హనీ ట్రాప్ గురించి చాలామందికి తెలిసిందే. అందంగా కనిపించి, కవ్విస్తారు. రహస్యాలు రాబడతారు. లేదంటే సీక్రెట్ గా కెమెరాలు పెడతారు. ఇక ఆ తర్వాత అసలు బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతారు. మరి ఇవే పనుల్ని ఓ లేడీ కానిస్టేబుల్ చేస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్ లో బయటపడింది ఈ లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్ వ్యవహారం.
కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సంధ్యారాణికి డబ్బున్నోళ్లను టార్గెట్ చేయడం అలవాటు. మెల్లగా ట్రాప్ లోకి లాగి తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంది. అలా ఇప్పటికే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంది. ఈ ముగ్గుర్లో ఒకరు ఈమె బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంటే, మరో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో వ్యక్తిని ట్రాప్ చేసింది.
షాబాద్ మండలానికి చెందిన చరణ్ తేజ్ ను ట్రాప్ చేసింది సంధ్యారాణి. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజ్ ను మెల్లగా ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంది. ఆర్య సమాజంలో తప్పు సాక్ష్యాలు సృష్టించి మరీ చరణ్ తేజ్ ను పెళ్లాడిన సదరు కానిస్టేబుల్, ఇప్పుడు అతడికి చుక్కలు చూపిస్తోంది.
సంధ్యారాణిని పెళ్లి చేసుకున్న తర్వాత చరణ్ తేజ్ కు అసలు విషయం తెలిసింది. ఆమెకు ఇప్పటికే 3 పెళ్లిళ్లు అయ్యాయని, రెండేళ్ల పాప కూడా ఉందనే విషయం తెలుసుకున్నాడు. అంతలోనే సంధ్యారాణి అతడ్ని హౌజ్ అరెస్ట్ చేసింది. బయటకు చెబితే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించింది. అంతేకాదు.. మతమార్పిడి చేసుకోమని కూడా బలవంతం పెట్టసాగింది.
దీంతో చరణ్ తేజ్ కు విషయం బోధపడింది. వెంటనే అతడు శంషాబాద్ డీసీపీకి కంప్లయింట్ చేశాడు. 7 నెలలుగా ఇంట్లో నిర్బంధంగా ఉన్న తనను విడిపించమని కోరాడు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు చరణ్ తేజ్.