కొన్నాళ్లుగా టచ్ లో ఉన్నాడు. ప్రేమగా మాట్లాడాడు. ఉన్నట్టుండి సడెన్ గా కొరియర్ లో వజ్రాల హారం పంపించాడు. వెళ్లి తీసుకోమన్నాడు. అమ్మాయి షాక్ అయింది. తన కోసం ఏకంగా డైమండ్ నెక్లెస్ పంపించినందుకు మురిసిపోయింది. దశలవారీగా 9 లక్షలు సమర్పించుకుంది. తర్వాత మోసపోయానని గ్రహించింది. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
సికింద్రాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి ఏడాది కిందట భర్తను కోల్పోయింది. తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని పోరు పెట్టడంతో తన వివరాల్ని మ్యాట్రిమోనీ సైట్ లో పెట్టింది. వెంటనే అట్నుంచి ఓ వ్యక్తి లైన్లోకి వచ్చాడు. తనను క్లిఫర్డ్ గా పరిచయం చేసుకున్నాడు. తనది ఇండియానే అని, యూరోప్ లో పెద్ద డాక్టర్ గా పనిచేస్తున్నానని నమ్మించాడు.
కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ముందు తన గిఫ్ట్ గా డైమండ్ నెక్లెస్ పంపిస్తున్నాను, వెళ్లి తీసుకోమన్నాడు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఆ పార్శిల్ తీసుకోవాలంటే కొంత ట్యాక్స్ కట్టాలన్నాడు.
డైమండ్ నెక్లెస్ వస్తోందనే ఆశతో ఆ అమ్మాయి కొంత డబ్బు చెల్లించింది. చాలదని ఇంకాస్త అడిగాడు. ఇంకొంత చెల్లించింది. అలా 9 లక్షల వరకు ఇచ్చేసింది. ఇంకా కావాలని అడగడంతో అప్పుడు అనుమానం వచ్చింది. ఇంకాస్త లోతుగా ఆరా తీయగా మోసపోయానని గ్రహించింది. వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఖరీదైన బహుమతులు పంపిస్తున్నాం డబ్బులు కట్టమని వచ్చే సందేశాల్ని నమ్మొద్దంటూ పోలీసులు ఓవైపు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. మరోవైపు ఇలా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆశ, మనిషి విచక్షణను కప్పేస్తుందని అంటారు ఇందుకే.