మ‌ట్టి మ‌ర‌ణిస్తుంది

మ‌నం చ‌నిపోతే మ‌ట్టిలో క‌లిసిపోతాం. మ‌ర‌ణం జీవి స‌హ‌జ ల‌క్ష‌ణం. అయితే మ‌న కాళ్ల కింద భూమి కూడా చ‌నిపోతుంది. మ‌ట్టికి కూడా మ‌ర‌ణం వుంటుంది. మ‌ట్టికి జీవం పోవ‌డ‌మంటే, దానికి ఆహార ఉత్ప‌త్తి…

మ‌నం చ‌నిపోతే మ‌ట్టిలో క‌లిసిపోతాం. మ‌ర‌ణం జీవి స‌హ‌జ ల‌క్ష‌ణం. అయితే మ‌న కాళ్ల కింద భూమి కూడా చ‌నిపోతుంది. మ‌ట్టికి కూడా మ‌ర‌ణం వుంటుంది. మ‌ట్టికి జీవం పోవ‌డ‌మంటే, దానికి ఆహార ఉత్ప‌త్తి ల‌క్ష‌ణం న‌శించి, కేవ‌లం ఇసుక రేణువుగా మారిపోవ‌డం. అంటే భూమి ఎడారిగా మారిపోతే అది ప్రాణం కోల్పోయింద‌ని అర్థం. జూన్ 17 ప్ర‌పంచ వ్యాప్తంగా ఎడారిక‌ర‌ణ నివార‌ణ దినోత్స‌వం జ‌రుపుకుంటారు. ఈ భూమిలో ఎడారిని త‌గ్గించి వృక్ష‌జాలాన్ని పెంచ‌డానికి కృషి చేస్తారు. 1994 నుంచి ఇది జ‌రుగుతూ వుంది.

భూమిలోకి మ‌న‌మే విషాన్ని నింపుతున్నాం. అడ‌వుల్ని న‌రికేస్తున్నాం. ఎరువులు, పురుగుల మందులు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వాడుతున్నాం. మ‌ట్టిలో నుంచి శ‌క్తికి మించి పంట‌ని పిండుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఫ‌లితం సారం కోల్పోతోంది. మందులు వాడ‌కుండా సాగు చేసిన ఆర్గానిక్ పంట‌ల‌కి, మందుల పంట‌ల‌కి రుచిలోనే కాదు, పోష‌క విలువ‌ల్లోనూ తేడా వుంటుంది. దీని వ‌ల్ల భూమి సాగుకు ప‌నికి రాకుండా పోతుంది. మ‌ట్టి మ‌ర‌ణించ‌డం అంటే ఇదే. ఇప్ప‌టికే 30 శాతం భూమి క్షీణ‌త‌కి గురైంది. వ‌చ్చే 30 ఏళ్ల‌లో వ్య‌వ‌సాయ భూమి త‌గ్గిపోయి ప్ర‌పంచ‌మంతా ఆక‌లి చావులొస్తాయి.

టెక్నాల‌జీతో మ‌నం ఎన్ని ప‌నులైనా చేయొచ్చు. యాప్స్ ద్వారా ఫుడ్‌ని ఇంటికే తెప్పించుకోవ‌చ్చు. కానీ ఆహారం పండే భూమి, పండించే రైతు వున్నాడు. ఎంత గొప్ప ఇంజ‌నీరైనా అన్న‌మే తినాలి. భిక్ష‌గాడైనా అన్న‌మే తినాలి. తినాలంటే పంట‌లు కంప్యూట‌ర్ల‌లో పండ‌వు. భూమిలోంచి రావాల్సిందే. నేల‌లోని క్షీణ‌త వ‌ల్ల 2045 నాటికి ఆహార ఉత్ప‌త్తి ఇప్ప‌టి కంటే 40 శాతం త‌గ్గుతుంద‌ని అంచ‌నా.

మ‌ట్టిని ర‌క్షించుకుందాం అనే పిలుపుతో “ఇషా” వ్య‌వ‌స్థాప‌కుడు జ‌గ్గీ వాసుదేవ్ ప్ర‌పంచ యాత్ర చేప‌ట్టారు. మంచి విష‌య‌మే కానీ, ఇది చాల‌దు. ప్ర‌భుత్వాలే ముందుకు రావాలి. ఎడారిక‌ర‌ణ నుంచి భూమిని ర‌క్షిస్తే, ప్ర‌జ‌ల్ని ర‌క్షించిన‌ట్టే.

ఎడారిక‌ర‌ణ అంటే అన్నం దొర‌క్క‌పోవ‌డ‌మే కాదు, తాగ‌డానికి నీళ్లు కూడా దొర‌క‌వు. భూమి మ‌న‌ల్ని మోసి అల‌సిపోయింది. విషాన్ని త‌గ్గించి విశ్రాంతి ఇవ్వాలి.

జీఆర్ మ‌హ‌ర్షి