‘విరాటపర్వం’చూడాల్సిందే

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంట గా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో…

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంట గా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా విడుదల నేపధ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యధార్ధ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది విరాటపర్వం. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్చమైన ప్రేమకథ. ఈ ప్రేమ కథలో గొప్ప రైటింగ్, ఫెర్ఫార్మేన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వున్నాయి అని తెలిపారు

సాయి పల్లవి మాట్లాడుతూ.. మోహన్ రావు ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా వుంది. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసిన ప్రతీ సారి కొత్త అనుభూతిని పొందుతారు'' అన్నారు.

దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుండి యునానిమస్ గా మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబు కి కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ వుండేది కాదు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్ళారు. 1990 వాతావరణంను క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణి కి కృతజ్ఞతలు. ఇలాంటి అర్ధవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అన్నారు.

తూము మోహన్ రావు మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. వేణు ఉడుగుల గారు కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. 

సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్ళినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్ అన్నారు.