం యీవిడ యింత చేస్తే యివన్నీ మర్చిపోయి, యింకో వివాహిత ప్రేమలో పడ్డాడా?' అని. అది అభిలషణీయం కాదు. ఎన్టీయార్‌ బయోపిక్‌ అనగానే టిడిపి చాలా శ్రద్ధ తీసుకుంది. మంత్రుల దగ్గర్నుంచి ప్రచారపర్వంలో పాల్గొన్నారు. వాళ్లు హాలుకి వెళ్లి సినిమా చూస్తే అది కూడా పెద్ద వార్తలా టీవీలు చూపించాయి. వాళ్లింత హైరాన పడినా అనుకున్నంత బజ్‌ రాలేదు. అనేక థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం చేతనో, టిక్కెట్ల ధరలు పెంచేయడం చేతనో ఏమో, జనం విరగబడలేదు.

మల్టీప్లెక్స్‌లలో ఉన్న సందడి మామూలు థియేటర్లలో లేదంటున్నారు. రెండో రోజున కలక్షన్లలో డ్రాప్‌ ఉందని వినబడింది. పోటీగా విడుదలయ్యే సినిమాల జయాపజయాలపై దీని కలక్షన్లు ఆధారపడతాయి కాబోలు. సినిమా దాని కాళ్లపై అది నిలబడితేనే అందం. ఎన్టీయార్‌ వంటి మహావ్యక్తిపై  తీసిన బయోపిక్‌ ఉండవలసినంత స్థాయిలో లేదంటున్నారు. బయోపిక్‌లు ప్లాను చేస్తున్న యితరులు దీని నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉందనిపిస్తోంది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
[email protected]