స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరిచి పెడబొబ్బలు పెట్టడం, దానికి ఎల్లో మీడియా వంత పాడుతుండటం అందరికీ తెలిసిందే. వీరికి తోడు గెస్ట్ పొలిటీషయన్, ఫుల్ టైమ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ వచ్చి అధికార పార్టీని హెచ్చరించారు. వైసీపీ దౌర్యన్యాలకు పాల్పడుతోందని, ఏపీలో బీహార్ పరిస్థితులున్నాయని పవన్ అన్నారు. రాజకీయాలన్న తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే.
అయితే తమ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా సమాజానికి చేసిన , చేస్తున్న ద్రోహం గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ వేళ అన్యాయం గురించి బాబు ఎంత గగ్గోలు పెట్టినా, ఎల్లో మీడియా ఎన్ని రాసినా సమాజం నుంచి స్పందన లేకపోవడానికి….గతంలో వాళ్లు చేసిన తీవ్ర తప్పిదాలే కారణమని చెప్పక తప్పదు. వాళ్లిద్దరూ ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించినా ఏపీ సమాజం ఎంతోకొంత మెరుగ్గా ఉండేది. కానీ వాళ్లు చేసిన నేరాలు, ఘోరాలు కారణంగా …వాళ్ల ఆరోపణలపై నమ్మకం పోయి, స్పందించే హృదయాలు కరువయ్యాయి.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలనే తీసుకుందాం. ప్రతిపక్ష పార్టీల నాయకులను కనీసం నామినేషన్లు కూడా వేసుకోనివ్వడం లేదని, ఒకవేళ వేసినా ఏదో ఒక సాకుతో తిరస్కరిస్తూ ఏకపక్షంగా ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ముఖ్యంగా చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాబు ఆరోపణలు నిజమేనని కాసేపు అనుకుందాం. మరెందుకు పౌర సమాజం నుంచి కనీస స్పందన కూడా రాలేదు అని ప్రశ్నించుకుంటే…దానికి మొదటి ముద్దాయి బాబు అని జవాబు వస్తుంది.
ఎందుకంటే వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి తనకు ప్రధాన ప్రత్యర్థి అవుతాడనే భయం చంద్రబాబులో పుట్టింది. అందుకే జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చాడు. జగన్‌పై రూ.1500 కోట్లకు లోపు అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులు నమోదైతే లక్ష కోట్ల అవినీతి అని చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలంతా ఆరోపణలు చేయడం, దానికి ఎల్లో మీడియా వంత పాడటం జరుగుతూ వచ్చింది. జగన్‌పై లేనిది ఉన్నట్టు రాయడం, తమ చానళ్లలో చూపడం, వాటి ఆధారంగా టీడీపీ నేతలు ఆరోపిస్తుండటం…గత తొమ్మిదేళ్లుగా జరుగుతూ వస్తోంది.
ఇక సార్వత్రిక ఎన్నికల సమయాల్లోనైతే ప్రత్యేక పేజీలు పెట్టి…పేజీలకు పేజీలు కేవలం జగన్‌పై వ్యతిరేక వార్తలు రాయడానికే కేటాయించడం కూడా చూశాం. ఇదే సమయంలో సోషల్ మీడియా రావడంతో అసలు నిజాలేమిటో జనానికి తెలిసి వచ్చింది. దీంతో టీడీపీ-ఎల్లో మీడియా ఆగడాలకు ఎంతోకొంత అడ్డుకట్ట పడుతూ వచ్చింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -ఎల్లో మీడియా ఏమి రాసినా, చూపినా, మాట్లాడినా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు ఏం మాట్లాడినా…ఆయన అట్లే మాట్లాడుతార్లే అని, ఎల్లో మీడియాలో ఏం రాసినా ఆ పత్రికలు, చానళ్లు అట్లే రాస్తాయి, కూస్తాయిలే అనే అభిప్రాయం బలపడింది. అందువల్ల టీడీపీ నేతల మాటలను, ఎల్లో మీడియా పత్రికలను జనం పట్టించుకోవడం మానేశారు.
నిజాల్ను దాస్తూ, అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తూ….ఇంత కాలం సమాజాన్ని వంచిస్తూ వచ్చిన చంద్రబాబు, ఎల్లో మీడియా…తాము చేసిన ద్రోహం వల్ల ఎలాంటి విపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తున్నదో అనుభవంలోకి వస్తున్నట్టుంది. నిజంగా చంద్రబాబు నిజాలే మాట్లాడుతున్నా, ఎల్లో మీడియా నిజాలే రాస్తున్నా, తమ చానళ్లలో చూపుతున్నా జనం పట్టించుకునే పరిస్థితులు లేవు. తమకు అవసరమైనప్పుడే పౌర సమాజం స్పందించాలనుకుంటే…అది కుదరని పని. ఎందుకంటే పౌరసమాజానికి విచక్షణ ఉంది. లేనిది చంద్రబాబతో పాటు ఆయనకు భాజాభజంత్రీలు మోగిస్తున్న ఎల్లో మీడియాకు మాత్రమే. నిజాలకు పాతరేస్తూ వచ్చిన చంద్రబాబు, ఎల్లో మీడియా…దాని పర్యవసాలను ఇప్పుడు అనుభవిస్తుండటం గమనార్హం.