జనసేనాని పవన్‌కల్యాణ్ ఒంటరయ్యారా? చేశారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతి మీటింగ్‌కు ఆయన మాట మారుతోంది. ఈ నెల మొదటి వారంలో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా రెండువారాలకు బాపట్ల జిల్లా పర్చూరులో పొత్తులపై ఆయన మరోసారి స్పందించారు. ఈ రెండు వారాల్లోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
రెండు వారాల క్రితం ఆయన మూడు ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. ఒకటి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం, రెండోది జనసేన, బీజేపీ కలిసి తలపడడం, మూడోది జనసేన ఒక్కటే బరిలో నిలబడం అనే మూడు ఆప్షన్లు వున్నట్టు పవన్ చెప్పారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో తాను తగ్గానని, రానున్న ఎన్నికల్లో టీడీపీ కాస్త తగ్గాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బైబిల్ సూక్తిని కూడా ఆయన ప్రస్తావనకు తెచ్చారు. రెండో ఆప్షన్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉత్సాహంగా ఓకే చెప్పారు. టీడీపీ నుంచి సానుకూల స్పందన రాకపోగా, ముఖ్య నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.
అసలు జనసేనకు అంత సీన్‌లేదని తేల్చి చెప్పారు. 137 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీచేస్తే కేవలం 16 చోట్ల మాత్రమే జనసేనకు డిపాజిట్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసి, ఆ పార్టీని చావగొట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ బాపట్ల జిల్లా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ ఏమన్నారంటే…
“మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. జనసేన అధికారంలోకి రాగానే జాబ్‌క్యాలెండర్ ప్రకటిస్తాం. రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. చాలాసార్లు ఇత రులకు అవకాశం ఇచ్చారు. ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండి. కొత్త తరం నాయకులు రాజకీయాల్లోకి రావాలి. ఒకసారి అందరూ జనసేన వైపు చూడండి. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తు ప్రజలతోనే. ఇంకెవరితోనూ లేదు. 2009లో ఏం చెప్పానో అదే చేస్తా” అని ప్రసంగించారు.
ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని చెప్పింది ఈయనే. పొత్తులకు సంబంధించి మూడు ఆప్షన్లను తెరపైకి తెచ్చింది పవన్‌కల్యాణే. ఇప్పుడేమో ప్రజలతో తప్ప ఇంకెవరితోనూ పొత్తు లేదని ప్రకటించింది కూడా ఈయనే. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవాళ్లెవరైనా ఇన్ని రకాలుగా మాట మారుస్తారా? పవన్‌కంటే ఊసరవెళ్లి నయం అని ప్రత్యర్థులు విమర్శ చేయరా? పొత్తుల విషయంలో పవన్ తీరు చూస్తే… ఊసరవెళ్లే నయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో వన్‌సైడ్ లవ్ అంటూ కవ్వించడం, అలాగే మరో సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పడగొట్టేందుకు త్యాగాలకు సిద్ధమని చేసిన ప్రకటనలకు పవన్ మోసపోయారని అర్థమవుతోంది. రాజకీయాల్లో సమయం, సందర్భానుసారం అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకుంటూ వుంటారు.
ఆ మాత్రం అర్థం చేసుకోకుండా, తనకు తానే అన్నీ ఊహించుకుని చంద్రబాబు వలలో పడి, బయటికి రాలేక పవన్ విలవిలలాడుతున్నట్టు కనిపిస్తోంది. బాదుడే బాదుడు, అలాగే మహానాడు, చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్నారని, ఎవరితోనూ పొత్తులు అవసరం లేదనే భావనలో టీడీపీ ఉంది. పొరపాటున పొత్తు పెట్టుకుంటే జనసేన ఆరో ఫింగర్ అవుతుందని టీడీపీ భయం.
పొత్తులో భాగంగా తనను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించకపోవడం, అలాగే ఆప్షన్లపై టీడీపీ సానుకూలంగా స్పందించకపోగా, వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో పవన్‌కల్యాణ్ ఒక రకమైన నైరాశ్యంలోకి వెళ్లినట్టు… పర్చూర్‌లో ఆయన మాటలు విన్నవారె వరికైనా అనుమానం కలుగుతుంది. ఇప్పటికైనా పవన్‌కల్యాణ్ పొత్తుల గురించి ఆలోచించడం మాని, సొంతంగా బలపడడంపై దృష్టి సారించాలి. రాజకీయంగా జనసేన శక్తిమంతమైన పార్టీ అని భావిస్తే … వద్దన్నా పొత్తుల కోసం వెంపర్లాడతారు.
జనసేన బలపడడానికి అనేక సానుకూల అంశాలున్నాయి. ఎందుకనో ఆయనే దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఎవరో సీట్లు ఇస్తారు, తాను ముఖ్యమంత్రి అవుతాననే పగటి కలలు కనడాన్ని ఇకనైనా ఆపాలి. పవన్‌ను సీఎంగా చూడాలనే జనసైనికులు, అలాగే అభిమానుల కలలను సాకారం చేయడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ గ్రహిస్తే మంచిది.
సొదుం రమణ