రాజ‌కీయ ఆత్మ‌హ‌త్య దిశ‌గా అగ్ర‌హీరో!

రాజకీయాల్లో హత్యలుండవ్… ఆత్మహత్యలు తప్ప అనే నానుడి ఉంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఇది స‌రిగ్గా స‌రిపోతుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ‌కూడ‌దో తెలిసిన వాడే జీవితంలోనూ, రాజ‌కీయాల్లోనూ రాణిస్తారు. అందుకే మాటే మంత్రం…

రాజకీయాల్లో హత్యలుండవ్… ఆత్మహత్యలు తప్ప అనే నానుడి ఉంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఇది స‌రిగ్గా స‌రిపోతుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ‌కూడ‌దో తెలిసిన వాడే జీవితంలోనూ, రాజ‌కీయాల్లోనూ రాణిస్తారు. అందుకే మాటే మంత్రం అంటారు. అంతా మాట‌లోనే ఉంది. మ‌న ఆలోచ‌న‌ల్ని మాట‌లు ప్ర‌తిబింబిస్తాయి. మ‌న‌మేంటో మాట‌ల‌ను బ‌ట్టి ఎదుటి వాళ్లు అంచ‌నా వేస్తారు.

రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫెయిల్ కావ‌డానికి ఆయ‌న మాట‌లే త‌ప్ప మ‌రొక‌టి కార‌ణం కానే కాదు. మాట‌లు కోట‌లు దాట‌డం, ఆచ‌ర‌ణ గ‌డ‌ప దాట‌క‌పోవ‌డ‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణం. వెండితెర‌పై అగ్ర‌హీరోగా రాణిస్తున్న ప‌వ‌న్‌, రాజ‌కీయ తెర‌పై మాత్రం జీరో అయ్యారు. ఎందుకంటే వెండితెర‌పై డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల్సి వుంటుంది. 

రాజ‌కీయ తెర‌పై డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ అన్నీ ఆయ‌న కావ‌డం విశేషం. జ‌న‌సేన స్థాపించి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇంత వ‌ర‌కూ గ‌మ్యం లేకుండా ఆ పార్టీ ప్ర‌యాణం సాగుతోంది. తీరం ఎక్క‌డో తెలియ‌కుండా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ ప‌డ‌వ‌ను న‌డుపుతున్నారు. ఒక కోయిల ముందే కూసింద‌న్న చందంగా పొత్తుల‌పై  స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా మాట్లాడారు. దీంతో ఆయ‌న్ను సొంత వాళ్లు కూడా న‌మ్మ‌లేని ప‌రిస్థితిని కోరి తెచ్చుకున్నారు.

ఇటు ఇంటా, అటు బ‌య‌టా ఎవ‌రూ విశ్వ‌సించ‌లేకున్నారు. ఇదే ప‌వ‌న్ పాలిట శాప‌మైంది. పొత్తులో ఉన్న బీజేపీ న‌మ్మ‌డం లేదు. అలాగే పొత్తు కుదుర్చుకోవాల‌ని భావిస్తున్న టీడీపీ కూడా దూరం జ‌రుగుతోంది. బాప‌ట్ల జిల్లా ప‌ర్చూరులో పొత్తుల‌పై ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ఇవే మాట‌లు మొద‌టి నుంచి చెబుతూ వ‌చ్చి వుంటే ప‌వ‌న్‌కు గౌర‌వం, ఆ పార్టీ అంటే ప్ర‌త్య‌ర్థుల‌కు భ‌యం ఉండేది. అలా కాకుండా వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌నని ప్ర‌క‌టించ‌డంతో …మ‌రోసారి ఆయ‌న చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌నే సంకేతాలు జ‌నంలోకి వెళ్లాయి.

తాము ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సీఎం చేయాల‌ని అనుకుంటుంటే, ఆయ‌నేమో చంద్ర‌బాబును ఆ సీటులో కూచోపెట్టాల‌ని ఉవ్విళ్లూరుతు న్నార‌నే ఆవేద‌న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లోనూ, అభిమానుల్లోనూ క‌నిపించింది. ప‌వ‌న్ కోసం త‌మ శ్ర‌మ అంతా వృథా అవుతుందనే నిరాశ‌ వాళ్ల‌లో క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. ఇది చాల‌దా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు న‌ష్టం క‌లిగించ‌డానికి? మ‌రోవైపు టీడీపీ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. ఒన్‌సైడ్ ల‌వ్ అన్న నాయ‌కుడు, ఆ త‌ర్వాత కాలంలో ఆ ప‌రిస్థితి ప‌వ‌న్‌కు రావ‌డం రాజ‌కీయ విచిత్రం. ఇప్పుడు పొత్తుల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది ఒన్‌సైడ్ ఆరాట‌మైంది.

పొత్తుల విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒంట‌రి అయ్యార‌నేందుకు ఆయ‌న తాజా ప్ర‌క‌టనే నిద‌ర్శ‌నం. పొత్తుల గురించి మాట్లాడే స‌మ‌యం కాద‌ని,  పొత్తు ప్ర‌జ‌ల‌తో త‌ప్ప‌ ఇంకెవ‌రితోనూ లేదని ఆయ‌న తేల్చి చెప్పారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా, అటు వైపు నుంచి ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌వ‌న్‌కు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం త‌ప్ప మ‌రో గ‌త్యంత‌రం లేద‌నే విమ‌ర్శ‌కు దారి తీసింది. 

పొత్తుల‌పై గ‌త మార్చిలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ఇవే మాట‌లు చెప్పి వుంటే… జ‌న‌సేన ఇంత దిగ‌జారిపోయేదా? ప‌వ‌న్ ఇంత‌గా టార్గెట్ అయ్యేవారా? బీజేపీ న‌మ్మ‌కాన్ని కోల్పోయే వారా? ప‌వ‌న్ స్వీయ త‌ప్పిదాల వ‌ల్ల రాజ‌కీయంగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. ఇదే రాజ‌కీయ ఆత్మ‌హ‌త్య అని చెప్ప‌డం. అయితే త‌ప్పుల్ని స‌రిదిద్దుకోడానికి కావాల్సినంత స‌మ‌యం ఉంది. ఆ దిశ‌గా ఆలోచిస్తే మంచిదే.