తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు వున్నారని ఎప్పటి నుంచో గుసగుసలు వున్నాయి. అందుకు అనుగుణంగానే నాదెండ్ల, ఎన్టీఆర్ కలిసి పార్టీని స్థాపించిన వైనం వుండనే వుంది. అలాంటి పార్టీకి నాటి నుంచి నేటివరకు మీడియా టైకూన్ రామోజీరావు మద్దతు అవిఘ్నంగా వుంటూనే వస్తోంది.
ఆ రెండు పత్రికలు అంటూ రామోజీ ఈనాడు మీద నాటి వైఎస్ నుంచి నేటి జగన్ వరకు విమర్శలు కురిపిస్తూనే వస్తున్నారు. అలాగే వివిధ రంగాల్లోని కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు ఇప్పటికీ తెలుగుదేశం పట్ల పక్షపాత వైఖరితో వుంటారని గుసగుసలు, కొండకచో బాహాటంగా విమర్శలు వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో పార్టీ స్థాపనలో రామోజీరావు పాత్ర కీలకంగా వున్నట్లు చూపించడం విశేషం. పార్టీ పెట్టకముందు ఓసారి ఎన్టీఆర్ రామోజీతో సమావేశమైనట్లు చూపించడం, అలాగే పార్టీ ప్రకటనకు వెళ్తూ, ముందుగా ఫోన్ చేసి, ఆయనకు సమాచారం ఇవ్వడం వంటి సీన్లు సినిమాలో వున్నాయి.
అంటే ఆయన కనుసన్నలలోనే తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినట్లు చెప్పకనే చెప్పినట్లు అయింది. అంతేకాదు అత్యున్నత పదవుల్లో వుండే మరికొందరు సామాజిక వర్గ ప్రముఖుల్ని కూడా పార్టీ స్ధాపన విషయంలో చూపించడం విశేషం. మరి తొలిభాగంలో ఇలా చూపించారు.
మరి మలిభాగంలో ఇంకెలా చూపిస్తారో చూడాలి. అన్నట్లు పనిలో పనిగా ప్రస్తుతం నిత్యం చంద్రబాబు వల్లె వేసే వ్యవస్థలను భ్రష్టు పట్టించారు డైలాగులను ఈ సినిమాలో ఇందిరాగాంధీ మీద ఎన్టీఆర్ వదిలినట్లు చూపించడం వెల్ ప్లాన్డ్ గా వుంది. ఇదిలావుంటే కొన్ని వాస్తవాలు సినిమాలో మరుగున పెట్టారు.
మర్రి చెన్నారెడ్డి రెవెన్యూ మంత్రిగా వున్నపుడు ఆయన చొరవతోనే, అక్కినేని కృషి చేసి పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చేలా చేసారు. ఆ విషయాన్ని అస్సలు చూపించలేదు. అక్కరలేని మోహన్ కందా లాంటి వారి గురించి ప్రస్తావించారు కానీ, కీలమైన పరిశ్రమ తరలింపు వెనుక వున్న మర్రి చెన్నారెడ్డిని మరిచారు.
అలాగే ముఖ్యమైన ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావించారు బాగానే వుంది. కానీ మల్లీశ్వరి, జగదేకవీరుని కథ లాంటి కళాఖండాలను విస్మరించారు. అంజలీదేవి, భానుమతి, జయలలిత లాంటి కీలక నటీమణులను గుర్తు చేయలేదు. మూడుపాత్రలు ధరించడం దేశంలోనే రికార్డు అన్నట్లు చెప్పుకు వచ్చారు కానీ, అప్పటికే నాగేశ్వరరావు నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలు వేసి చూపించారని మరచిపోయారు.