పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ సినిమా. దాదాపు రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ ప్రాజెక్టుపై ఓ దశలో ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. మరికొంతమంది అసలు హరీశ్ దగ్గర కథ కూడా లేదంటూ ప్రచారం చేశారు. అలా ఎన్నో విమర్శలు, మరెన్నో ఊహాగానాల మధ్య ఊగిసలాడిన ఈ ప్రాజెక్టులో ఎట్టకేలకు కదలిక వచ్చింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ లో ఈ సినిమా లాంఛ్ అవుతుంది. అదే నెలలో ఫస్ట్ షెడ్యూల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, ఆ సినిమాతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టుకు కూడా కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇందులో లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. ఓ సందేశంతో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.
పవన్ కల్యాణ్ ను ఈ సినిమాలో కొత్తగా చూపించబోతున్నాడు హరీశ్ శంకర్. పవన్ గెటప్, అతడి కాస్ట్యూమ్స్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయట. ఓ దశాబ్దం పాటు ఆ డైలాగ్స్ ను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని చెబుతున్నాడు ఈ డైరక్టర్.
హరీశ్ శంకర్ సినిమాకు కాల్షీట్లు కేటాయించడంతో, పవన్ చేయాల్సిన వినోదాయ శితం రీమేక్ పై ఇప్పుడు అనుమానాలు పెరిగాయి. జీ స్టుడియోస్, పీపుల్ మీడియా బ్యానర్లపై రాబోతున్న ఆ సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.