గంటా రాజీనా..? మాజీనా..?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేశంగా రాజీనామా చేశారు. వైరి పక్షాలు సెటైర్లు వేసేసరికి ఎవరికి ఏ ఫార్మేట్ లో కావాలో రాసుకోండి అంటూ సవాల్ విసిరారు. …

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేశంగా రాజీనామా చేశారు. వైరి పక్షాలు సెటైర్లు వేసేసరికి ఎవరికి ఏ ఫార్మేట్ లో కావాలో రాసుకోండి అంటూ సవాల్ విసిరారు. 

స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడమే కాదు, నేరుగా తమ్మినేని సీతారాంని కలసి తన రాజీనామా ఆమోదించాలని కోరారు. అయితే అప్పటికప్పుడు దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. రాగాపోగా.. ఇప్పుడు జరగాల్సిన బడ్జెట్ సమావేశాల్లో గంటా రాజీనామా వ్యవహారం తెరపైకి వచ్చే అవకాశముంది.

తనతోపాటు అందరు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలంటూ గతంలో గంటా సవాల్ విసిరినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో ఆయన ఒక్కరే రాజీ 'డ్రామా'లో ఏకపాత్రాభినయం చేస్తూ వచ్చారు. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందనేది అంతుచిక్కని ప్రశ్న. త్వరలోనే జరగనున్న ఏపీ బడ్జెట్ సమావేశాల నాటికి గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

అసెంబ్లీ సమావేశాలు జరిగితే.. గంటా తన రాజీనామా కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ స్వలాభం పొందేందుకు ఆయన ఎన్ని డ్రామాలైనా ఆడతారనడంలో అనుమానం లేదు. అయితే ప్రభుత్వం గంటా రాజీనామా డ్రామా రక్తికట్టేందుకు సహకరిస్తుందా లేదా అనేది డౌటే.

గంటా రాజీనామా ఆమోదిస్తే.. మరోసారి స్టీల్ ప్లాంట్ అంశం కూడా తెరపైకి వస్తుంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మరుగున పడింది. ఉద్యోగుల సమ్మె, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా తగ్గిపోయాయి. 

మరోవైపు మెడికల్ ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ వార్తల్లో నిలిచింది. ఈ దశలో స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై అసలు కేంద్రం వైఖరి కూడా స్పష్టం కావాల్సి ఉంది. సెకండ్ వేవ్ దెబ్బతోపాటు, అసెంబ్లీ ఫలితాల ప్రభావం కూడా మోదీపై బాగానే కనిపిస్తోంది.

ఈ దశలో ఆయన ఏపీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతారో లేదో చూడాలి. అవన్నీ తేలే వరకు గంటా పట్టుబట్టినా.. స్పీకర్ మాత్రం రాజీనామా వ్యవహారాన్ని పక్కనపెట్టే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.