ఈ మధ్య ఆదివారం, సెలవు రోజు భయం తప్పిందిలే అని టీడీపీ నేతలు రిలాక్ష్ అయ్యారు. అయితే ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకోవడాన్ని అధికార పార్టీ సీరియస్‌గా తీసుకుంది. అయ్యన్నపాత్రుడికి ఏదో రకంగా బుద్ధి చెప్పాలని వైసీపీ భావించింది. ఇందులో భాగంగా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కట్టిన ఇంటిపై వేటు వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది.
ఇందుకు ఆదివారం తెల్లవారుజామున సరైన సమయంగా ముహూర్తం ఖరారు చేసింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి కట్టిన ప్రహరీతో పాటు ఇంటిని అధికారులు కూల్చేశారు. చెరువు కాలువకు చెందిన రెండు సెంట్లు స్థలాన్ని ఆక్రమించి అయ్యన్నపాత్రుడు అక్రమ నిర్మాణం చేపట్టారని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు అన్నారు. ఆక్రమణ నిర్మాణాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయ్యన్న ఇంటిని తొలగించలేదన్నారు.
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆదివారం అంటే కూల్చేవేత దినంగా మార్చారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మ ఓ వీడియో విదుదల చేశారు. గత 40 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి దుర్మార్గాలను చూడలేదన్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
కేవలం తాము బీసీ కాబట్టే ఇంటిని కూల్చేశారని చెప్పారు. రాజకీయాలు వుంటే నేరుగా చూసుకోవాలే తప్ప ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. గత మూడేళ్లుగా జగన్ సర్కార్ తమను వేధిస్తోందన్నారు. ప్రజల తరపున అయ్యన్న మాట్లాడ్డమే నేరమా? అని నిలదీశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ పాలన చూశామని, ఇంత దుర్మార్గానికి పాల్పడలేదన్నారు.