తెలంగాణలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కరోనా సమయంలో వినూత్నంగా వ్యవహరిస్తూ ప్రాంతాలకు అతీతంగా మన్ననలు పొందుతున్నారు. అత్యంత కష్టకాలంలో చిన్న ఓదార్పు మాట ఎంతో మానసిక స్థైర్యాన్ని, జీవితంపై భరోసాను ఇస్తుంది. కరోనా సెకెండ్ వేవ్‌లో ఎవరి ప్రాణాలకూ భద్రత లేని దుస్థితి.
కరోనా బారిన పడకుండా చూసుకోవడం ఒక్కటే మనముందున్న ప్రధాన కర్తవ్యం. కరోనా బారిన పడ్డ వారి మానసిక స్థితి ఎంతో ఆందోళనకు గురవుతుంది. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి ధైర్యం నింపేందుకు తెలంగాణ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చేస్తున్న ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తోంది.
ఇలాంటి ఎమ్మెల్యే మనకూ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ప్రజానీకంలో కలిగిస్తోంది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గంలోని కరోనా బాధితులకు ఎమ్మెల్యే నుంచి ఫోన్‌కాల్స్ వెళుతుండడంతో ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
“హలో నేను ఆరూరి రమేశ్‌ను. మీ ఎమ్మెల్యేను. మీ ఆరోగ్యం ఎలా ఉంది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు. మీరెవరూ భయపడొద్దు. ధైర్యానికి మించిన మందు లేదు. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి” అని బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగక్షేమాల గురించి ఆరా తీస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంతో అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని ఆయన సూచిస్తున్నారు.
ఎమ్మెల్యే ఫోన్‌కాల్స్‌పై వర్ధన్నపేట నియోజకవర్గమే కాదు ….రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. మన ఎమ్మెల్యే, ఎంపీ కూడా రమేశ్ లాగా ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగితే ఎంత బాగుంటుందో కదా అని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించే ఎమ్మెల్యే, ఎంపీలు చూద్దామన్నా కనిపించరే!