వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తాను పోటీ చేసే నియోజకవర్గం ఏంటో తేల్చి చెప్పారు. ఇవాళ ఆమె సస్పెన్స్‌కు తెరదించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలో నిలవనున్నట్టు షర్మిల స్పష్టం చేశారు. పాదయాత్రలో భాగంగా నేలకొండపల్లి శివారులోని బౌద్ధస్తూపం రహదారి వద్ద నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనేది మీ (కార్యకర్తలు) కోరికే కాదు నా కోరిక కూడా అని అన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్ అభిమానుల్ని ఏకతాటిపైకి తేవాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్సార్‌టీపీ పతాకం పాలేరు గడ్డపై ఎగరాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో గెలవడానికి కార్యకర్తలతో పాటు తాను కూడా గట్టిగా పని చేయాల్సి వుందన్నారు. చరిత్రలో మునుపెన్నడూ రాని మెజార్టీని సాధించాలని పిలుపునిచ్చారు.
1300 కి.మీ నడిచింది తానే అయినా నడిపించింది మాత్రమే కార్యకర్తలే అన్నారు. ఖమ్మంజిల్లాలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని చాలా మంది గెలిచారన్నారు. దివంగత వైఎస్సార్‌ను విమర్శించే స్థాయి మంత్రి పువ్వాడకు లేదన్నారు. తనకు బయ్యారం మైనింగ్‌లో వాటాలు వున్నట్టు మంత్రి పువ్వాడ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
తనకు బయ్యారంలో వాటాలు లేవని తన బిడ్డలపై ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంత్రిగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తన బిడ్డలపై ప్రమాణం చేసే దమ్ముందా? అని పువ్వాడకు షర్మిల సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై మంత్రి పువ్వాడ ఎలా స్పందిస్తారో మరి!