వైద్యో నారాయణో హరీ.. అని పెద్దలు చెబుతారు. దీని అర్థం వైద్యుడు దైవంతో సమానమని. మాతృమూర్తి జన్మనిస్తే …వైద్యులు పునర్జన్మ ఇస్తుంటారు. అందుకే వైద్యులను ప్రాణదాతలుగా చూస్తారు. అయితే అన్ని రంగాల మాదిరిగానే వైద్యం కూడా వ్యాపార వస్తువైంది. అందుకే వైద్యాన్ని కాసులు కురిపించే వ్యాపారంగా చూసే వాళ్ల పట్ల సమాజంలో ఎంత మాత్రం గౌరవం ఉండదు. వైద్యుల్లో కూడా చాలా మంది మంచి వాళ్లు లేకపోలేదు.
కరోనా విపత్కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందించిన , అందిస్తున్న వాళ్లు లేకపోలేదు. అలాంటి వాళ్లను చూస్తే చేతు లెత్తి దండం పెట్టాలనే ఆరాధన భావం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌లో మహమ్మారి బలి తీసుకున్న వైద్యుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలను కాపాడే వాళ్లే ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదమని చెప్పొచ్చు.
దేశ వ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్‌లో కరోనా బారిన పడి 270 మంది వైద్యులు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సమాచారాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంగళవారం వెల్లడించింది. కరోనా బలిగొన్న వైద్య ప్రముఖుల్లో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ కూడా ఉండడం మరణాల తీవ్రతను తెలియజేస్తోంది. ఈయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
వైద్యుల మరణాలకు సంబంధించి గణాంకాలను పరిశీలిద్దాం. బిహార్‌లో అత్యధికంగా 78 మంది, ఉత్తరప్రదేశ్‌లో 37 మంది, ఢిల్లీలో 29 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా కరోనా ఫస్ట్ వేవ్‌లో వైద్యుల మరణాల సంఖ్య 748.
ఫస్ట్ వేవ్‌తో పోల్చుకుంటే సెకెండ్ వేవ్‌లో వైద్యుల మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ, ఆందోళన కలిగించేదే అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణదాతలను కూడా విడిచిపెట్టని మహమ్మారి కర్కశత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు.