గోలియత్‌తో డేవిడ్ ఢీ కొట్టినట్లు దిల్లీలో బిజెపిని ఎదిరించి అరవింద్ నెగ్గినా, మేధావులు, వామపక్షవాదులు, అభ్యుదయవాదులు, సెక్యురిస్టులు, బిజెపి వ్యతిరేకులు అతని పట్ల అంత తృప్తిగా లేరు. నిజానికి యీ రోజుల్లో బిజెపిని అంత చావుదెబ్బ కొట్టిన ప్రాంతీయ పార్టీ నాయకుడు మరొకరు లేరు. సాధారణంగా మనం ఎవరినైనా అభిమానిస్తే, మనం చేయలేని అసాధ్యకార్యాలన్నీ వాళ్లు చేసేయాలని కోరుకుంటాం. అలా జరగకపోతే అలుగుతాం, కోపగించుకుంటాం.
మోదీని జాతీయస్థాయిలో కొట్టగలిగిన నాయకుడే లేడు ప్రస్తుతం. రాష్ట్రస్థాయిలో బిజెపిని నిలవరించడం కూడా చాలా కష్టంగా ఉంటోంది, ముఖ్యంగా ఉత్తరాదిన. అరవింద్, మమత వంటి నాయకులంటే బిజెపి అధినాయకత్వానికి నిలువెల్లా మంట. అలాటి పరిస్థితుల్లో కూడా నెగ్గినందుకు ఆప్‌ను మెచ్చుకోవాలి. కానీ మనసు రావటం లేదు. ఎందుకు? మతతత్వ బిజెపికి ప్రత్యర్థి కాబట్టి అరవింద్ సెక్యులరిజానికి ప్రతినిథిగా నిలబడి, మైనారిటీలకు అండగా ఉన్నానని చాటాలని వారి కోరిక. రైటిస్టు బిజెపికి ప్రత్యామ్నాయంగా లెఫ్టిస్టు కార్యక్రమాలు చేపట్టాలని, ధనిక బిజెపి అభ్యర్థులకు వ్యతిరేకంగా పేద అభ్యర్థులను నిలబెట్టి గెలవాలని వీళ్ల ఆకాంక్ష.
అరవింద్ అవేమీ పట్టించుకోకుండా తనదైన మార్గంలో వెళ్లి నెగ్గడం వీళ్లకు అంతగా రుచించటం లేదు. అరవింద్ విద్యాధికుడు. సమర్థుడైన అధికారి. మంచి ప్రణాళికతో, సరైన వ్యక్తులను కూడదీసుకుని తన యిమేజిని ఎన్నో రెట్లు పెంచుకున్నాడు. తనను తాను ఎక్కువగా వూహించుకుని, జాతీయ పార్టీగా మారబోయి మొట్టికాయలు తిన్నాక సర్దుకున్నాడు. ఐదేళ్ల పాలనలో చాలా నేర్చుకున్నాడు. పైకి ఆదర్శాలెన్ని వల్లించినా ఆచరణవాదిగా ఉండదలచుకున్నాడు. ఈ మేధావుల చప్పట్ల భ్రమలో పడదలచుకోలేదు.
వీళ్ల చప్పట్ల కోసం మోదీకి ఎదురెళ్లి దెబ్బలు తినడం వేస్టని గ్రహించాడు. అందుకే మహారాష్ట్రలో శివసేన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి గాని, ఝార్‌ఖండ్‌లో జెఎంఎం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి గాని హాజరు కాలేదు. సిఏఏను పార్లమెంటులో వ్యతిరేకించినా దిల్లీ ఎన్నికలకు ఒక నెల ముందు కాంగ్రెసు ఏర్పాటు చేసిన సిఏఏ వ్యతిరేక సమావేశంలో పాల్గొనలేదు. తన రాష్ట్రంలోనే ఉన్న జామియాలో కానీ, జెఎన్‌యులో కానీ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నా వెళ్లి బాధితులను పలకరించలేదు.
పార్లమెంటు ఎన్నికలలో 7టిలో 6 స్థానాల్లో ఆప్ మూడో స్థానంలో నిలిచింది. మిగిలినదానిలో రెండో స్థానం! అంతకుముందు 2017 కార్పోరేషన్ ఎన్నికలలోనూ ఓడిపోయింది. ఆప్ ప్రభుత్వం అంటే దిల్లీ జనాలకు మొహం మొత్తిందా అనే శంకతో సర్వే చేయించుకుని చూస్తే అరవింద్‌కు 88% అవ్రూ వల్ రేట్ కనబడింది. 61 సీట్లలో ఆప్‌కు మొగ్గు కనబడింది. ఇక అప్పణ్నుంచి అసెంబ్లీ ఎన్నికలకై సన్నాహాలు, ఓటర్లను చేరే కార్యక్రమాలు మొదలుపెట్టింది ఆప్. 15 మంది సిటింగ్ ఎమ్మేల్యేలను మార్చేసింది.
35 లక్షల యిళ్లకు వెళ్లి తమ ప్రభుత్వపు ప్రోగ్రెస్ రిపోర్టు చూపించింది. దానిలో యిప్పటిదాకా నెరవేర్చిన 10 హామీలను, 10 కొత్త హామీలను చేర్చారు. తమ అధీనంలో ఉన్న రాష్ట్రప్రభుత్వం, బిజెపి అధీనంలో ఉన్న (మొత్తం 272 సీట్లలో 181 వాళ్లవే) దిల్లీ కార్పోరేషన్ పాలనలను పోల్చి చూడండని ఓటర్లను అడిగింది. ఎమ్మెల్యేలు 700 మీటింగుల్లో పాల్గొన్నారు. టీచర్లు, డాక్టర్లు, సోషల్ వర్కర్స్ వంటి ఒపీనియన్ మేకర్స్ 15వేల మందికి కేజ్రీవాల్ నుంచి స్వయంగా ఉత్తరాలు వెళ్లాయి.
67,815 మంది బూత్ లెవెల్ వాలంటీర్లను, 70 వార్ రూములను, ఒక సెంట్రల్ రూమ్‌ను రెడీ చేసుకున్నారు. డిసెంబరులో బిజెపి తన ఎన్నికల సందడి ప్రారంభించేనాటికే ఆప్ రెండు రౌండ్లు పూర్తి చేసింది. ఆలస్యంగా రంగంలోకి దిగడం బిజెపిని దెబ్బ తీసింది. గోదాలోకి దిగబోతూ బిజెపి ముంబయిలో ఉన్న సర్వే సంస్థ చేత సర్వే చేయించింది. వాళ్లు అన్ని నియోజకవర్గాలూ సర్వే చేసి 8 వస్తాయని చెప్పారు. దాంతో అమిత్ షా బిత్తరపోయాడు. అమిత్ తను వేసుకున్న లెక్కను కార్యకర్తల సమావేశంలో చెప్పాడట.
‘ఆప్‌కు 40-42% ఓట్లు వస్తాయి. మనకు 2014 లోకసభ ఎన్నికలలో 46.7% ఓట్లు, 2015 అసెంబ్లీలో 32.2%, 2017 స్థానిక ఎన్నికలలో 36.2%, 2019 లోకసభలో 56.9% వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలలో వచ్చినన్ని అసెంబ్లీ ఎన్నికలలో రావు కానీ మనకు నికరంగా 32% వస్తాయి. ఇప్పుడు మనం షహీన్‌బాగ్, దేశభక్తి అంశం లేవనెత్తి ఆప్‌ను దోషిగా నిబెడితే 7-8% ఓట్లు పెరుగుతాయి. ఇక ఎన్నికల రోజున మీరందరూ జాగ్రత్తగా బూత్ మేనేజ్‌మెంటు చేస్తే మరో 5% పెరుగుతాయి. అంటే మనకు 45%, (అంతిమంగా 38.5% వచ్చాయి). ఆప్‌కు 42% (అంతిమంగా 53.61% వచ్చాయి) మనం కనీసం 43 సీట్లతో తప్పకుండా గెలుస్తాం.’ అని.
లేటుగా దిగినా, అమిత్ తన సైన్యాన్నంతా మోహరించి ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. బిజెపి 6,577 పబ్లిక్ మీటింగులు నిర్వహించింది. ఆఖరి 13 రోజుల్లో 52 రోడ్‌షోలు నిర్వహించి, యింటింటికి బిజెపి వాలంటీర్లు తిరిగారు. బిజెపి కొత్త అధ్యక్షుడు నడ్డా 40 సమావేశాల్లో ప్రసంగించాడు. నితిన్ గడ్కరీ, రాజనాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్ యిత్యాది మంత్రులు 250 మంది ఎంపీలతో సహా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుత, మాజీ బిజెపి ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేశారు. కానీ ఓటింగు రోజున బిజెపి ఓటర్లు ఆప్‌ను ఓడించడం యిష్టం లేక బయటకు రాలేదనే వార్త వచ్చింది. అందుకే కాబోలు 2015లో 67% పోలింగ్ అయితే యీసారి 63% అయింది.
ఫలితాలు వచ్చాక అరవింద్ సంక్షేమ పథకాలను వెక్కిరిస్తున్న బిజెపి తన మానిఫెస్టోలో చాలానే హామీలు గుప్పించింది – రూ. 2ల కు కిలో గోధుమపిండి, స్కూలు విద్యార్థినులకు సైకిలు, పేద కాలేజీ విద్యార్థినులకు ఈ- స్కూటీ, పేద కన్యలకు రూ.50 వేల పెళ్లికానుక.. యిలా! అక్రమంగా వెలసిన 1700 కాలనీలను ఆథరైజ్ చేసి 40 లక్షల మందికి మేలు చేస్తామని హామీ యిచ్చింది. అరవింద్ యిచ్చిన సబ్సిడీలకు ఐదు రెట్లు యిస్తానని మనోజ్ తివారి చెపితే అందరూ నవ్వారు. వెంటనే బిజెపి అది అతని వ్యక్తిగత అభిప్రాయం అని సవరించింది.
ఆప్ ప్రభుత్వతీరుపై విమర్శించడానికి అస్త్రాలు పెద్దగా దొరకకపోవడంతో అరవింద్‌ను దేశద్రోహిగా నిరూపించడానికి కాంపెయిన్ మొత్తం షహీన్‌బాగ్ చుట్టూ తిప్పడానికి చూశారు. సాక్షాత్తూ మోదీయే అది దేశాన్ని చీల్చే ఒక ప్రయోగం అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ‘అరవింద్ షహీన్ బాగ్ ఆందోళనకారులకు బిర్యానీ పంపిస్తున్నాడు’ అన్నాడు. ఆ ఆందోళనకారులను ఉద్దేశించి ‘బోలీసే నహీ తో గోలీసే తో సమ్‌ఝేంగే హీ’ అని యోగి అంటే ‘దేశ్‌కీ గద్దారోంకో గోలీ మారో సాలోంకో’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నినదించాడు. సభకు వచ్చిన వారి చేత అనిపించాడు. దిల్లీలో జరిగేది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అని, ఆప్ తన పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోవాలని బిజెపి ఎంపీ కపిల్ మిశ్రా అన్నాడు.
‘మీరు ఆప్‌ను గెలిపిస్తే యీ షహీన్‌బాగ్ జనాలు మీ యిళ్లకు వచ్చి మీ అక్కచెల్లెళ్లను రేప్ చేస్తారు జాగ్రత్త’ అని హెచ్చరించాడు మరో బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ! దానితో బాటు అరవింద్‌ను గెలిపిస్తే దిల్లీకి మళ్లీ మొఘల్ పాలన తెస్తాడని హెచ్చరించాడు. అతను కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అంటే, ప్రకాశ్ జావడేకర్ దాన్ని సమర్థించాడు. ‘తను అరాచకవాదినని అరవిందే చెప్పుకున్నాడుగా, దాని అర్థం యిదేగా’ అంటూ. వీరెవ్వరినీ బిజెపి అధినాయకత్వం ఖండించలేదు. ఎన్నికల కమిషన్ పర్వేశ్ వర్మపై మూడు రోజుల నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారం ముగిశాక యోగికి నోటీసు యిచ్చింది. బైదివే, యోగి ప్రచారం చేసిన 13 స్థానాల్లో యుపి, బిహార్ వలసదారులు అధిక సంఖ్యలో ఉన్నా 10 వాటిల్లో బిజెపి ఓడిపోయింది. అదీ భారీ మార్జిన్లతో!
ఈ భారీ కసరత్తు తర్వాత బిజెపికి 22-25 సీట్లు వస్తాయని ఆ సర్వే సంస్థ చెప్పింది. దాంతో ఎన్నికల అనంతరం కాస్త హస్తలాఘవం చూపించాల్సి వస్తుందని భావించి అమిత్ ఫలితాల రోజున బిజెపి ఎమ్మేల్యేల సమావేశం ఏర్పరచారు. కానీ ఫలితాలు వెలువడగానే ఆ శ్రమ అక్కరలేదని తెలిసిపోయింది. సీట్ల విషయంలో సర్వే సంస్థ మొదట్లో చెప్పినదే కరెక్టయింది. వాటిలో 2 పాత సీట్లు, 6 కొత్త సీట్లు. వాటిలో 2టిలో 4 వేల లోపు మెజారిటీ వచ్చింది. అయితే గమనించాల్సింది ఏమిటంటే 89% సీట్లు తెచ్చుకున్న ఆప్‌కు వాటిలో 69% సీట్లలో గతంలో కంటె మార్జిన్ తగ్గింది.
బిజెపికి దేనికీ లోటు లేదు. డబ్బుంది, అధికారముంది, బలగముంది, చేతిలో పోలీసు ఫోర్సుంది, ఇల్లిల్లూ తిరగగల వాలంటీర్లున్న పార్టీ వ్యవస్థ ఉంది. దీన్ని ఆప్ ఎలా ఎదుర్కోగలిగింది అన్నదే ఆసక్తిదాయకం. గాలి తమకు అనుకూలంగా ఉందని తెలిశాక కూడా ఆప్ విశ్రమించలేదు. నవంబరు నెలాఖరుకే ప్రశాంత్ కిశోర్ సంస్థ ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పేక్)’ను నియమించుకుంది. అసలు అరవింద్‌యే పెద్ద స్ట్రాటజిస్ట్, అతనికి పికె వంటి మరో స్ట్రాటజిస్ట్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ప్రచారం ఎలా నిర్వహించాలి అన్నదానిపై ఒక స్పష్టత తెచ్చుకున్నారు. బిజెపి ఎంత కవ్వించినా సరే, మోదీని డైరక్టుగా విమర్శించక పోవడంతో బాటు, బిజెపి నాయకులందరూ షహీన్‌బాగ్‌పై నీ అభిప్రాయం చెప్పు అంటూ ఛాలెంజ్‌లు గుప్పించినా హిందూత్వ వలలో పడకూడదని నిశ్చయించుకున్నారు.
గతంలో బిజెపి వాళ్లు రాహుల్ గాంధీని అలాగే ముగ్గులోకి దింపారు. ఇక రాహుల్ గుళ్లట్టుకుని తిరిగాడు, శివభక్తుణ్ని అని చెప్పుకున్నాడు, ఓ కాంగ్రెసు నాయకుడు అతన్ని జందెం వేసుకునే బ్రాహ్మడు అని కితాబు కూడా యిచ్చేశాడు. ఎన్ని మొగ్గలేసినా రాహుల్‌ని హిందూత్వ నాయకుడిగా హిందువులు ఎవరూ అనుకోలేదు. హిందూత్వ ఓట్లన్నీ బిజెపికే పడ్డాయి. అందువలన అరవింద్ ‘నేను హిందువుని, అచ్చమైన ఆంజనేయభక్తుణ్ని, యితర మతస్తులపై దాడికి వెళ్లని మంచి హిందువుని’ అని చూపుకుని వూరుకున్నాడు.
మీరు ఆంజనేయ భక్తుడంటున్నారు కదా, హనుమాన్ చాలీసా అప్పచెప్పగలరా? అని టీవీ యాంకర్ అడిగినప్పుడు టపటపా అప్పచెప్పేసి మార్కులు కొట్టేశాడు. నామినేషన్ వేయడానికి ముందు హనుమంతుడి గుడికి వెళ్లివచ్చాడు. ఫలితాలు వచ్చిన రోజున ‘ఇవాళ మంగళవారం, హనుమంతుడి రోజు. ఆయన భక్తులు విజయం సాధించిన రోజు’ అని ప్రకటించాడు. అరవింద్ వెళ్లడం వలన ఆ గుడి అపవిత్రం అయిపోయింది అని బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారి అంటే ‘అదుగో, బిజెపి అస్పృశ్యత పాటిస్తోంది చూడండి’ అని అరవింద్ యాగీ చేశాడు.
ఇన్నాళ్లూ యీ హనుమద్భక్తి చాటుకోలేదేం? అని అడిగితే ‘ఎవరూ అడగలేదు, అందుకని చెప్పలేదు’ అని జవాబిచ్చాడు. ఆ మాట కొస్తే మోదీ గుజరాత్ ఎన్నికలకు పరిమితమైనంత కాలం తను చాయ్‌వాలా అని కానీ, బిసి అని కానీ ఎన్నడూ చాటుకోలేదు, ముసలితల్లిని తెరపైకి తీసుకురాలేదు. ఇదంతా పికె రచించిన స్ట్రాటజీలో భాగం! ఇప్పుడు పికె అరవింద్‌కు పాఠాలు నేర్పుతున్నాడు. ఈసారి దిల్లీ ఎన్నికలలో బిజెపి కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు యివ్వగా ఆప్ కార్యకర్తలు ‘బజరంగ్‌బలీకీ జై’ అని ప్రతినినాదాలు చేశారు. రేపు బెంగాల్ ఎన్నికలలో పికె మమత చేత కాళీమాత వేషం కట్టిస్తాడేమో!
బిజెపికి యివేమీ చాలలేదు. ‘నువ్వు అసలైన హిందువువి అయితే ముస్లిములను నిందించాలి. సిఏఏని సమర్థించాలి. షహీన్‌బాగ్ ఆందోళనకారులను గోలీమారో అనాలి, టుక్‌డేటుక్‌డే గ్యాంగ్ అనాలి’ అని పట్టుబట్టింది. అరవింద్ ఆ సవాళ్లకు స్పందించలేదు. తనకు పట్టనట్లు ఊరుకున్నాడు. ఆ గొడవలోకి దిగితే అంతిమంగా బిజెపిదే గెలుపని తెలుసు అతనికి. అందుకని ఆ జోలికి పోలేదు.
అలా పోకపోవడం సెక్యురిస్టులకు నచ్చలేదు. అరవింద్ 370 రద్దుని స్వాగతించాడు. అయోధ్య తీర్పుని స్వాగతించాడు. పార్లమెంటులో సిఏఏను వ్యతిరేకించాడు తప్ప దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టలేదు. యూనివర్శిటీ గొడవల గురించి తన అభిప్రాయం చెప్పలేదు. ఇవన్నీ ఆప్ ఓటర్లకు పట్టని వ్యవహారాలని అతని అంచనా. 2017 మునిసిపల్ ఎన్నికలలో ఓటమి తర్వాత అతను బిజెపిపై ఒంటికాలిపై లేవడం మానేశాడు. కానీ అతను కాంగ్రెసు తరహాలో షహీన్‌బాగ్ ఆందోళనకారులను వెనకేసుకుని రావాలని సెక్యురిస్టులు కోరుకున్నారు.
కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలు వుండవచ్చు కానీ 66 సీట్లలో పోటీ చేస్తే 63 సీట్లలో డిపాజిట్టు పోవడం చూస్తే సిఏఏ పట్ల వ్యతిరేకత దానికి రాజకీయంగా ఏమీ లాభించలేదని అర్థమైంది. షహీన్‌బాగ్‌ను సమర్థిస్తూ ప్రకటను చేసిన శిశోడియా ఎంతో బాగా పని చేసినా గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు 2 వేల మార్జిన్‌తో గట్టెక్కాడు. షహీన్‌బాగ్ గురించి బిజెపివారు, జర్నలిస్టులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అరవింద్ తొణకలేదు. అటువైపు తొంగి చూడలేదు. నీ దిల్లీ కాదా, నీకు బాధ్యత లేదా? రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోతూ వుంటే పట్టదా? అని ఉక్కిరిబిక్కిరి చేయబోయారు.
‘అది నేను సృష్టించిన సమస్య కాదు. వారడిగేదానికి నా వద్ద సమాధానం లేదు. పరిష్కారం నా చేతిలో ఉండి వుంటే వెంటనే వెళ్లేవాణ్ని. అది కేంద్ర హోం శాఖ చేతల వలన వచ్చిన వివాదం. అత్యంత శక్తిమంతుడిగా పేరు పొందిన హోం మంత్రి ఊళ్లోనే ఉన్నారు. నెలల తరబడి ఆందోళన జరుగుతున్నా ఆయన ఎందుకు వెళ్లలేదు? ఎందుకు అణచలేదు? శాంతిభద్రతల విషయంలో నా జోక్యం లేదన్నారు. నేనేం చేయగలను? నా ఫోకస్ యావత్తు దిల్లీ పౌరులపై ఉంది. అన్ని మతాల వారికీ న్యాయం చేయడమే ముఖ్యమంత్రిగా నా బాధ్యత.’ అని గిరి గీసుకుని కూర్చున్నాడు. ఎంత కవ్వించినా అది దాటి బయటకు రాలేదు. (సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)