కోవిడ్ టైమ్ లో నటుడు సోనూ సూద్ చేస్తున్న సేవలు దేశం అంతా పరిచయం అయిపోయాయి. నిత్యం వాట్సాప్ లో ఈ మేరకు అనేక పోస్టులు కనిపిస్తున్నాయి.
ఇదే టైమ్ లో సోనూసూద్ కన్నా ఆర్థికంగా బలంగా వున్న అనేక మంది తెలుగు సినిమా జనాలపై విమర్శలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం సుభాషితాలు, సూక్తి ముక్తావళి లాంటి విడియోలు వదిలి, తమ తమ పీఆర్వోల చేత సర్క్యులేట్ చేయించడం మినహా చేసేది ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోపక్క తమిళనాడులో సినిమా జనాలు సిఎమ్ ఫండ్ కు డొనేషన్లు ఇస్తుంటే ఇక్కడ సినిమా జనాలు పెదవి కదపడం లేదు. రేపు వీరంతా ఏ విధంగా ఆంధ్ర సిఎమ్ ను కలిసి టికెట్ రేట్ల గురించి మాట్లాడతారో? తెలంగాణ సిఎమ్ ను కలిసి సినిమా రంగ సమస్యల మీద మాట్లాడతారో మరి? అన్న కామెంట్లు సినిమా రంగం లోనే వినిపిస్తున్నాయి.
అసలే సినిమా రంగం సమస్యల్లో వుంది. అది తెలిసి కూడా హీరోలు ప్రభుత్వాలను ప్రసన్నం చేసుకునే పని తమది కాదన్నట్లు, ఆ బాధలు అన్నీ నిర్మాతలవి అన్నట్లు సైలంట్ అయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాలు కావడంతో ఇస్తే రెండు చోట్ల ఇవ్వాలి అన్న ఆలోచనతో ఎక్కడా ఇవ్వకుండా కొవిడ్ రెండో దశ టైమ్ లో హీరోలు అంతా టైట్ లిప్డ్ అన్నట్లు సైలంట్ అయిపోయారు. మన హీరోలతో సోనూ సూద్ ను పోలుస్తూ అడపదడపా వాట్సాప్ పోస్ట్ లు, స్టేటస్ లు కనిపిస్తున్నాయి.
చేపల పులుసు ఎలా చేయాలో తెలియాలంటే మన హీరోలను అడగండి…కొవిడ్ సహాయం కావాలి అంటే సోనూసూద్ ను అడగండి అనే వాట్సాప్ స్టేటస్ కూడా ఇలాంటి వాటిల్లో ఒకటి.
నిజమే కదా..మన హీరోలు పోలీస్ డిపార్ట్ మెంట్ కోసమో, ప్రభుత్వం కోసమో ట్విట్టర్ లో పోస్టులు పెడతారు తప్ప, జనాలను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టరు. అలా చుట్టాలంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ ఆ పనులు చేస్తూ, ప్రచారం కోసం హీరోల పేర్లు జోడించాలి. అంతే తప్ప తమకు తాముగా ముందుకు రారు.
ఇలా చేయడం అభిమానులకు ముద్దుగానే వుండొచ్చు కానీ కామన్ మాన్ లు మాత్రం సోషల్ మీడియాలో వాళ్ల వాళ్ల అభిప్రాయాలు ఖరాఖండీగా పోస్ట్ చేస్తున్నారు.