రివ్యూ: వినయ విధేయ రామ
రేటింగ్: 2/5
బ్యానర్: డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: రామ్ చరణ్, కియరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, హేమ, పృధ్వీ, మధుమిత, రవివర్మ, ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్ తదితరులు
మాటలు: ఎం. రత్నం
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
ఛాయాగ్రహణం: రిషి పంజాబి, ఆర్థర్ ఏ. విల్సన్
నిర్మాత: డి.వి.వి. దానయ్య
కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: జనవరి 11, 2019
ఫార్ములా సినిమాల్లో ఎక్కువ శాతం చిత్రాలు చూసిన ప్రేక్షకులని కన్‌ఫ్యూజన్‌లో వదిలేస్తుంటాయి. బాగుందా, బాలేదా, ఫర్లేదా… మనకి నచ్చకపోయినా ఆడుతుందా, ఆడుతుందంటే జనానికి నచ్చిందన్నట్టేనా… ఇలా రకరకాల డిస్కషన్లకి సగటు సో-కాల్డ్ కమర్షియల్ చిత్రాలు తావిస్తాయి. అయితే ఫార్ములాని పక్కాగా అప్లయ్ చేసి, హీరోయిజం పీక్స్‌లో చూపించి, అన్ని వర్గాల వారికీ కావాల్సిన అంశాలు కలగలిపి మెప్పించిన సినిమాలు ఇన్‌స్టంట్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటాయి. అదే కొన్ని సినిమాలు మాత్రం మొదటి సీన్ నుంచే ట్రాక్ తప్పేసాయనే హింట్స్ ఇచ్చి, మొదలయిన పది నిమిషాలకే డిస్కషన్ కూడా అవసరం లేదని, డౌట్స్ కూడా పడనక్కర్లేదని 'యునానిమస్'గా ఒకటే మాట మీదకి చూసిన వారందరినీ తెచ్చేస్తాయి. అదేంటో ఫార్ములాని ఫౌంటెయిన్ పెన్‌లో నింపేసుకున్నారని, మాస్ పల్స్‌ని పట్టడంలో డాక్టరేటు అందుకున్న డైరెక్టర్లని పేరున్న వారి నుంచే ఆ మొదటి రకం, ఈ రెండవ రకం సినిమాలు కూడా వస్తుంటాయి.
'ఇంద్ర', 'నరసింహనాయుడు' తీసిన బి. గోపాల్ నుంచే 'పలనాటి బ్రహ్మనాయుడు' వచ్చినట్టు, 'ఆది', 'ఠాగూర్' ఇచ్చిన వినాయక్ ఖాతాలోనే 'ఇంటిలిజెంట్' చేరినట్టు, 'లెజెండ్', 'సరైనోడు' లాంటి మాస్ హిట్లు ఇచ్చిన బోయపాటి తన ప్రతిభకి మరోవైపుని 'వినయ విధేయ రామ'తో చూపెట్టాడు. మాస్‌కి నచ్చే అంశాలంటూ కొన్ని సార్లు హద్దులు దాటినా కానీ, కాలం కలిసి రావడం వల్ల, మిశ్రమం చిక్కగా వుండడం వల్ల కొన్ని కొన్ని చిత్రాలు పాస్ అయిపోతుంటాయి. విజయాలు ఎపుడూ బ్లఫ్ చేస్తుంటాయి. ఎందుకంటే సక్సెస్‌లో బలాలు హైలైట్ అయి, బలహీనతలు కవర్ అవుతుంటాయి. ఆ బలహీనతలని గుర్తించలేనపుడు అవే బలాలనే భ్రమకి గురయి వాటితోనే తదుపరి సృష్టిని నింపేసే ప్రమాదం వుంది. ఇంతకుముందు బోయపాటి తీసిన సక్సెస్‌ఫుల్ సినిమాల్లో 'చెల్లిపోయిన' వాటిని ఈసారి అదే పనిగా చేసుకుంటూ పోవడంతో 'ఛెళ్ళున' తగిలింది.
ఫలానా తరహా చిత్రాల్లో తనని చూడడం లేదని గుర్తించిన నటుడు కొత్త పంథా పట్టి రెండు మంచి చిత్రాలు ఇచ్చిన తర్వాత మళ్లీ పాత రూట్లోకి వెళ్లి ఒక 'రాయేసి' చూడాలనుకోవడం ఏమి లాజిక్కో అర్థం కాలేదు. ఆ రాయి కాసుల కుండని కొడితే భేషు. కానీ దాని వల్ల తల బొప్పి కడితే ఎలా బాసూ? చిత్రమేమిటంటే… చరణ్‌ని తిప్పికొట్టిన ఏ సినిమాలోను ఇంత 'సెన్స్‌లెస్ మాస్' సీన్లు చేయలేదు. దర్శకుడి శైలిపై నమ్మకం వుండొచ్చు కానీ అతనేమి తీసినా ''ఆయన స్టయిలంతే'' అని అప్రూవ్ చేసేస్తే ఆనక తీరిగ్గా చింతించక తప్పదు.
ఉదాహరణకి… అన్నయ్య ప్రమాదంలో వున్నాడని ఎయిర్‌పోర్టులో వుండగా తమ్ముడికి తెలుస్తుంది. వెంటనే వెళ్లాలి… హడావిడిగా ఎలా వెళ్లినా అర్జన్సీ అర్థమవుతుంది. కానీ ఈ సినిమాలో హీరో గ్లాస్ డోర్ బద్దలుకొట్టుకుంటూ ఎయిర్‌పోర్టులోంచి బయటకి వస్తాడు. రైల్వే స్టేషన్‌కి వెళ్లే టైమ్ లేదు కనుక… వంతెన మీద నుంచి రన్నింగ్ ట్రెయిన్ మీదకి దూకేస్తాడు. లోనికెళ్లి కూర్చుంటే టికెట్ కొనలేదనే లాజిక్ క్రిటిక్స్ అడుగుతారనో ఏమో… బీహార్ వరకు అలాగే రన్నింగ్ ట్రెయిన్‌పై నిలబడి వెళ్లిపోతాడు!
ఎంత బోయపాటిపై నమ్మకం వుంటే మాత్రం మరీ ఇంతటి నాన్సెన్స్‌ని ఎవరైనా ఎలా అప్రూవ్ చేస్తారు? చూస్తున్నది సినిమాలోని సీనా… లేక థమ్సప్ యాడా అనేది అర్థం కాక ప్రేక్షకులు 'ఓ మై పలనాటి బ్రహ్మనాయుడూ' అనుకుంటారు. మరో సన్నివేశంలో హీరో ఒకే వేటులో విలన్‌గారి సోదరుల తలలు తెగనరికితే, ఎగిరిన ఆ తలలని అక్కడే ఎగురుతున్న గద్దలు ఎత్తుకుపోతే… ఆ తలల కోసం తుపాకులు పేలుస్తూ సదరు విలన్ మందినేసుకుని వాటి వెంట పరుగులు తీస్తుంటాడు.
తెరపై జరిగే హింస చూడలేక అలమటించే ప్రేక్షకులు సెల్ఫ్ పిటీ చూపించుకోకుండా, ఇలాంటి సన్నివేశాలు చెబుతోంటే తలాడించుకుంటూ చేసేసిన నటీనటులపై సింపతీ చూపిస్తారు. ఎంత మాస్ మసాలా పేరిట లౌడ్ సీన్లు తీసినా కానీ బోయపాటి ప్రతి చిత్రంలోను ఒక పద్ధతైన కథ, కథనం వుంటుంది. కానీ ఈ చిత్రంలో బేసిక్ స్టోరీ కూడా లేదు. ఒక రెండు యాక్షన్ ఎపిసోడ్స్ అనుకుని వాటి చుట్టూ అల్లుకున్న కథలాంటిదేదో వుంది. దారంలా వున్న దానిని ఫాలో అవడం కూడా చాలా కష్టంగా వుంటుంది.
ఏ సీన్ ఎప్పుడు జరుగుతోందో, ఎక్కడ జరుగుతోందనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా రాసుకున్న నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే… అసలే చిందరవందరగా వున్న దానిని మరి కాస్త అస్తవ్యస్తం చేసేసింది. హీరో ఫ్రేమ్‌లోకి వస్తే రాళ్లు పగలగొట్టుకుని రావాలి, విలన్ ఎంటర్ అయితే దుమ్ము రేగుతుండాలి, ప్రతి ఆర్టిస్ట్ ముఖమ్మీద ప్రొపెల్లర్లు అదే పనిగా వెయ్యాలి… అంటూ ఖచ్చితమైన షరతులు పెట్టుకుని మరీ సన్నివేశాలని డిజైన్ చేసినట్టుంది.
చరణ్ అంటే 'రంగస్థలం' రిజల్ట్ ఏమవుతుందనే దానిపై భరోసా లేక సేఫ్ సైడ్‌గా ఈ మాస్ సినిమాని లూప్‌లో పెట్టి వుంచాడనుకున్నా, వివేక్ ఒబెరాయ్‌కి ఏమి చెప్పి ఈ పాత్ర ఒప్పించాడో బోయపాటికే తెలియాలి. ఫ్రేమ్‌లో వున్న ప్రతి ఆర్టిస్ట్ ఆవేశంతో ఊగిపోతూనో, ఆవేదనతో కృంగిపోతూనో, ఆనందంతో పొంగిపోతూనో కనిపించడంతో 'ఓవరాక్షన్'కి నిఘంటువులో వున్న అర్థాల సరసన 'వినయ విధేయ రామ' చేర్చవచ్చుననిపిస్తుంది. మామూలుగా మంచి ఆర్టిస్టులు అయిన వాళ్లు కూడా ముఖమ్మీద ప్రొపెల్లర్లు తిరుగుతోన్న ప్రభావం వలనో, లేక రేగిన దుమ్ము కళ్లల్లో పడుతున్నా తుడుచుకోలేక పోతున్న ఫ్రస్ట్రేషన్ కారణంగానో రూపాయికి పది రూపాయల అవుట్‌పుట్ ఇచ్చారో ఏమో తెలీదు మరి.
స్నేహ లాంటి సటిల్ యాక్టర్ కూడా టీవీ సీరియల్ అత్తగారిలా తాండవం ఆడేసిందంటే 'పబ్లిక్ వాంట్ దట్ అతి' అంటూ ఎంతగా కన్విన్స్ చేసారో బోయపాటి. మంచి పాట ఇచ్చినా ఇందులో వేస్ట్ అయిపోతుందనో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా చేసినా ప్రయోజనం వుండదనో దేవిశ్రీప్రసాద్ సబ్‌స్టాండర్డ్ అవుట్‌పుట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి కేవలం ఇద్దరే ఎడిటర్లు సరిపోయారంటే అదో రికార్డు. ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే యాక్షన్ డైరెక్టర్ ఈస్థాయి విధ్వంసం సృష్టించి వుంటాడు?
ట్రెయిలర్ ఏమిటి అలా కట్ చేసారనుకున్న వారికి 'సమాధానం' సినిమాలో దొరుకుతుంది. అంతకుమించి కట్ చేయడానికి ఏమీ లేదు మరి. కామెడీ కానీ, రొమాన్స్ కానీ ఆ ట్రెయిలర్‌లో జోడించినట్టయితే ఈపాటికే అభిమానులకి ఫుల్ క్లారిటీ వచ్చేసి వుండేది. ఇందులోని సదరు కామెడీ దృశ్యాలు చూస్తే, దీనికి బదులు మరో రెండు ఫైట్లు పెట్టి ఇంకో వంద తలలు నరికేసి వుండాల్సిందనిపిస్తుంది. అనాధల ఎమోషన్స్ పండుతున్నాయని ఫీలయ్యారు కానీ వాళ్లు ఏడుస్తుంటే మనకి నవ్వొస్తుంటుంది.
స్పైడర్ సినిమాలో చెప్పినట్టుగా ప్రతి మనిషిలో వుండే ఆ నాలుగు శాతం శాడిజాన్ని నిద్ర లేపడం కూడా ఓ ఆర్టే అనుకోవాలి. సినిమా అంతటికీ కాస్త ఊపునిచ్చే సీన్ ఏదైనా వుందంటే అది పందెం పరశురాంకి రామ్ కొణిదెల వార్నింగ్ ఇచ్చేది. అది బిగినింగ్‌లోనే అయిపోతుంది కనుక ఆ తర్వాత అంతా రాముడిది అడవి దారి. ఇకపై ఈ జోనర్‌కి ఎంత దూరంగా వుండాలనే దానిపై చరణ్‌కి ఈ సినిమాతో ఒక స్పష్టమైన ఐడియా వచ్చేస్తుంది.
''మాస్‌కి ఇంతకంటే ఏమి కావాలి'' అనే ఐడియాలజీ నుంచి బయటపడి సోల్ సెర్చింగ్ చేసుకోవడానికి బోయపాటికీ ఒక అవకాశమిస్తుంది. రెండో రోజు వసూళ్ల గురించిన చింతలేకుండా మొదటిరోజే ఫాన్స్‌కి స్పష్టతనిస్తుంది. బ్రాండ్ నేమ్‌ని నమ్మి బ్లయిండ్‌గా వెళ్లిపోతే ఏమవుతుందనేది వరుసగా రెండో సంక్రాంతి ఫ్లడ్ లైట్ వేసి మరీ చూపించింది.
బాటమ్ లైన్: విలయ వినాశక రామా!