భాజపా జనాలు కాస్త తమ వెనక్కి కూడా చూసుకోవడం నేర్చుకోవాలి. 'సత్య' కాలపు మాటలు మాట్లాడే భాజపా నాయకులు తమ ప్రభుత్వాలు వున్న రాష్ట్రాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ ఎంత ఘనంగా వుందో తెలుసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై విమర్శలు కురిపించి కమలనాధులు అప్పుడప్పుడు ఉత్తరాదిలోని భాజపా పాలిత రాష్ట్రాల పరిస్థితిని పరిశీలించాలి.
ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి ఘోరంగా వుందని ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో సిఎమ్ యోగి పాలనపై ఆ మధ్య అంతా ఘనమైన ఫోస్టులు కనిపించేవి. అవి నిజమో కాదో కూడా తెలియదు కానీ విపరీతంగా చలామణీ అయిపోయాయి. రాను రాను యోగి పాలనపై మబ్బులు విడిపోతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో ఇనుప తెర వుంది. నిజాలు బయటకు రావు అనే విమర్శలు వున్నాయి. ఆ మధ్య భాజపా నాయకుల వైపు నుంచి కూడా ఇలాంటి విమర్శలు రావడం విశేషం. లేటెస్ట్ గా అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి కామెంట్ చేసింది. యుపి లో వైద్య సదుపాయాల పరిస్ఝితిని విశ్లేషిస్తూ, 'ఇక అంతా దేవుడి దయ' అని ముక్తాయించింది. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మన రాష్ట్రాల్లో అయితే కోర్టులు ఎడా పెడా ప్రభుత్వాలను నిలదీసి, పని చేసేలా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కానీ చిత్రంగా అలహాబాద్ హైకోర్టు మాత్రం 'ఇక అంతా దేవుడి దయ' అని ఊరుకోవడం ఏమిటో? యుపిలో వైద్య సదుపాయాల పరస్థితిని, తమ ముందు వున్న గణాంకాలను కోర్టు ఏకరవు పెడితే తెలుగు రాష్ట్రాలు ఎంత ముందు వున్నాయో అర్థం అవుతుంది.
అయితే ఇక్కడ మన భాజపా నాయకులకు తృప్తి తక్కువ. విమర్శలు చేస్తూనే వుంటారు. ముందుగా వీళ్లు వెళ్లి యుపిలో పర్యటించి వస్తే, తెలుగు రాష్ట్రాలు వీళ్ల కళ్లకు అద్భుతంగా కనిపిస్తాయేమో? కానీ అలా చేయరు కదా,. తమ నలుపు సంగతి అనవసరం. ఇరు రాష్ట్రాల సిఎమ్ ల మీద విమర్శలు చేసి, తాము ఇంకా రంగంలో వున్నామోచ్ అనిపించుకుంటూ వుంటారు.
అందుకే జనాలకు కూడా వీళ్ల సంగతి అర్థం అయిపోయింది. ఎక్కడిక్కడ చెక్ చెబుతూ మూలన కూర్చోబెడుతూనే వున్నారు. జనసేన లాంటి వాటి తోక పట్టుుని అధికారం ఈదాలనే ప్రయత్నం చేస్తున్నా, పలితం రానిది అందుకేనేమో?