తొందరపడిన పవన్… మాట తప్పితే పార్టీ గల్లంతే

తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు పవన్. వచ్చే ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ అక్కడ పవన్ మాట తప్పితే, ఏపీలో కచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడుతుంది. ముందు తెలంగాణలో ఎన్నికలు ఆ…

తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు పవన్. వచ్చే ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ అక్కడ పవన్ మాట తప్పితే, ఏపీలో కచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడుతుంది. ముందు తెలంగాణలో ఎన్నికలు ఆ తర్వాత ఏపీలో ఎన్నికలు కాబట్టి.. ఇక్కడ పవన్ మాట ఎవరూ లెక్కచేసే అవకాశం ఉండదు. 

ఒక రకంగా తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి పవన్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తోంది.

అభిమానుల్ని చూస్తే ఆపుకోలేరా..?

అభిమానులు కనపడగానే ఆవేశం పొంగిపోతుంది పవన్ కల్యాణ్ కి. అలాగే తెలంగాణలో అభిమానుల్ని చూడగానే అక్కడ పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. చౌటుప్పల్ పర్యటనలో అభిమానులు ఆయన్ను చుట్టుముట్టగానే పొంగిపోయారు. నియోజకవర్గానికి 5వేల ఓటుబ్యాంక్ ఉందనే లెక్కలు కూడా అప్పుడే గుర్తుకొచ్చాయి. అందుకే 30 సీట్లలో పోటీ చేస్తానంటూ ప్రకటించేశారు.

కానీ ఆ మాటమీద నిలబడే అవకాశం కానీ, ఆలోచన కానీ పవన్ కి లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, తెలంగాణలో నా ఇష్టం అంటే కుదరదు. కచ్చితంగా బీజేపీకి లోబడి మసలుకోవాల్సిందే. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ తో పోటీ పడుతున్న బీజేపీ తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయక తప్పని పరిస్థితి. 

అంటే అక్కడ పవన్ వచ్చి వాటా అడిగితే వారికి గిట్టుబాటు కాదు. సో.. తెలంగాణలో పవన్ 30 సీట్లలో పోటీ చేసే ప్రసక్తే లేదు. అంటే మాట తప్పినట్టే లెక్క. అదే మాట  ఏపీలో తప్పడన్న గ్యారెంటీ ఏంటి..? ఏపీలో ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా ఈ అంశం పవన్ కి ఎదురుదెబ్బ కావచ్చు.

ఇదో వ్యూహమా..?

పవన్ 30 సీట్ల ప్రకటన వెనక మరో వ్యూహం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధ్యమైనంత వరకు బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండానే టీడీపీతో వెళ్లాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. అది కుదరకపోతే.. టీడీపీ కోసం బీజేపీతో కటీఫ్ చెప్పాల్సిందే. దానికి సరైన కారణం దొరకడం లేదు. 

తెలంగాణలో గొంతెమ్మ కోర్కె కోరితే, బీజేపీతో గొడవ పెట్టుకోవచ్చు. వారిపై నెపం నెట్టి దోస్తీకి గుడ్ బై చెప్పేయొచ్చు. అలా ఏపీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవచ్చు. ఇది కూడా పవన్ వ్యూహం అయ్యే అవకాశముంది.

ప్యాకేజీ అనుమానాలు..?

మరికొంతమంది దీన్ని బ్లాక్ మెయిలింగ్ గా కూడా చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని పరోక్షంగా బెదిరించేందుకు పవన్ ఈ ఎత్తుగడ ఎత్తుకున్నారని చెబుతున్నారు. దీనికి వీళ్లు చెబుతున్న లాజిక్ కూడా అద్భుతంగా ఉంది. 

ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు పవన్ కు తెలంగాణ గుర్తొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేవలం స్వలాభం కోసమే పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్ని పావుగా వాడుకుంటున్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ 30 సీట్ల ఎత్తుగడ అందులో భాగమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా.. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే మాత్రం, పవన్ తెలంగాణ వ్యూహం మాత్రం తొందరపాటు చర్యగానే చెప్పుకోవాలి. అక్కడ అరకొర ఓట్లు వస్తే మాత్రం ఏపీలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది.