పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి!

పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు అంటే… అవి కేవ‌లం ఏ సెక్సాల‌జీకి సంబంధించిన‌వి మాత్ర‌మే కాదు. స‌హ‌జంగా, వ‌య‌సుతో పాటు అర్థ‌మ‌య్యే విష‌యాలను ప‌క్క‌న పెడితే, పెళ్లికి ముందు న‌యాత‌రంలో ప‌రస్ప‌రం ఒక‌రి గురించి…

పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు అంటే… అవి కేవ‌లం ఏ సెక్సాల‌జీకి సంబంధించిన‌వి మాత్ర‌మే కాదు. స‌హ‌జంగా, వ‌య‌సుతో పాటు అర్థ‌మ‌య్యే విష‌యాలను ప‌క్క‌న పెడితే, పెళ్లికి ముందు న‌యాత‌రంలో ప‌రస్ప‌రం ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకోవాల్సిన విష‌యాలు అయితే కొన్ని ఉన్నాయి. గ‌త త‌రం వివాహాలు, కుటుంబ బంధాలు ఒక ఎత్తు. కాలం మారింది. 

సామాజిక ప‌రిస్థితులు, ఆర్థిక స్థితిగ‌తులు మారిపోయిన నేప‌థ్యాల్లో.. పెళ్లికి ముందు వ్య‌క్తిగ‌త అభిరుచులు, ఇష్ట‌మైన టూరిస్ట్ ప్లేస్ లు, ఇష్ట‌మైన రొమాటింక్ అట్మాస్పియ‌ర్.. వంటివి మాత్ర‌మే కాకుండా, తెలుసుకోవాల్సిన మ‌రి కొన్ని అంశాలు అయితే మిగిలే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడ‌టానికి మొహ‌మాట ప‌డే వాళ్లు చాలా మంది ఉంటారు. అందం విష‌యంలోనో ఉద్యోగం విష‌యంలోనో… ఇష్టం మొద‌ల‌య్యాకా…  మిగ‌తా అంశాల‌ను చ‌ర్చ‌లోకి రానీయ‌కుండా… వాటి గురించి అస్స‌లు ఆలోచించ‌కుండా .. అడుగేయ‌డం మాత్రం ఆ త‌ర్వాత లేనిపోని స‌మ‌స్య‌ల‌ను ఆహ్వానించ‌డ‌మే అవుతుంది.

ప్రేమ వివాహంలోనో, పెద్ద‌లు కుదురుస్తున్న వివాహంలో అయినా.. మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పెళ్లికి ముందే వీటి గురించి ప‌ర‌స్ప‌రం తెలుసుకోవ‌డం.. ఆ త‌ర్వాతి ప్ర‌యాణం సాఫీగా జ‌ర‌గ‌డానికి బాట‌లు వేస్తుంది. ఇంత‌కీ పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు ఏవంటే!

స్పెండ‌రా.. సేవ‌రా!

డ‌బ్బు విష‌యంలో స్పెండ్ విప‌రీతంగా చేసే టైపా, లేక సేవింగ్స్ కు బాగా ప్రాధాన్య‌త‌ను ఇచ్చే త‌ర‌హానా? అనేది క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాల్లో ఒక‌టి. ఇద్ద‌రూ జాబ్ చేసే వాళ్లు అయినా, లేదా ఒక్క‌రే జాబ్ చేసే ప‌రిస్థితి ఉన్నా.. పెళ్లి త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ఒక‌రి శైలి మ‌రొక‌రికి న‌చ్చ‌క‌పోతే క‌చ్చితంగా అదో స్ప‌ర్థ‌గా మారే అవ‌కాశం ఉంది. వ‌చ్చిన డ‌బ్బులో విలాస వంతంగా బ‌త‌కాలి అనే శైలి ఒక‌రిది కావొచ్చు. వ‌చ్చిన దాంట్లో వీలైనంత సేవ్ చేసుకుంటూ.. ముందుకు సాగాల‌నేది మ‌రొక‌రి ఆలోచ‌న కావొచ్చు. 

పెళ్లికి ముందే.. ఇలాంటి ఆలోచ‌న త‌ర‌హా ఏమిటో ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకోవ‌డం ద్వారా ముందే ఒక అభిప్రాయానికి రావ‌డానికి ఆస్కారం ఇస్తుంది. స్పెండింగ్ విష‌యంలో పెళ్లి త‌ర్వాత ఒక‌రినొక‌రు కంట్రోల్ చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు విక‌టిస్తాయి కూడా. దీంతో చాలా మంది మ‌న‌సుల్లో బాధ‌ప‌డుతూ.. పైకి చెప్పుకోలేక ఇబ్బందిక‌ర‌మైన వాతావ‌ర‌ణంలో వైవాహిక‌బంధంల కొన‌సాగుతూ ఉంటారు. ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌ద‌నుకుంటే.. ముందే ఈ వ్య‌వ‌హారంపై ఓ మాట అనుకోవ‌డం చ‌క్క‌టి ప‌ద్ధ‌తే!

పాస్ట్ ఇన్సిడెంట్స్  గురించి!

ఇది ముందే అడ‌గ‌డం ఒక ర‌క‌మైన ఇబ్బంది అయితే, పెళ్లి త‌ర్వాత వేరే ద్వారా తెలియ‌డం మ‌రో ఇబ్బంది. ఈ రోజుల్లో ప్రేమ‌క‌థ‌లు న‌డ‌ప‌ని వారు దొర‌కాలంటే క‌ష్టం. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ ర‌క‌ర‌కాల ప్ర‌పోజ‌ల్స్ రానే వ‌చ్చి ఉంటాయి. వాటి విష‌యంలో తొణ‌కుండా వ్య‌వ‌హ‌రించిన వారు కొంద‌రైతే, ఎంతో కొంత ప్రేమ‌క‌థ‌ను న‌డిపించిన వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి ప్రేమ‌క‌థే పెళ్లి వ‌ర‌కూ వెళితే ఇబ్బంది లేదు. 

బ్రేక‌ప్ వంటివి ఉండి, వాటికి ప్ర‌చారం కూడా వ‌చ్చాకా.. మ‌రొక‌రితో పెళ్లి ప్ర‌తిపాద‌న స‌మ‌యంలో ఎంతో కొంత నిజాయితీగా ఉండ‌టం ఉత్త‌మం. నిజాయితీ చెప్పేస్తే.. ఏమ‌నుకుంటారో, అపార్థం చేసుకుంటారో.. అనే భ‌యాలు ఉన్నా.. పాస్ట్ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే, పెళ్లి ఆగిపోయేట్టు అయితే అంత‌టితో ఆగిపోతుంది. అలా కాకుండా.. పెళ్లి త‌ర్వాత ఇలాంటి వ్య‌వ‌హారాలు వేరే డిస్ట్ర‌బెన్స్ ను క్రియేట్ చేయ‌కుండా చాలానే క‌ష్ట‌ప‌డాల్సి ఉండ‌వ‌చ్చు.

ఎక్స్ పెక్టేష‌న్స్ ఏమిటి?

పెళ్లి త‌ర్వాత పార్ట్ న‌ర్ నుంచి మీరు ప‌క్క‌గా ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లో ఉన్నారో చెప్ప‌డం లేదా, అవ‌త‌లి వారిని అడిగి తెలుసుకోవ‌డం కూడా చాలా కీలకం ఈ రోజుల్లో. ఏ సాఫ్ట్ వేర్ భ‌ర్త‌నో కోరుకునే అమ్మాయి.. ఆ వెంట‌నే అమెరికా వెళ్లాలి, యూర‌ప్ చుట్టేయాలి అనే ఎక్స్ పెక్టేష‌న్స్ తో ఉండ‌వ‌చ్చు. ఇలాంటి విష‌యాల్లో ముందే క్లారిటీ తీసుకోవ‌డం మెరుగైన అంశ‌మే. కూల్ గా లైఫ్ జ‌ర్నీ మాత్ర‌మే ఎక్స్ పెక్ట్ చేస్తున్న వారితో ఇబ్బంది ఉండ‌దు. అలా కాకుండా.. క‌ల‌ర్ ఫుల్ లైఫ్, విదేశీ యానాలు, ప‌బ్ లు ఎక్స్ పెక్ట్ చేసే వాళ్ల గురించి ముందే తెలుసుకోవ‌డం ఉత్త‌మం. 

అలాంటి ఎక్స్ పెక్టేష‌న్లు పెట్టుకుని.. పెళ్లి త‌ర్వాత వాటికి పార్ట్ న‌ర్ రీచ్ కాలేక‌పోతే.. అదో పెద్ద వ్య‌వ‌హారం అవుతుంది. ఇలాంటి విష‌యాల్లో పార్ట్ న‌ర్ త‌త్వం ఏమిటో ముందే తెలుసుకోవ‌డం ఆ త‌ర్వాత మేలు చేస్తుంది. వారి ఎక్స్ పెక్టేష‌న్స్ కు అనుగుణంగా మార‌గ‌ల‌గ‌డ‌మా లేక ఆ రేంజ్ ఎక్స్ పెక్టేష‌న్స్ లు భ‌రించ‌లేమ‌నే లెక్క‌ల‌తో ముందే ఒక నిర్ణ‌యాల‌కు రావొచ్చు.