జీవితానికి అర్థం పరమార్థం వుండాలంటారు. జీవితానికి పరమార్థం “జీవించడం” అని మహానుభావులు చెబుతారు. జీవించడం అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా సమాజం గుర్తు పెట్టుకోవడం. పుట్టిన ప్రతిజీవి ఏదో ఒక రోజు తనువు చాలించక తప్పదు. అయితే మనిషికి, ఇతర జీవులకు తేడా వుంటుంది. మంచీచెడుల వివేకం కేవలం మనిషికి మాత్రమే వుంటుంది. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే మంచిపనులు చేయాలి.
జీవితంలో ప్రతి మనిషికి ఒక కల వుంటుంది. ఫలానా పని చేసి, ఇక చనిపోయిన ఫర్వాలేదనే లక్ష్యాలను పెట్టుకుని వుంటారు. అలాంటి గొప్ప పని చేయాలని వైసీపీ పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంకల్పించారు. రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అనుకూల, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం నాలుగు దశాబ్దాలు.
పెద్దిరెద్ది రాజకీయ పంథాపై అభిప్రాయాలు ఎలా వున్నా… తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి మాతృమూర్తి వకుళమాత ఆలయం నిర్మించడం ప్రశంసలు అందుకుంటోంది. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తర్వాత బంగారు తాపడం చేసిన గర్భగుడిగా వకుళమాత ఆలయం చరిత్రకెక్కనుంది. ఇదంతా పెద్దిరెడ్డి సొంత నిధులతో చేస్తున్నదే.
ఈ ఆలయాన్ని సొంత ఖర్చులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మిస్తుండడం విశేషం. పేరూరు బండపై ఉన్న ఈ ఆలయం 320 ఏళ్ల క్రితం మైసూరు రాజు హైదర్ అలీ దండయాత్రల్లో దెబ్బతింది. విగ్రహం మాయమైంది. ఆ తర్వాత వకుళమాత ఆలయం చుట్టూ వున్న కొండను మైనింగ్ మాఫియా కొల్లగొట్టి ఆర్థికంగా సొమ్ము చేసుకుంది.
ప్రపంచానికి ఆరాధ్య దైవమైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడికి జన్మనిచ్చిన వకుళమాత ఆలయాన్ని పునరుద్ధరించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంకల్పించడం గొప్ప కార్యంగా భావిస్తున్నారు. ఆలయం నిర్మాణం పూర్తయింది. తిరుమల తరహాలోనే వకుళమాత ఆలయ నిర్మాణం వుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అద్భుత శిల్ప కళా నైపుణ్యం, ఆశ్చర్యపరిచే నిర్మాణ కౌశలం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఆలయ మహాసం ప్రోక్షణ పనులు జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన వకుళమాత ఆలయాన్ని ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తులు తిరుచానూరు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలతో పాటు తప్పకుండా వకుళమాత ఆలయాన్ని దర్శించుకోవాలనేలా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.