ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బూతల రాజకీయం రాజ్యమేలుతోంది. బూతులు మాట్లాడ్డంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టింది…. మీరంటే మీరని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అన్ని రకాల హద్దులు దాటిపోయింది.
ఏపీ రాజకీయాల్లో పెద్దరికం, గౌరవ, మర్యాదలకు చోటే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో రెండు సెంట్ల ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారని, అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ఇది తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపింది.
ఇటీవల అయ్యన్నపాత్రుడు తన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా అధికార పార్టీ ముఖ్య నేతలపై బూతులకు దిగారు. పరోక్షంగా ఇదే ఆయన ఇంటి కూల్చివేతకు దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయ్యన్నకు సంఘీభావంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడారు. వైసీపీ మంత్రులు, నాయకులు మాట్లాడేదాంట్లో కేవలం ఒక్క శాతం మాత్రమే అయ్యన్న తిడుతున్నారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా బూతులు మాట్లాడుతున్నారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్న ఇంటి కూల్చివేత కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగమే అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని సోమిరెడ్డి హెచ్చరించారు.