విపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా వినిపించిన పేర్లలో ఒక్కోటీ తెరమరుగు అవుతోంది. విపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బరిలోకి దిగుతారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది.
పవార్ ను రాష్ట్రపతి బరిలోకి దించడానికి ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలోకి దిగినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిపై అప్పుడు స్పందించని పవార్.. ఇటీవల మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంలో స్పందిస్తూ తను ఇంకా క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నట్టుగా రాష్ట్రపతి భవన్ కో, రాజ్ భవన్ కో పరిమితం అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారట!
ఒకవేళ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉంటే పవార్ ఇలా మాట్లాడే వారు కాదేమో. పోటీ చేసి ఓడిపోయాడని అనిపించుకోవడం తప్ప మరో ప్రయోజనం లేని నేపథ్యంలో ఈ మరాఠా నేత ఇలా తప్పుకున్నారనుకోవచ్చు. ఇక కశ్మీరీ నేత ఫరూక్ అబ్ధుల్లా పేరును కూడా ప్రతిపక్ష పార్టీల కూటమి పరిగణనలోకి తీసుకుంటోందనే వార్తలు వచ్చాయి. అయితే 84 యేళ్ల అబ్దుల్లా కు కూడా ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన లేదట!
గెలిచేస్తే పోటీ చేసేసి ఎక్కడ రాష్ట్రపతి భవనానికే పరిమితం కావాల్సి వస్తుందనే భయంతో.. కశ్మీర్ కు తను ఇక ఏం ఉద్ధరించలేననే భయంతో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగే ఆలోచనను విరమించుకుంటున్నారట! ఈ విధంగా విపక్షాల తరఫున మరో సీనియర్ పొలిటీషియన్ రాష్ట్రపతి పోరు నుంచి తన పేరును స్వయంగా విరమించుకున్నారు. ఇక మమతా బెనర్జీ అండ్ కో కు మిగిలింది గోపాలకృష్ణ గాంధీ ఒక్కరే లాగుంది!