ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? నాయకుడు చంద్రబాబు తేడాగా ఉంటే, సైనికుడు అయ్యన్న నిజాయితీగా ఎలా ఉంటాడు? కరకట్టపై కట్టిన అక్రమ నివాసంలో చంద్రబాబు ఉంటే.. అదే ఆక్రమణను అయ్యన్న కూడా ఫాలో అయ్యారు. ఏకంగా పంట కాల్వపై ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. సాక్ష్యాలతో సహా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వివరణ ఇచ్చేసరికి, తేలుకుట్టిన దొంగల్లా అంతా సైలెంట్ అయ్యారు.
నదిని ఆక్రమించిన నాయకుడు..
కృష్ణానది కరకట్టను ఆక్రమించి చంద్రబాబు ప్రజా వేదిక నిర్మించారు. తనపై తప్పు రాకుండా దానికి ప్రజా వేదిక అని పేరు పెట్టుకున్నారు, ప్రజల నుంచి అర్జీలు తీసుకునేందుకు వేదిక అని చెప్పుకున్నారు. కానీ బాబుకి అదో గెస్ట్ హౌస్.
హైదరాబాద్ లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లకు అలవాటు పడి, ఇక్కడకు వచ్చాక ఇలా రివర్ వ్యూ గెస్ట్ హౌస్ కట్టుకున్నారనమాట. ఈ అక్రమాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసిన జగన్, అధికారంలోకి రాగానే తొలి వేటు వేశారు. ప్రజా వేదిక కూల్చేశారంటూ టీడీపీ రెచ్చిపోయినా, జగన్ తన పని తాను చేశారు.
చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం (లింగమనేని గెస్ట్ హౌజ్), ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కూడా అక్రమ నిర్మాణాలే. నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన కట్టడాలే. గతంలో కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు, ఈ ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. అప్పటికే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారనుకోండి. అది వేరే విషయం.
కాల్వను ఆక్రమించిన అనుచరుడు..
అప్పుడు బాబు నదిని ఆక్రమించిన విషయం కూల్చివేతతో వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు అయ్యన్న కాల్వను ఆక్రమించి కట్టుకున్న ఇంటి వ్యవహారం.. ప్రహరీ కూల్చివేతతోనే వెలుగులోకి వచ్చింది. దాదాపు 2 సెంట్ల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా, అడిగేవారెవరూ లేరని ప్రహరీ నిర్మించుకున్నారు. ఇది పక్కా.
కానీ ఇక్కడ బీసీపై దాడి, బడుగులపై పిడుగు అంటూ రచ్చ చేస్తున్నారు టీడీపీ నేతలు. అప్పట్లో కూడా ప్రజావేదిక కూల్చివేత సమయంలో ఇలానే అసంబద్ధంగా మాట్లాడారు, రచ్చ రచ్చ చేశారు, చివరకు చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నిజ నిర్థారణతో అయ్యన్న సహా అందరి నోళ్లు మూతపడ్డాయి.
ఇంకెన్నిచోట్ల ఆక్రమణలు ఉన్నాయో..?
అధికారంలో ఉండగా చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆక్రమణలు, దురాక్రమణలు అన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయి. కాకపోతే కాస్త ఆలస్యం కావడంతో రాజకీయ కక్షసాధింపులనే విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పుడు అయ్యన్న ఎపిసోడ్ తో అధికారులు అలర్ట్ అయ్యే అవకాశముంది.
మొత్తమ్మీద అయ్యన్న ఎపిసోడ్ తో ఆక్రమణలు పాల్పడిన మిగతా నాయకులు కూడా హడావిడి పడుతున్నారనే మాట మాత్రం వాస్తవం.