ప్రత్యర్థులపై ఆకట్టుకునే విమర్శలో సెటైర్ ఓ ప్రక్రియ. ప్రత్యర్థులు కూడా తమపై విసిరిన సెటైర్‌కు నవ్వుకునేలా వుండాలి. ఈ విద్యలో తెలంగాణ నాయకులతో పోలిస్తే ఏపీ నేతల్లో ఆ స్పృహ తక్కువే. ఏపీ నేతలకు బూతులు తిట్టడంతో మరెవరూ సాటిరారు. ఎవరి కళ వారిది? తెలంగాణ అసెంబ్లీ వేదికగా చంద్రబాబునాయుడిపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే సెటైర్స్ విసరడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కేటీఆర్ మాదిరిగా ఒక్కనాడైనా అసెంబ్లీలో చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ సందర్భోచితంగా సెటైర్స్ విసిరారా? అనే ప్రశ్న తలెత్తింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యర్థులపై కేటీఆర్ విరుచుకుపడుతుంటే, దివంగత వైఎస్సార్‌ను గుర్తు తెస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నేతల కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడి ప్రస్తావనను కేటీఆర్ పరోక్షంగా తీసుకొచ్చారు. ఆయనపై సెటైర్స్ విసిరి అందరూ నవ్వుకునేలా చేశారు.
తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో కామెంట్స్ చేశారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. ఇందుకు చంద్రబాబును అస్త్రంగా ఆయన వాడుకోవడం గమనార్హం.
కేటీఆర్ ఏమన్నారంటే… ‘గతంలో ఓ పెద్ద మనిషి (చంద్రబాబు) కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టే అన్నీ తానే చేశానని చెప్పుకునేవాడు. ఇటీవల ఆయన ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లాడు. నేనెవరో తెలుసా? అని ఒక రోగిని ఆయన పలకరించాడు. పేషెంట్లను పలకరించాడు. తనకు తెలియదని రోగి బదులిచ్చాడు. ‘నేను తెలియదా.. ఈ హైదరాబాద్ కట్టింది నేనే’ అని రోగిని ఆ పెద్దాయన నిష్టూరమాడాడు. అప్పుడు ఆ రోగి స్పందిస్తూ ‘అవునా విశాఖపట్నం పక్కన సముద్రాన్ని నేనే ఏర్పాటు చేశా అని చెప్పినా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు’ అని బదులిచ్చాడు.. మీరు (కాంగ్రెస్ నేతలు) చెబుతున్నది కూడా అట్లుంది ’ అని మంత్రి వెటకరించారు.
గతంలో కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఆంగ్ల పరిజ్ఞానంపై కేటీఆర్ తనదైన స్టైల్‌లో పంచ్ విసిరారు. బ్రీప్‌డ్ మీ అంటూ దరిద్రమైన ఇంగ్లీష్ మాట్లాడేది ఒక్క చంద్రబాబే అంటూ చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. కేటీఆర్ కామెంట్స్‌నే ప్రతిపక్ష నాయకుడిగా ఒక సందర్భంలో జగన్ వాడుకున్నారు.