బింబిసార సెంటిమెంట్ ‘డెవిల్’కు కలిసొస్తుందా?

బింబిసార సక్సెస్ తో ప్రామిసింగ్ హీరో అయిపోయాడు కల్యాణ్ రామ్. అయితే ఆ వెంటనే అమిగోస్ రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. దీంతో ఈ హీరో ఇప్పుడు నిరూపించుకునే పొజిషన్ లో పడ్డాడు. మరీ…

బింబిసార సక్సెస్ తో ప్రామిసింగ్ హీరో అయిపోయాడు కల్యాణ్ రామ్. అయితే ఆ వెంటనే అమిగోస్ రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. దీంతో ఈ హీరో ఇప్పుడు నిరూపించుకునే పొజిషన్ లో పడ్డాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది అతడికి ఇంకా హిట్ పడలేదు. కాబట్టి కల్యాణ్ రామ్ ఆశలన్నీ డెవిల్ పైనే ఉన్నాయి.

అయితే అమిగోస్ ప్రభావం, డెవిల్ పై పడలేదనే చెప్పాలి. పైపెచ్చు.. ఈ సినిమాకు కూసింత బింబిసార సెంటిమెంట్ కూడా కలిసొచ్చింది. బింబిసార సినిమాపై కూడా విడుదలకు ముందు పెద్దగా అంచనాల్లేవ్. ఎప్పుడైతే టీజర్ రిలీజైందో, అది చూసి అంతా షాక్ అయ్యారు. సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి.

సరిగ్గా అదే మేజిక్, డెవిల్ సినిమా విషయంలో కూడా జరిగింది. ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటివరకు ఎవ్వరూ ఊహించని కథాంశం, విజువల్స్ టీజర్ లో కనిపించేసరికి, సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది డెవిల్ కు శుభ పరిణామం.

ఈరోజు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. నవంబర్ 24న థియేటర్లలోకి రానుంది డెవిల్. ఇందులో ఓ రహస్యాన్ని ఛేదించే కఠినమైన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటించాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాను హిందీలో కూడా ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హిందీ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. అలా హీరోయిన్ కోణంలో కూడా బింబిసార సెంటిమెంట్ డెవిల్ కు కలిసొచ్చింది. హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.