తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్లడం అలా ఉంచితే, కనీసం తన పార్టీ కార్యకర్తల మధ్యకు కూడా వెళ్లడం లేదు చాలా నెలలుగా. ఎన్నికల ప్రచారాలు మాత్రమే కాస్త మినహాయింపు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఏకంగా వారం రోజులు కేటాయించారు. ఎన్నికలు వస్తే తప్ప చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వీడి ఏపీకి వెళ్లడం లేదు.
ఆఖరుకు ఆయన తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గురించి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కుప్పం పరిధిలో కరోనా బాధితుల గురించి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారికి ఏం సౌకర్యాలున్నాయో, లేవో.. డైరెక్టుగా వెళ్లి పర్యవేక్షించడం జరిగే పని కాదని స్పష్టం అవుతూనే ఉంది.
చంద్రబాబును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు కనీసం తమకు గోడును వెళ్లబోసుకోవడానికి కూడా ప్రజాప్రతినిధి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు కుప్పం ప్రజానీకం.
ఆ సంగతలా ఉంచితే… ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా చంద్రబాబు నాయుడు హాజరు కారని తెలుస్తోంది. ఈ గురువారం ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమావేశాలకు టీడీపీ హాజరు కావడం లేదట!
కోవిడ్-19 పరిస్థితుల గురించి కూడా అసెంబ్లీలో, మండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరులోని లోటుపాట్లను ప్రస్తావించి, విమర్శలు చేసి, కనీసం సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీపై ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లాంటివి.
పదే పదే అఖిలపక్షం పెట్టాలి అంటూ చంద్రబాబు నాయుడు తెగ డిమాండ్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీకి అయినా హాజరు కావాల్సిన బాధ్యత ఆయనపై ఉండవచ్చు. అయితే ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు టీడీపీ హాజరు కావడం లేదని వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబునాయుడు, లోకేష్ లు హైదరాబాద్ వీడి రావాలని అనుకోవడం లేదని.. అందుకే టీడీపీ ఈ సమావేశానికి హాజరు కాబోదని తెలుస్తోంది. జూమ్ మీటింగుల్లో మాట్లాడటమే తప్ప.. ఇక ఇప్పుడప్పుడే జనం మధ్యకు, సభకూ టీడీపీ అధినేత హాజరు కారేమో!