'ఆ యొక్క భగవంతుడు నోరు ఇచ్చాడు కదా…అని' అనే డైలాగు ఒకటి వుంది పూరి..పవన్ సినిమాలో. అలాగ్గే అనిపిస్తుంది. వారం వారం వండి వార్చే కొత్త పలుకు కాలమ్ చదవితే.
ఒకవారం క్రితం
''..రాష్ట్ర భాజపా నాయకులు చెబుతున్నదాన్ని బట్టి ఆ పారీ కేంద్ర నాయకత్వ వైఖరిలో కొంత మార్పు వచ్చిందంటున్నారు..'' ''తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి భాజపా నాయకత్వం సుముఖంగానే వుందని చెబుతున్నారు..''
అంతకు ముందు వారం
''జగన్ ను అదుపుచేయాల్సింది పోయి, అడిగిందే తడవుగా అప్పులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ప్రజలు ఆగ్రహంగా వున్నారు….''
ఈ వారం
ఆంధ్రలో స్వంతంగా కానీ, జనసేనతో కలిసి కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ముఖ్యమంత్రి జగన్ కు పరోక్షంగా అండదండలు అందించాలన్న నిర్ణయానికి భాజపా వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇవీ పలుకుల తీరు. రాజకీయాలు ఎల్లకాలం ఒక్కలా వుండవు..క్షణం క్షణం మారుతూ వుంటాయి అని సర్ది చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మారుతున్నవి రాజకీయాలు కాదు. రాజకీయ అభిప్రాయాలు అన్నట్లు కనిపిస్తోంది.
మోడీ జగన్ ను వదిలేసి తెలుగుదేశం చెంత చేరితే బాగుండును అనిపించినపుడు ఆ మేరకు రాయడం. తెలుగుదేశం బలం పెరుగుతోంది. భాజపా అవసరం లేదు అనుకున్నపుడు దానికి ఇంకోలా రాయడం.
మైనారిటీలు, స్టీల్ ప్లాంట్ వ్యవహారం, రక్షణశాఖ నియామకాలు అన్నీ కలిసి భాజపాను ప్రజల్లో పలుచన చేస్తున్నాయని ఓ అనుమానం. పైగా చంద్రబాబు చెంతకు రాని పార్టీ అంటే ఏదో ఒక ముద్ర వేసి జనాల్లో ముద్దాయిని చేయాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినపుడు వేరొకలా రాయడం.
తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటోంది…ఏం కోరుకుంటోంది అన్నది తెలుసుకోవడానికి పెద్దగా బుర్ర చించుకోనక్కరలేదు. కొత్త పలుకు చదివితే అర్థం అయిపోతుంది. ఈయన వారిని ఆ దిశగా డ్రయివ్ చేయాలనుకుంటున్నారా? లేదా ఆ పార్టీ ఈయన కలాన్ని ఆ దిశగా మళ్లిస్తోందా? అన్న అనుమానాలు కలుగుతాయి.
మొత్తం మీద ఇవన్నీ చదవుతుంటే కొన్ని విషయాలు తడుతూ వుంటాయి.
భాజపా..జనసేన కలిసి వస్తేనే తెలుగుదేశం పార్టీకి కావాలి.
భాజపా చేయి వదలకుండానే తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవాలన్న భావన జనసేనకు వుంది.
భాజపా కలిసి రాకుంటే దానికి బురద అంటించాలి.
జనసేన కలిసి వస్తే బెటరే..రాకుంటే ఇంకా బెటరే…
మరి కొన్ని వారాలు, మరికొన్ని పలుకులు చదివితే మరింత క్లారిటీ వస్తుందో..మరింత అయోమయం కలుగుతుందో వెయిట్ అండ్ సీ.