గడప గడప.. ప్రతిపక్ష మీడియాకు వరమా..?

గడప గడప కార్యక్రమంతో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు కానీ, వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎక్కువగా రాద్ధాంతం చేస్తున్నాయి. గడప గడపలో ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ప్రజలు మెచ్చుకోలుగా మాట్లాడినా…

గడప గడప కార్యక్రమంతో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు కానీ, వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎక్కువగా రాద్ధాంతం చేస్తున్నాయి. గడప గడపలో ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ప్రజలు మెచ్చుకోలుగా మాట్లాడినా దాన్ని ప్రచారం చేసుకోవడం కష్టం. ఒకవేళ ప్రచారం చేసుకున్నా సెల్ఫ్ డబ్బా అంటారే కానీ మరోటి కాదు, కానీ ఎక్కడో ఓ చోట మురికి కాల్వలో పూడిక తీయకపోయినా, ఇతరత్రా పథకాలు ఆలస్యమైనా.. వెంటనే అది హైలెట్ అవుతోంది.

అందులోనూ ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల అసహనానికి గురికావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ప్రతిపక్ష మీడియాకు 'గడప గడప' ఓ వరంలా మారింది.

ఎన్నికలకు రెండేళ్ల ముందుగా ప్రతిపక్ష మీడియాకు సమస్యలు దొరకలేదు. మద్యపాన నిషేధం అమలు చేయలేదెందుకు అంటారే కానీ, మిగతా విషయాల్లో నోరు పెగలదు. ఒకవేళ వ్యతిరేకంగా రాద్దామనుకున్నా… నవరత్నాల పథకాలు హైలెట్ అవుతాయి. అందుకే ప్రతిపక్ష మీడియా సైలెంట్ అయింది. ఈ దశలో గడప గడప కార్యక్రమం వారికి ఓ వరంలా మారింది.

చాలా చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలను స్థానిక టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. తమకు ఆ పథకం రాలేదని, ఈ పథకం రాలేదని అడుగుతున్నారు. అర్హత లేకపోయినా చికాకు పెడుతుండే సరికి కొన్నిసార్లు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే.. అక్కడ ఎల్లో మీడియాకు పని దొరుకుతుంది. అసలు విషయం ఏంటనేది ఎల్లో మీడియాకు అనవసరం. అక్కడ వాగ్వాదం జరిగితే చాలు, అదే వారికి వార్త.

గడప గడప కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయాలని, ప్రతి కుటుంబం ఎంత లబ్ధి పొందిందనే విషయం చెప్పాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే ఒక కుటుంబానికి, మరో కుటుంబానికి పోలిక వస్తోంది. ఫలానా వారికి ఎక్కువ లబ్ధి, ఫలానా వారికి తక్కువ లబ్ధి అనే తేడా కూడా కనపడుతోంది.

కొన్నిచోట్ల వైసీపీ కార్యకర్తలు కూడా తమకు ఎలాంటి పథకాలు రావట్లేదని, పక్క పార్టీల వారికి అత్యథిక లబ్ధి చేకూరుతుందనే ఆరోపణ కూడా చేస్తున్నారు. దీనికి నాయకులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ హైలెట్ చేస్తూ.. రోజుకో చోట ఎమ్మెల్యే నోరు చేసుకున్నాడు, ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడంటూ ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోంది.