ఈ రోజు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. మదర్స్ డే తరహాలో.. ఫాదర్స్ డే కాబోలు. అయితే మదర్స్ డే రోజున్నంత ఎమోషనల్ అట్మాస్పియర్ ఫాదర్స్ డే రోజున ఉండదు!
తండ్రిగా మగాడు ఎన్నో బాధ్యతలు మోస్తాడు. తన కుటుంబానికి అన్నీ సమకూర్చి పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో తన గురించి ఆలోచించుకోకుండా కూడా గడిపేస్తాడు. తండ్రిగా విజయవంతం కావడమే తన జీవితానికి పరమావధిగా భావించే పురుషులు ప్రపంచంలో అధికంగా ఉంటారు. తల్లి తరహా తాపత్రయం తండ్రికి ఉండకపోవచ్చు కానీ, పైకి కనిపించకుండా పిల్లల గురించి, కుటుంబం గురించి తపించడంతో తండ్రికి ధీటు ఉండదు!
అయినా తల్లి కన్నా తండ్రికి తక్కువ మార్కులే పడతాయి. పిల్లలకు కూడా తల్లి మీదే ఎక్కువ ప్రేమ. ఈ విషయం తెలిసి కూడా తన కుటుంబాన్ని, పిల్లలను ప్రేమించడంలో తండ్రి ఎక్కడా రాజీ పడడు. దీన్ని ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుందో మరి!
భావోద్వేగ భరితంగా తండ్రి స్థానం అలా ఉంచితే, శారీరక మానసిక సామాజిక పరిస్థితులను బట్టి ఒక పురుషుడు తండ్రి కావడానికి తగిన వయసు ఎంత? అనేది ఒక ఆసక్తిదాయకమైన అంశం. ప్రస్తుత సామాజిక పరిస్థితులు, పోటీ ప్రపంచం, వ్యయభరితమైన జీవన శైలి.. వీటిని, ఇదే సమయంలో లైఫ్ స్టైల్ ఫలితంగా ఫెర్టిలిటీ.. వంటి అంశాలు, భవిష్యత్తు పరిస్థితులను అనుసరించి.. ఏ వయసులో తండ్రి కావడం ఉత్తమ పద్ధతి అవుతుందనే అంశంపై పరిశోధనలు కూడా జరిగాయి.
అవి చెప్పే మాట ఏమిటంటే.. 30 యేళ్ల వయసు నుంచి 44 మధ్యన అని! 30లలోకి పడ్డ వీలైనంత తొందరగా,.. 44 వచ్చేందుకు ఇంకా సమయం ఉండగానే… సంతానాన్ని పొందగలగడం పురుషుడికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పాతికేళ్లకే పెళ్లి చేసుకునే వారు ఉండవచ్చు. అంతలోపే వివాహంతో తండ్రి అయ్యే అవకాశాలూ ఉంటాయి. గత జనరేషన్లలో చాలా మంది పరిస్థితి ఇదే. పాతికేళ్ల వయసు లోపే గత జనరేషన్లో ఇద్దరు ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన వారు ఎంతో మంది ఉంటారు. ప్రత్యేకించి భారత దేశంలో, సౌతిండియాలో.. 80లలో తండ్రి అయిన వారు ఎంతో మంది పాతికేళ్ల వయసులోపే పిల్లలున పొంది ఉంటారు. అయితే ఇరవై ఐదేళ్లకే తండ్రి కావడం ప్రస్తుత తరంలో ఒత్తిడితో కూడుకున్న అంశమని పరిశోధనలు చెబుతున్నాయి.
80లలో, అంతకన్నా పూర్వం, గత తరాల్లో.. వీలైనంత తొందరగా పెళ్లి, పిల్లలు… అవన్నీ చక్కగా నడిచాయి. అయితే మారిన జీవన స్థితిగతుల రీత్యా… తండ్రి కావడానికి 30 వరకూ వెయిట్ చేయడం, ఆ తర్వాత వీలైంత త్వరగా ఫ్యామిలీ మేకింగ్ చేసుకోవడం మంచిది అని పరిశోధకులు సూచిస్తున్నారు. 44 అనేది తండ్రి కాగల గరిష్ట వయసు అని చెబుతున్నారు. అది కూడా ఆలస్యం అనే అనుకోవాలి. 30లలోనే ఆ ముచ్చట మంచిది కావొచ్చు.