ఆకాశమంత అందం ఉన్నా ఆవ గింజ అంత అదృష్టం దానికి తోడవ్వాలి. లేదంటే అందమంతా అడవి కాచిన వెన్నెల అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా మారుతున్నారు కొంతమంది హీరోయిన్లు. శ్రీలీల రాకతో పూజాహెగ్డే, రష్మిక, కృతిషెట్టి లాంటి హీరోయిన్ల అవకాశాలకు గండిపడింది. అయితే అంతకంటే ముందే రాశిఖన్నా కెరీర్ చివరి దశకు చేరుకుంది.
దాదాపు పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ బ్యూటీ, సరైన ప్రాజెక్టులు ఎంచుకోలేక చతికిలపడింది. ఒక దశలో అవకాశాల కోసం సైజ్ జీరోకి కూడా మారింది. కానీ ఆమె కష్టం వృధా అయింది. దీనికితోడు పక్కా కమర్షియల్, థ్యాంక్యూ లాంటి రెండు పెద్ద డిజాస్టర్ల తర్వాత రాశిఖన్నాకు అవకాశాలిచ్చేవాళ్లు కరువయ్యారు.
రాశిఖన్నా కొంచెం బెటర్. కనీసం పదేళ్లైనా కెరీర్ లాగించింది. నభా నటేష్, నిధి అగర్వాల్ అయితే మరీ ఘోరం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కొచ్చిన నిధి, ఇస్మార్ట్ శంకర్ తర్వాత సక్సెస్ అందుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఆమెకు ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్. పవన్ తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై గంపెడాశలు పెట్టుకుంది ఈ చిన్నది.
నిధితో పాటు ఇస్మార్ట్ శంకర్ లో నటించిన నభా నటేష్ కు కూడా కెరీర్ లో ఆ సక్సెస్ మాత్రమే మిగిలింది. ఆ తర్వాత ఆమె 4 సినిమాలు చేస్తే, వేటికవే ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం హాట్ హాట్ ఫొటోషూట్స్ తో రెచ్చగొడుతున్నప్పటికీ, నభాకు అవకాశాలిచ్చేవాళ్లు లేరు. యాక్సిడెంట్ కు గురవ్వడం ఆమె కెరీర్ కు పెద్ద దెబ్బ.
నివేత పెతురాజ్, మెహ్రీన్ ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. దాస్ కా ధమ్కీ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ కూడా నివేత పెతురాజ్ కు కలిసిరాలేదు. అటు మెహ్రీన్ అయితే తన అవకాశాల్ని తానే చెడగొట్టుకుంది. బొద్దుగా కనిపిస్తూ, టాలీవుడ్ జనాల్ని ఎట్రాక్ట్ చేసి ఈ హీరోయిన్, ఆ తర్వాత స్లిమ్ గా మారింది. తను మరింత గ్లామరస్ గా మారానని మెహ్రీన్ అనుకుంది, కానీ టాలీవుడ్ మాత్రం మరోలా ఫీలైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా చిన్నది.
అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ ల కెరీర్స్ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఊర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ కొట్టిన అను, ఆ వెంటనే రావణాసుర సినిమాతో ఫ్లాప్ అందుకుంది. మేఘా ఆకాష్ కు కూడా రావణాసుర సినిమా దెబ్బేసింది. దీంతోపాటు మరో 4 ఫ్లాపులిచ్చింది.
లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే సినిమాల తర్వాత ఈమె కెరీర్ కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవాలి. వరుణ్ తేజ్ తో పెళ్లయిన తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగుతుందా, గ్యాప్ ఇస్తుందా అనేది చూడాలి.
అయితే రీతూవర్మ పరిస్థితి వేరు. ఈమె 'ఒకే ఒక జీవితం' అనే సినిమాతో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత తెలుగు సినిమాల కంటే, తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అలా టాలీవుడ్ కు కాస్త దూరమైంది.