వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మీద ఏపీ సీఐడీ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అసభ్య పదజాలంతో ప్రభుత్వాన్ని దూషించారని, అలాగే ప్రముఖుల మీద కూడా శృతి మించి నోరు చేసుకున్నారని సీఐడీ అభియోగాలు మోపింది.
సరే ఇవన్నీ ఆయన విచారణంలో తేలే అంశాలు. వాటి సంగతి అలా ఉంచితే రెండేళ్ళ క్రితం నర్సాపురం నుంచి లోక్ సభకు వైసీపీ ఎంపీగా రఘురామక్రిష్ణంరాజు గెలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఆయన ఢిల్లీలో రచ్చబండ పేరిట రాజకీయ యుద్ధం చేస్తూ తనను గెలిపించిన ప్రజల బాగోగులు మరచిపోయారన్నది కూడా అతి కీలకమైన ఆరోపణ. ఆయన సహచరుడు, విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు.
తాను కూడా నర్సాపురం లోక్ సభ పరిధిలోకి వచ్చే ఒక గ్రామ వాసినని, రాజు ఎంపీ అయ్యాక తమ ప్రాంతానికి ఎపుడూ రాలేదని ఆయన అంటున్నారు.
ఇంకా చెప్పాలంటే గత పద్నాలుగు నెలలుగా ఆయన నియోజకవర్గం ముఖం అసలు చూడలేదని కూడా చెబుతున్నారు. ఈ మధ్యలో రెండు సార్లు కరోనా వచ్చి జనాలు అల్లల్లాడుతున్నారని, మరి ఎంపీ కనీసం తనను ఎన్నుకున్న జనాలు ఎలా ఉన్నారు అన్నదైనా ఆరా తీశారా అని ఎంవీవీ ప్రశ్నిస్తున్నారు.
జగన్ దయతో తాను గెలవలేదు అంటున్న రఘురామరాజు తక్షణం తన పదవికి రాజీనామా చేసి విపక్షల అభ్యర్ధిగా రంగంలోకి దిగి సత్తా తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. మొత్తానికి రఘురామను గెలిపించిన నర్సాపురం ఓటర్లలో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ఒక ఎంపీగా ఆయన చేసిందేంటి అని నిలదీస్తున్నారిపుడు.