రైతు అంటేనే పేదోడు. పంట పండుతుందో లేదో తెలియని అమాయకుడు. పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో అస్సలు తెలియని వెర్రిబాగులోడు. రైతు ఆత్మహత్యలు దేశంలో సర్వసాధారణమైన రోజులివి. ఇలాంటి టైమ్ లో ఓ పంట వచ్చింది. రైతును రాజును చేసింది. అదేదో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మేలురకం లగ్జరీ సరుకు కాదు. అందరికీ ఎంతో సుపరిచితమైన, అందరి వంటకాల్లో భాగమైన టమాట.
అవును.. టమాట పంట దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతుల్ని రాజుల్ని చేసింది. టమాట పుణ్యమా అని అప్పటివరకు కలలో కూడా ఊహించని లక్షల రూపాయల్ని కళ్లజూశారు రైతులు. కొంతమంది కోటీశ్వరుల జాబితాలోకి కూడా చేరారు. అంతా టమాట చలవ.
జులై, ఆగస్ట్ నెలల్లో టమాట పండించిన రైతులు, ఈ ఏడాది తమ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణలోని పులుమామిడి గ్రామానికి చెందిన అనంతరెడ్డి అనే రైతు ఈ ఏడాది ట్రాక్టర్ కొనుక్కున్నాడు. అంతేకాదు, తన కోసం హుందాయ్ కారు కూడా కొనుక్కున్నాడు. ఇదంతా టమాట చలవ. ఎకరాకు 20 లక్షలు ఆర్జించాడు ఈ రైతు. అతడికి 8 ఎకరాలుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చెందిన రైతులు కొంతమంది 3 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారు. కర్నాటకలోని జలబిగనాపల్లె గ్రామానికి చెందిన అరవింద్ అనే రైతు తన 5 ఎకరాల్లో టామాట వేశాడు. కోటిన్నర ఆర్జించాడు. అంగన్ వాడీ వర్కర్ గా పని చేస్తున్న తన తల్లికి ఓ ఇల్లు కొనిచ్చాడు.
టమాట ఎప్పుడూ రైతుకు చేదే..!
ఈ ఏడాది లక్షలు, కోట్లు కురిపించిన టమాట, నిజానికి ప్రతి ఏటా రైతుకు కన్నీళ్లే మిగిల్చింది. ఉదాహరణకు తెలంగాణలోని సయ్యద్ పల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతునే తీసుకుందాం. ఏటా ఈ రైతు టమాట వేస్తాడు. డబ్బా 50 రూపాయలకు మించి ఎప్పుడూ అమ్మలేదు. అంటే కిలో రూ.2 అన్నమాట. ఎన్నోసార్లు గిట్టుబాటు ధర రాక పంటను కాల్వలో పడేసిన అనుభవం ఇతడిది.
దీనికితోడు అకాల వర్షాలు, పెరిగిన లేబర్, రవాణా ఖర్చులు నరసింహారెడ్డిని కోలుకోని దెబ్బతీశాడు. అయినా అతడికి తెలిసింది టమాట పంట వేయడం ఒక్కటే. అదే ఈ ఏడాది అతడ్ని కరుణించింది. ఏప్రిల్ లో తన 10 ఎకరాల్లో టమాట వేసినప్పుడు, తను కోటీశ్వరుడ్ని అవుతానని నర్సింహా కలలో కూడా ఊహించి ఉండడు. గిట్టుబాటు ధర రావాలని మాత్రమే దేవుడ్ని కోరుకొని ఉంటాడు. కానీ అతడు జాక్ పాట్ కొట్టాడు. కోట్లు ఆర్జించాడు.
నర్సింహ మాత్రమే కాదు.. ఆ గ్రామంలో మరో 150 మంది రైతులు కూడా టమాట సాగుతో లక్షలు ఆర్జించారు. అంతా తమ పాత అప్పులు తీర్చుకున్నారు, కొత్త ఆస్తులు కొనుక్కున్నారు. ఇక నర్సింహ అయితే తన కూతురు ఇంజినీరింగ్ సీటు పక్కా చేశాడు.
మొన్నటివరకు అప్పులు, ఇప్పుడు సెలబ్రిటీ..
కర్నాటకలోని పాల్య గ్రామానికి చెందిన సీతారాం అంటే అందరికీ చిన్నచూపు. ఊరంతా అప్పులు చేశాడు. అతడు ఎదురుపడితే, ఎక్కడ అప్పు అడుగుతాడా అని తప్పించుకొని తిరిగేవారు జనం. అలా చేసిన అప్పులన్నీ టమాట సాగుపైనే పెట్టాడు. ప్రతిసారి నష్టం చవిచూశాడు. ఎట్టకేలకు టమాట అతడ్ని కరుణించింది. రేటు పెరగడంతో 50 లక్షలు వస్తాయని ఆశించాడు సీతారాం. కానీ కోట్ల రూపాయలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. అప్పులన్నీ తీర్చేశాడు. మరో కోటిన్నర భవిష్యత్ ఆవసరాల కోసం ఆదా చేశాడు. ఇప్పుడు ఆ ఊరిలో సీతారం సెలబ్రిటీ.
నిజానికి ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య టమాట ధర విపరీతంగా పడిపోయింది. దీంతో చాలామంది పంట సాగు మానుకున్నారు. కానీ కర్నాటకకు చెందిన పసలప్పగరి సోదరులు మాత్రం చావోరేవో అనుకున్నారు. తెగించి తమ పాతిక ఎకరాల్లో మళ్లీ టమాట వేశారు. వాళ్ల తెగింపు విలువ 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు వాళ్లు ఆ డబ్బును మరిన్ని పొలాలు కొనడంపై వెచ్చిస్తున్నారు.
అడ్డంగా బుక్కైన మధ్యప్రదేశ్ రైతులు..
మధ్యప్రదేశ్.. భారతదేశంలో అతిపెద్ద టమాటా ఉత్పత్తిదారు. కానీ ఈ రాష్ట్రంలో చాలామంది రైతులు అధిక లాభాలు చూడలేకపోయారు. ఎందుకుంటే, ధరలు పెరగకముందే వారు తమ ఉత్పత్తులను అమ్మేశారు. శివపురిలో 16 సంవత్సరాలుగా టమాటాలు పండిస్తున్న నివేష్ జాట్ అనే రైతు కేవలం నామమాత్రపు లాభాలతో సర్దుకోవాల్సి వచ్చింది. వాళ్ల ప్రాంతంలో టమాటకు డిమాండ్ పెరిగేసరికి, సప్లయ్ తగ్గిపోయింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక నుండి సరుకు తెప్పించుకున్నారు. ఆ రాష్ట్రాల రైతులు కోట్లలో ఆర్జించారు. నివేష్ జాట్ లాంటి రైతులు మధ్యప్రదేశ్ లో చాలామంది. అయితే జులై చివరి నాటికి మరో పంట పండించి, వీళ్లలో చాలామంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాట రేట్లు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఈ రేటు కూడా ఎక్కువే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం కిలో టామట ధర 100 రూపాయల నుంచి 150 రూపాయల మధ్య నడుస్తోంది. ఈ రేటు ఇలానే మరో నెల రోజులు కొనసాగితే, తాము ఇంకో 40-50 లక్షలు ఆర్జిస్తామని నమ్మకంగా చెబుతున్నారు కొంతమంది తెలుగు రైతులు.