కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఉచ్చు నుంచి బయట పడే దారి కోసం జేసీ బ్రదర్స్ అన్వేషిస్తున్నారు. ఒక్కసారి ఈడీ కేసులో ఇరుక్కుంటే, దాని నుంచి బయటపడడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్ ఏం ఆలోచిస్తున్నారు? భవిష్యత్ రాజకీయ పంథా ఏంటనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సుజనాచౌదరి, సీఎం రమేష్ తదితరుల బాటే జేసీ బ్రదర్స్‌కు శ్రీరామ రక్ష? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జేసీ బ్రదర్స్ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. సహజంగా అన్నదమ్ములిద్దరూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ, వివాదాస్పద కామెంట్స్ చేస్తూ మీడియాకు మేత ఇస్తుంటారు. కానీ ఈ దఫా అందుకు విరుద్ధం. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చులో జేసీ బ్రదర్స్ ఇరుక్కున్నారు. కేంద్ర, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి దక్షిణాది రాష్ట్రాల అంతటా బస్సులను అక్రమంగా తిప్పుతున్న పాపం పండేరోజులు దగ్గరపడ్డట్టే కనిపిస్తోంది.
రెండు రోజుల క్రితం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, వారి వ్యాపార భాగస్వామి సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అలాగే తాడిపత్రితో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు జేసీ ఫ్యామిలీ మైనింగ్ అక్రమాలను కూడా ఈడీ కూపీ లాగుతున్నట్టు సమాచారం.
త్రిశూల్ సిమెంట్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం మైన్స్‌కు అనుమతులు పొందారు. ఇందుకోసం దాదాపు లక్ష టన్నుల లైమ్‌స్టోన్‌ను అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు మైన్స్ అండ్ జియాలజీ అధికారులు నిర్ధారించారు. రూ.100 కోట్ల జరిమానా కూడా విధించిన సంగతి తెలిసిందే.
ఇంత కాలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే జేసీ బ్రదర్స్ అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ కావడంతో పరిస్థితి సీరియస్‌గా వుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా ఇలాంటి పరిస్థితులు వస్తాయని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పసిగట్టే, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ఆయన్ను జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. త్వరలో బీజేపీలో చేరుతానని కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, బీజేపీలో చేరిక జరగలేదు.
తాజా ఈడీ సోదాలు, కేసుల నేపథ్యంలో బీజేపీలో చేరడం తప్ప, మరో ప్రత్యామ్నాయం జేసీ బ్రదర్స్‌కు లేదని చెబుతున్నారు. బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు, సోదాల ఊసే వుండదనేది బహిరంగ రహస్యమే. ఎటూ ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోంది. ఇలాంటి కేసులను సాకుగా తీసుకుని జేసీ బ్రదర్స్‌ను పార్టీలో చేర్చుకోవడం సులువు అవుతుందనే ప్రచారం జరుగుతోంది. జేసీ బ్రదర్స్‌కు ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరడం ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పక తప్పదు.