పవన్ చెబితే.. వాళ్లు వేదంలా పాటిస్తారా?

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ చాలా గట్టిగానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఏం చెబితే అది ఒప్పుకోవడానికి ఢిల్లీ లో బీజేపీ అంతగా కాచుకుని…

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ చాలా గట్టిగానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఏం చెబితే అది ఒప్పుకోవడానికి ఢిల్లీ లో బీజేపీ అంతగా కాచుకుని కూచుని ఉందా అనే అనుమానం కలుగుతోంది. 

పవన్, తన మాట వేదవాక్కు అని.. బీజేపీ దానిని పాటించి తీరుతుందని భ్రమపడుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. వ్యతిరేక ఓటు చీలకుండా చూడవలసిన అవసరాన్ని, కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం ఒప్పుకునేలా చెప్పగలనని పవన్ కల్యాణ్ చాలా ధీమాగా ఉన్నారు. 

ఇందులో అనేక యాంగిల్స్ ఉన్నాయి. ‘తను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు మేలు చేస్తాను’ అనే మాటనే పవన్ కనీసం ఒక నియోజకవర్గం ప్రజలైనా నమ్మేలా చెప్పలేకపోయారు. అందుకే.. ఇటీవలి కాలంలో ఏ నాయకుడూ చేయనివిధంగా తన అదృష్టాన్ని రెండు చోట్ల పరీక్షించుకుని ఓడిపోయారు. అలాంటి పవన్ కొమ్ములు తిరిగిన ఢిల్లీ కమలదళం పెద్దలు నమ్మేలా చెప్పగలరు అనడం నిజమేనా?

ఈ మాటల్లో ఇంకో రకమైన పవన్ అహంకారం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఆయన కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు. బిజెపికి ఒక పార్టీ కమిటీ అంటూ ఉండాలి తప్ప.. వారున్నారు తప్ప.. వారికి అస్తిత్వమే లేదన్నట్టుగా, అధిష్ఠానం వద్ద రాష్ట్ర బిజెపి నాయకులకు విలువే లేదన్నట్టుగా ఆయన అహంకార పూరిత మాటలు ఉన్నాయి. 

బిజెపి రాష్ట్ర నేతలు ఈ విషయాన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నారు. సీరియస్ రాజకీయం మొదలెట్టిన నాటినుంచి.. చంద్రబాబు పల్లకీ మోయడానికే ప్రయత్నిస్తున్న పవన్ కల్యాణ్ అసలు మనకు అవసరమా అనే దృష్టితో కొందరు బిజెపి నాయకులు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

మీడియా మిత్రులు అడిగినప్పుడు.. వారి ఎదుట ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి.. ఢిల్లీలో బిజెపిని ఒప్పిస్తా అనే తరహా డైలాగులు చెప్పడం చాలా చాలా సహజం. అయితే పవన్ ఎంత చెప్పినా సరే.. మోడీ సర్కారును తీవ్రమైన స్థాయిలో తూలనాడిన చంద్రబాబు తో తిరిగి జట్టు కట్టడానికి బిజెపి మరీ అంత సిగ్గులేని పార్టీనా? అనేది ప్రజల్లో మెదులుతున్న సందేహం. 

చంద్రబాబు పల్లకీ మోయాలని డిసైడ్ అయిపోయాడు గనుక.. చంద్రబాబు ఎన్ని సీట్లు ముష్టిగా విదిలిస్తే అన్ని సీట్లు మాత్రమే చాలనుకుని, తన పార్టీని పణంగా పెడుతూ పవన్ కల్యాణ్ పొత్తులకు ఒప్పుకోవచ్చు గాక.. కానీ.. ఇప్పట్లో ఏపీలో గెలిచే చాన్స్ లేదని తమకే తెలిసినా.. ఎన్నటికైనా నిలబడలేకపోతామా అనే ఉద్దేశంతో.. సొంతంగానే అస్తిత్వాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ చంద్రబాబుతో పొత్తులకు అంగీకరిస్తుందా అనేది సందేహం. ఇన్నాళ్లూ తెగతిట్టి.. ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పాడు కదాని.. చంద్రబాబు పల్లకీ మోయడానికి వారు దిగజారాతారా అనేది కూడా ప్రశ్నే. 

మరి ఏ నమ్మకంతో పవన్ ఒప్పిస్తా అని అంటున్నారో గానీ.. ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటో.. ఆయన ఇప్పుడే డిసైడ్ కావడం మంచిది.