చట్టాలను ఎలా చేస్తున్నారో తర్వాత సంగతి, ఎలా చూస్తున్నారో` అన్నది అప్పుడప్పుడూ ముఖ్యమయిపోతుంది. సృష్టి ఎంత ముఖ్యమో, దృష్టీ అంతే ముఖ్యం. తాజ్ మహల్ గొప్ప సృష్టి. ‘అదీ ఒక సమాధే!’ అని ఎవరన్నా అనేశాడనుకోండి. తప్పేముందీ? ఉన్నదే కదా, అన్నాడు? ‘మీరు చెప్పండి. అది సమాధి కాదా?’ అని దబాయించవచ్చు. అప్పుడు`భార్య మీద షాజహాన్ కు ఎంత ప్రేమ వుంతో, అంతా ఆ కట్టడంలో ఒలికించి నట్లులేదూ?` అని సరిదిద్దాలనిపిస్తుంది. (అసలు కట్టింది ఎవరూ? ఎంత శ్రమనొలికించారూ` అది తర్వాత సంగతి.) కానీ భార్య భార్యే కదా! కట్టుకుంటే ఏ స్త్రీ అయినా భార్య అయిపోవాలి కదా! భార్య అన్నాక ఏలుకోవాలి. అంతే కానీ, ప్రేమించాలీ` అనే రూలెక్కడన్నా వుందా? అని అంటే ఏం చెబుతాం?
నిర్మించిన కట్టడమే కాదు, చేసిన శాసనమూ అంతే. సృష్టిలోనే లోపం వుండవచ్చు. అది తెలుస్తుంది. వెంటనే సవరించుకోవచ్చు. కానీ దృష్టి లోపం వుంటే ఎలా? శాసన సృష్టి బట్టే న్యాయం వుండదు. శాసనాన్ని చూసే దృష్టిని బట్టి కూడా న్యాయం వుంటుంది. అమెరికాలాంటి అభివృద్ది చెందిన దేశాల్లో కూడా, ఈ ‘లోపాన్ని’ అప్పుడప్పుడూ లేవనెత్తుతుంటారు. ఎన్నోకేసుల్లోని ఎన్నో తీర్పుల్లో, ఈ ‘లోపాన్ని’ పలు సమూహాలు ఎత్తి చూపుతూ వచ్చాయి. వస్తున్నాయి కూడా. మరీ ముఖ్యంగా ‘ఆఫ్రోఆమెరికన్ల’ పై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు శ్వేత జాతీయులయితే, పలు వాదనలూ, ఆధారాలూ విస్మరణకు గురయ్యేవి.
ఇలాంటి ఘటనల మీద చిత్రాలు కూడా వచ్చాయి.‘జస్ట్ మెర్సీ’ అనే సినిమా తాజా ఉదాహరణ. ‘తెల్ల’ కళ్ళకు ‘నల్ల’ వాస్తవాలు అంత తొందరగా కనిపించవని పలు వ్యాజ్యాలు రుజువు చేశాయి. అలాగే దళితుల పై జరిగే దాడులు, అత్యాచారాల కేసుల్లో కూడా దళితేతర న్యాయమూర్తులు వున్నప్పుడు కూడా ఇలాంటి ఆక్షేపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ‘చుండూరు’ మారణకాండలో సాక్ష్యాలు రుజువు కాని కారణంగా నిందితులందరూ, నిరపరాధులుగా వచ్చినప్పుడు ఈ అభ్యంతరాలు తీవ్రంగా వెల్లడయ్యాయి. స్త్రీల సమస్యల విషయంలో అయితే చెప్పనవసరంలేదు.
పురుష దృష్టితోనో, పురుషాధిక్య దృష్టితోనే చూడకుండా పురుష న్యాయమూర్తులు న్యాయం చెప్పటం కష్టతరమే. ఇందుకు కేవలం న్యాయశాస్త్రం మీద అధికారం వుంటే చాలదు. పురుషాధిక్య భావజాలం మీద తనకు తాను అనునిత్యం యుద్ధం చేసుకునే వ్యక్తి అయితే తప్ప, స్త్రీ సమస్యపై న్యాయాన్నివ్వలేరు. అందుకనే ప్రజాస్వామ్యం లోని ప్రతీ అంగంలోనూ అన్ని సమూహాలకూ ప్రాతి నిథ్యం వుండాలి. చట్టసభల్లో స్థానాల్లోనే ఈ ప్రాతినిథ్యం కనపడటం లేదు. ఉద్యమాల ఫలితాలు ఇంకా అక్కడే కనపించటం లేదు. ఇక న్యాయవ్యవస్థలో స్త్రీలకూ, అన్ని సామాజిక సమూహాలకూ ప్రాతినిథ్యం కలిగించే దిశగా పోరాటమే మొదలు కాలేదు. కాబట్టే. అప్పుడప్పుడూ న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులకే కాదు, వ్యాఖ్యలకు కూడా ఉలిక్కి పడాల్సి వస్తోంది.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత హోదా లో వున్న ప్రధాన న్యాయమూర్తి ఒక అత్యాచార నిందితుడికి వేసిన ప్రశ్నకు పలు మహిళా సంఘాల వారు అవాక్కయ్యారు. ‘ఆమెను పెళ్ళి చేసుకుంటావా?’. ఇలాగే అడిగారు. నిందితుడు మహారాష్ట్ర రాష్ట్ర విద్యుదుత్పాతక కంపెనీ లో టెక్నిషియన్ గా పనిచేస్తున్నాడు. పేరు మొహిత్ సుభాష్ చవాన్. 2014`15 మధ్య కాలంలో ఒక మైనరు బాలికను పలుమార్లు బలాత్కరించినట్లు అతడి మీద అభియోగం. అప్పుడతనికి 17`18 యేళ్ళ మధ్య వయసు వుంటుంది. అప్పుడు బాధితురాలు తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ కేసులో ఆ అమ్మాయి అభ్యర్థన మేరకు నిందితునికి దిగువ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును బాంబే హై కోర్టు రద్దు చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీం కోర్టు ను ఆశ్రయించి, ముందస్తు బెయిలు నడిగాడు.
నాలుగు రోజుల క్రితం ఈ కేసును విచారిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రశ్న వేశారు. అంతే కాదు. ‘నువ్వు ఆమెను లైంగికంగా వేధించే ముందూ, అత్యాచారానికి పాల్పడే ముందూ ఆలోచించుకోవాల్సింది. నువ్వు ప్రభుత్వోద్యోగివన్న విషయం నీకు అప్పుడు తెలుసు. పెళ్ళాడమని మేం నిన్ను వత్తిడి చేయటం లేదు. నీకు ఇష్టమయితే చెప్పు. అలా కాకపోతే, మేమే నిన్ను పెళ్ళాడమని బలవంత పెట్టినట్లవుతుంది.’ అని న్యాయమూర్తి అన్నారు. నిందితుడు న్యాయవాది సమాధానం తెచ్చారు. ఒకప్పుడు నిందితుడు ఆమెను పెళ్ళాడాలనే అనుకున్నాడనీ, అప్పుడా అమ్మాయి నిరాకరించిందని కోర్టుకు తెలిపాడు. ‘ఇప్పుడయితే నేను పెళ్ళాడలేను’ అని నిందితుడు కోర్టుకు తెగేసి చెప్పేశాడు.
నాగరీక సమాజంలో అత్యాచారం అన్నది అత్యంత హేయమైన చర్య. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ చట్టాలు రూపొందించుకున్నాం. అలాంటి వ్యక్తి ‘పెళ్ళి చేసుకుంటావా? జైలుకు వెళ్తావా?’ అనే అవకాశాన్నివ్వటం మైనరు బాలిక హక్కులను విఘాతం కలిగించటమే అవుతుంది. నిజానికి కట్టుకన్న భార్యనయినా బలాత్కరించం నేరమని భావిస్తూ, పలుదేశాలు, తమ శిక్షా స్హృతుల్లో ‘వైవాహిక అత్యాచారాన్ని’ నేరంగా రాసుకుంటున్నాయి. అలాంటిది చేసిన అత్యాచారానికి వివాహంతో విరుగుడు తేవటం ఎంత వరకకూ న్యాయం?