రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్, లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్ రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు కుల, మత రాజకీయాలను ఆయన తూర్పార పట్టారు. బాబుకు జియావుద్దీన్ రాసిన బహిరంగ లేఖలోని సారాంశం ఇదే…
పార్టీ కోసం, రాజకీయంగా మీ ఎదుగుదల కోసం మా కుటుంబాన్ని అన్ని విధాలుగా వాడుకున్న మీరు లాల్‌జాన్‌బాషా మరణించిన తర్వాత ఏ విధంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టారో మీకు, మాకు తెలుసు. అయినా క్రమశిక్షణ గల నేతలుగా మొదటి నుంచి పార్టీ జెండాను భుజాన మోస్తూనే వచ్చాం.
మీ ప్రవర్తనలో ఏనాటికైనా మార్పు రావాలని, వస్తుందని ఆశించాం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అది కోల్పోయిన తర్వాత మరోలా ప్రవర్తించే మీ తీరు మాతో సహా పార్టీలో వ్యక్తిత్వం కలిగిన వారికి మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఏనాటికైనా మార్చుకుంటారని భావించాం.
ఈ మధ్య కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత మీరు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే (హిందూ దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైన సందర్భంలో) ప్రయత్నం చేశారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మీ స్వీయ దర్శకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజును పావులా వాడుకుంటూ , మీ అనుకూల చానల్స్ , పత్రికల ద్వారా ఆయనతో కులాలపై నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయించారు.
మతాల మధ్య, కులాల మధ్య , ప్రాంతాల మధ్య విభజన చేసే మీ రాజకీయం తెలుగుదేశం పార్టీకి మరణశాసనంగా మారింది. అయినా మీరు మాత్రం మారలేదు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేస్తే , దానిని నిరసిస్తూ మీరు రాస్తున్న లేఖలు , మీరు పడుతున్న తపన చూస్తుంటే …అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే మీ మనస్తత్వం అందరికీ అర్థమవుతోంది.
నిజాయితీ రాజకీయాలను పూర్తిగా వదిలేసి వెన్నుపోటు రాజకీయాలను నమ్ము కున్నారు. రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ తరపున , ఏ గుర్తు మీద ఎంపీగా గెలిచాడన్నది మీకు గానీ, మీ అనుయాయులతో నిండిన బీజేపీకి గానీ గుర్తే లేదనుకోవాలి.
ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీ నాయకత్వంలో పని చేయడం ఇక ఆత్మహత్యా సదృశ్యమే. వ్యక్తిత్వాన్ని చంపుకోవడమే. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లే పునాదిగా సాగే మీ పార్టీలో ఇంకా కొనసాగడానికి నా మనస్సాక్షి అంగీకరించడం లేదు.
నేను మా సోదరుడు దివంగత లాల్‌జాన్‌బాషా రాజకీయాల్లో కులమతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకునే వాళ్లం. మీ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో అలా జరగడం అసాధ్యమని తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నా.
అంతేకాదు, పార్టీలోని ప్రజాస్వామ్యం, మానవతా విలువలు గల ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని కోరుతున్నా….అని ముగించారు.
ఈ లేఖ టీడీపీ సర్కిల్స్‌లో కలకలం రేపుతోంది. బాబుపై టీడీపీ మైనార్టీల్లో పెరుగుతున్న అసహనం, వ్యతిరేకతకు ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీకి, చంద్రబాబుకు వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ, కొన్ని వర్గాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా దళితులు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల్లో చంద్రబాబు వైఖరిపై వ్యక్తమవుతోంది. ఎందుకంటే తమను దూషించే రఘురామకు చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఏంటనేది వారి ఆవేదన.
ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్ టీడీపీని వీడడమే నిదర్శనం. ఆయన రాసిన లేఖ మైనార్టీలు, అణగారిన వర్గాల్లో టీడీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.