అయ్యన్న పెద్ద నోరు… ఎవరికి చేటు…?

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా ఫోకస్ లో ఎపుడూ ఉండాలనుకునే నేత. ఆయన ఓటమి ఎరుగని వీరుడు కాదు. ఇప్పటికి ముచ్చటగా మూడు సార్లు…

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా ఫోకస్ లో ఎపుడూ ఉండాలనుకునే నేత. ఆయన ఓటమి ఎరుగని వీరుడు కాదు. ఇప్పటికి ముచ్చటగా మూడు సార్లు ఓడారు. 2019లో ఓటమి పాతిక వేల ఓట్ల భారీ తేడాతో జరిగింది.

ఇక అయ్యన్నకు నర్శీపట్నంలోనే రాజకీయ పలుకుబడి తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఆయన మొత్తం అనకాపల్లి జిల్లాను ప్రభావితం చేయలేరని చాలా కాలం క్రితమే రుజువు అయింది. అయినా అయ్యన్న పొలిట్ బ్యూరో సభ్యుడుగా సీనియర్ నేతగా మీడియాలో వెలుగుతున్నారు.

దానికి ఆయన ఎంచుకున్న రూట్ పెద్ద నోరు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిట్ట. ఆయన దూకుడు రాజకీయమే మొదటి నుంచి ఇలా సాగుతోంది. అవతల వారు ఎవరు అన్నది ఆలోచన చేయకుండా ఈ సీనియర్ నాయకుడు నోటికి పని చెబుతారు అని ఆరోపణలు ఉన్నాయి.

ఇంతా చేస్తే అయ్యన్న వల్ల టీడీపీకి వచ్చే లాభం ఏంటి అంటే గెలిస్తే మరో మారు నర్శీపట్నం సీటు. మరి టీడీపీకి ఆయన వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యల వల్ల కొన్ని వర్గాలలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అని కూడా అంటారు. 

చంద్రబాబు సమక్షంలోనే తాజాగా అయ్యన్న చాలా మాటలు మాట్లాడారు. మంత్రి రోజా మహిళ అని చూడకుండా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మీద వ్యక్తిగత దూషణనకు పాల్పడ్డారు.

ఇది ఒక ట్రెండ్ గా ఇపుడు మారుతోంది అంటే సీనియర్లు దానికి బాటలు వేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక మూడేళ్ళుగా అయ్యన్న అరెస్ట్ కోసం అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికపుడు విఫలం అవుతున్నాయి. దాంతో అయ్యన్న మరింతగా జోరు పెంచుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం వల్ల అయ్యన్న అనుకున్న దాని కన్నా హైలెట్ అవుతున్నారు.

ఇదే బాగుందని మిగిలిన నాయకులూ భావిస్తున్నారు. మరి దీని వల్ల రాజకీయంగా ఎంత మేలు అన్నది ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఫైర్ బ్రాండ్ అంటే అసభ్య  పదజాలంతో మాట్లాడడమేనా అన్న వైసీపీ విమర్శలకు ఈ రోజు టీడీపీ పెద్దలు జవాబు చెప్పకపోతే రేపటి రోజున అవే మాటలు రివర్స్ లో వారిని తాకవచ్చు. 

అయ్యన్నలాంటి వారు గతంలోనూ అధినాయకత్వం మీద అనుచిత కామెంట్స్ చేసిన సందర్భాలను కూడా వైసీపీ వారు గుర్తు చేస్తున్నారు.