మోదీ ప్రాతినిథ్య‌ రాష్ట్రంలో ఇదీ దుస్థితి!

క‌రోనా సెకెండ్ వేవ్ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వైద్య సౌక‌ర్యాల‌పై అల‌హాబాద్ తీవ్ర ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక అంతా ఆ దేవుడి ద‌య త‌ప్ప‌, ఏమీ చేయ‌లేమ‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం నిర్వేదం వ్య‌క్తం…

క‌రోనా సెకెండ్ వేవ్ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వైద్య సౌక‌ర్యాల‌పై అల‌హాబాద్ తీవ్ర ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక అంతా ఆ దేవుడి ద‌య త‌ప్ప‌, ఏమీ చేయ‌లేమ‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం నిర్వేదం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆ దేవుడే ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాల‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం దేశ వ్యాప్త దృష్టిని ఆక‌ర్షించింది. అతిపెద్ద బీజేపీ పాలిత రాష్ట్రంలో ద‌య‌నీయ స్థితిని హైకోర్టు వ్యాఖ్య‌లు అద్దం ప‌డుతున్నాయి.

క‌రోనా రోగుల‌కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ దాఖ‌లైన‌ పిటిషన్‌ను అల‌హాబాద్ కోర్టు విచారించింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన అంశాలను ప్రస్తావించింది. వాటిలో ఏప్రిల్‌లో మేరఠ్‌ ఆసుపత్రి నుంచి అదృశ్యమైనట్లు చెప్తోన్న సంతోశ్ కుమార్ కేసు గురించి మాట్లాడుతూ.. ఆస్ప‌త్రి సిబ్బంది వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వైద్య సదుపాయాల గురించి ప్రస్తావించింది. క‌రోనా వ్యాపిస్తున్న ఈ కీల‌క స‌మ‌యంలో రాష్ట్రంలో వైద్యవ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో గ్రహించామ‌ని కోర్టు పేర్కొంది. సాధారణ సమయాల్లోనే ప్ర‌జానీకం అవసరాలు తీర్చలేని వ్యవస్థ.. అలాంటిది మహమ్మారి కాలంలో కూలిపోవాల్సిందేన‌ని పేర్కొంది. 

బిజ్నోర్‌ జిల్లా విషయానికొస్తే..అక్కడ లెవెల్-3 ఆసుపత్రి లేకపోవడం షాకింగ్‌గా ఉంద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఉన్న మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవ‌లం 150 పడకలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఇక వెంటిలేటర్ల గురించి చెప్పనవసరం లేదని హైకోర్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

ఇక గ్రామీణ ప్రాంతాల్లో 32లక్షల మందికి కేవ‌లం 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయని హైకోర్టు ఆవేద‌న‌తో చెప్పింది. ఈ లెక్క‌న మూడు లక్షల మందికి 30 పడకలు ఉండ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది. ఇక‌ ఆక్సిజన్ సిలిండర్ల సామర్థ్యం, వాటి నిర్వహణపై శిక్షణ పొందిన సిబ్బంది త‌దిత‌ర‌ వివరాలేవీ లేవ‌ని అల‌హాబాద్ హైకోర్టు తీవ్ర ఆసహనం వ్యక్తం చేసింది.

ఇలాంటి భ‌యాన‌క వైద్య స‌దుపాయాలున్న ప‌రిస్థితుల్లో ‘ఇక అంతా దేవుడి దయ’ అని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం దేశాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇదే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుంచి ప్ర‌ధాని మోడీ ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

ప్ర‌ధాని ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రాష్ట్రంలో 3 ల‌క్ష‌ల మందికి 30 ప‌డ‌క‌లున్నాయంటే… ఇక బీజేపీ పాల‌న గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిదేమో! ఎందుకంటే అక్క‌డి ముఖ్య‌మంత్రి యోగి బీజేపీ పాలిత ముఖ్య‌మంత్రి కావ‌డం విశేషం.