తెలుగుదేశం పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి ఫ్యామిలీకి కనీస గౌరవం దక్కడం లేదు. “అయ్యా, అమ్మా… రెండు సీట్లు కేటాయించడయ్యా” అని జేసీ కుటుంబం చివరికి తమ అనుచరుల కోసం సిగ్గు విడిచి భిక్షమెత్తే వాళ్లలా అడిగినా పట్టించుకునే దిక్కేలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు అనంతపురంలో మరోమారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గాల మధ్య విభేదాలను బయటపెట్టాయి.
అనంతపురం నగరపాలకసంస్థ ఎన్నికల్లో తాను సూచించినవారికి కొన్ని కార్పొరేటర్ స్థానాలు కేటాయించాలని టీడీపీ అనంతపురం పార్లమెంటు ఇన్చార్జి జేసీ పవన్ డిమాండ్ చేశాడు. అయితే ఆ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాత్రం… జేసీ అడిగినట్టుగా సీట్లు ఇచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి తేల్చి చెప్పినట్టు సమాచారం. కాదు, కూడదని తనపై ఒత్తిడి తెస్తే….రాజీనామాకు కూడా వెనుకాడనని కూడా ప్రభాకర్‌చౌదరి హెచ్చరించినట్టు సమాచారం.
అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా తనకు ఎమ్మెల్యే అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఈ నేపథ్యంలో తన వర్గీయులకు కనీసం 12 కార్పొరేటర్ స్థానాలైనా ఇవ్వాలని జేసీ పవన్ జిల్లా నాయకత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆ రెండువర్గాల మధ్య టికెట్ల లొల్లి బట్టబయలైంది. టికెట్ల విషయంలో ఎవరికి వారు పంతానికి పోయారు.
దీంతో జిల్లా నాయకత్వం చేసేదేమీలేక అధిష్ఠానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు ఈ రోజు (శుక్రవారం) అఖరు. ఇప్పటికే ఇప్పటికే 40 డివిజన్లకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరో 10 కార్పొరేటర్ స్థానాలకు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంది. వీటిలో సీపీఐతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి టీడీపీ రెండుమూడు సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి.
మిగిలిన స్థానాల్లో జేసీ పవన్ వర్గీయులకు టికెట్లు కేటాయించడం అనుమానే అంటున్నారు. ఒకవేళ జేసీ వర్గీయులకు టికెట్లు ఇవ్వని పక్షంలో ప్రభాకర్‌చౌదరి వర్గీయులకు వ్యతిరేకంగా పనిచేస్తారనే చర్చ సాగుతోంది. దీంతో అనంతపురం కార్పొరేషన్లో టీడీపీ భారీగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. ఏది ఏమైనా జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడైన జేసీ పవన్ నోరు తెరిచి పట్టుమని పది సీట్లు అడిగినా ఇచ్చే పరిస్థితి టీడీపీలో లేకపోవడం గమనార్హం. “ఏందబ్బా మా జేసీ వాళ్లు అడక్కతిన్నా టీడీపీలో కనికరించే వాళ్లే లేరా” అని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.