సొంత‌వాళ్లూ నేను ఓడిపోవాల‌ని కోరుకుంటున్నారు!

తెలంగాణ ఎమ్మెల్యేల ప‌ద‌వీ కాలం గ‌డువు ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ ఏడాది ఆఖ‌ర‌కు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంది. రానున్న ఎన్నిక‌ల్లో టికెట్లు ద‌క్కేదెవ‌రికో, గెలిచేదెవ‌రికో అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ…

తెలంగాణ ఎమ్మెల్యేల ప‌ద‌వీ కాలం గ‌డువు ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ ఏడాది ఆఖ‌ర‌కు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంది. రానున్న ఎన్నిక‌ల్లో టికెట్లు ద‌క్కేదెవ‌రికో, గెలిచేదెవ‌రికో అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి స‌స్పెండ్‌కు గురైన రాజాసింగ్ అసెంబ్లీ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సొంత వాళ్లు కూడా తాను ఓడిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో రాజాసింగ్ ప్ర‌సంగిస్తూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారో తెలుసుకుందాం. వ‌చ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాక‌పోవ‌చ్చ‌న్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వ ఆశీస్సులు వుండాల‌న్నారు. ఎన్నిక‌ల్లో తాను ఓడిపోవాల‌ని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ‌గా వుంద‌న్నారు. వీరిలో బ‌య‌టి వాళ్ల‌తో పాటు సొంత వాళ్లు ఉన్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం త‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను విస్మ‌రించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. గ‌తంలో రాజాసింగ్ ఒక మ‌తంపై విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆయ‌న్ను బీజేపీ స‌స్పెండ్ చేసింది. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు ఆయ‌న్ను జైలుపాలు చేశాయి. అయినా ఆయ‌న త‌న వైఖ‌రిని మార్చుకున్న‌ట్టుగా లేరు. 

దీంతో రాజాసింగ్ వ‌ల్ల బీజేపీకి రాజ‌కీయంగా న‌ష్ట‌మ‌ని ఆ పార్టీ పెద్ద‌లు ఒక అంచ‌నాకు వ‌చ్చారు. త‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ చూసుకుంటున్న‌ట్టు రాజాసింగ్ భావిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌న‌ను అసెంబ్లీలో అడుగు పెట్ట‌నివ్వ‌ర‌నే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చారు. ఈ కార‌ణంగానే అసెంబ్లీ వేదిక‌గా రాజాసింగ్ భావోద్వేగ కామెంట్స్ చేశారు.