కరోనా కల్లోలం అలా వుండగానే సినిమాలు జనాలు షూటింగ్ ల షెడ్యూళ్ల తేదీలు ఖరారుచేసుకుంటున్నారు. జూన్ పది నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని, షూటింగ్ లు చేసుకోవచ్చు అని లెక్కలు కడుతున్నారు.
ఆ మేరకు చాలా సినిమాల షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతా బానే వుండి, షూటింగ్ లు ప్రారంభమైనా సినిమాల విడుదలలు ఎప్పటి నుంచి అన్నది క్వశ్చను. అది అలాగే వుంది.
జూన్ లో అయితే థియేటర్లు తెరచుకుంటాయి అని అనుకోవడానికి లేదు. ఈ సారి ప్రభుత్వాలు అంత తొందరపడవు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ ముగిసాక సెకెండ్ వేవ్ వుందీ అంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు మూడో వేవ్ వుందంటున్నారు.
నమ్మినా, నమ్మకున్నా ప్రభుత్వాలు జాగ్రత్తగా వుండాలనే చూస్తాయి. అందువల్ల అంత త్వరగా థియేటర్ల తలుపులు తెరుస్తాయా అన్నది అనుమానమే. ఒకవేళ తెరిచినా ముందుగా యాభై శాతం సిట్టింగ్ తోనే అనుమతి ఇస్తారు. దసరా, దీపావళిదాటే వరకు అలాగే వుంటుందని టాక్ వినిపిస్తోంది.
ఇదిగో అదిగో అంటూ జనవరి వరకు యాభై శాతం అనుమతి మాత్రమే వుంటుందని అంచనా వేస్తున్నారు. అలా అయిన పక్షంలో 2021 లో ఇక పెద్ద సినిమాలు వుండకపోవచ్చు. కేవలం ముఫై, నలభై కోట్ల బడ్జెట్ లో తయారైన సినిమాలు మాత్రమే విడుదలకు ధైర్యం చేస్తాయి.
క్రాక్, ఉప్పెన ఇచ్చిన ధైర్యంతో ఖిలాడీ, లవ్ స్టోరీ ల్లాంటి సినిమాలు కూడా విడుదలకు సాహసించవచ్చు. కానీ ఆచార్య, రాథేశ్యామ్, లాంటి సినిమాలు వెయిటింగ్ లో వుండాల్సిందే.