హీరోయిన్ అనుష్క తన సినీ ప్రస్థానాన్ని 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమె తన నటనతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కథానాయకిగా 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిశ్శబ్దం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అనుష్కతో కలసి పనిచేసిన దర్శకనిర్మాతలు వచ్చారు. అనుష్కతో తమ అనుభవాలను ఒకొక్కరు ఒక్కో విధంగా, వైవిధ్యభరితంగా పంచుకుని ఆకట్టుకున్నారు.
ముందుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తాను శ్రీరామదాసు చిత్రం తీస్తున్నప్పుడు అనుష్కను నాగార్జున పరిచయం చేశాడన్నారు. స్వీటీ అని పిలవగానే మెట్లు ఎక్కుతూ వచ్చిందన్నారు. ఎందుకో గానీ ఆ రోజే అనుష్కతో ‘నువ్వు దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అవుతావు’ అని చెప్పానన్నారు. అనుష్క విషయంలో పాత్రలే ఆమెని వెతుక్కుంటూ వచ్చాయన్నారు. ఈ తరం హీరోయిన్‌లలో ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కలేదన్నారు. తనను ‘మౌన ముని’ అని పిలిచేవారని, కానీ నిశ్శబ్దం సినిమాతో అనుష్క ‘మౌనముని కన్యక’ అవుతుందన్నారు.
మరో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ అనుష్క కేవలం నటి మాత్రమే కాదని, మంచి మనస్సున్న అమ్మాయి అని ప్రశంసించారు. తన హృదయంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఒక ఆసక్తికర విషయాన్ని సభలో చెప్పారు. ఆయన మాటల్లోనే …
‘ఆరు నెలల క్రితం షూటింగ్ నిమిత్తం జార్జియాకు వెళ్లా. అక్కడ నన్ను చూసుకోడానికి జాజా అనే రష్యా వ్యక్తిని నియమించారు. మేం హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పాం. అతను వెంటనే స్వీటీ తెలుసా అని ప్రశ్నించాడు. తర్వాత తన కోసం అనుష్క ఏం చేసిందో చెప్పాడు. సినిమా షూటింగ్‌కి జార్జియా వెళ్లినప్పడు అనుష్క కారు డ్రైవర్‌గా అతను ఉన్నాడట. అయితే ఒకరోజు జాజాకు బదులుగా, మరో వ్యక్తి కారు తీసుకెళ్లాడట. అప్పుడు ఆరా తీస్తే జాజా కారును ఫైనాన్ష్ వాళ్లు తీసుకెళ్లారని చెప్పారట. అనుష్క వెంటనే స్పందించి జాజాను పిలిపించిందట. అతన్ని స్వయంగా తీసుకెళ్లి కారు కొనిచ్చిందట. ఇలా ఎంత మంది చేస్తారు’ అని శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ ఒక్క విషయం చాలు అనుష్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెప్పడానికి. అనుష్కలోని మానవత్వాన్ని నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించడం ప్రశంసనీయం. జార్జియాలో అనుష్క అంత గొప్ప పని చేసిందా అని సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు.