ఆంధ్రప్రదేశ్ బీజేపీని తెలంగాణ బీజేపీ నేతలు ఏ మాత్రం గౌరవించడం లేదనేందుకు ఇదో నిదర్శనం. గతంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయంలో కూడా తెలంగాణ బీజేపీ అవమానకర రీతిలో ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో పవన్ రాజకీయ పంథాను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.
తాజాగా ఏపీ బీజేపీ నేతలను పరోక్షంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవమానించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు ఏబీఎన్, టీవీ5 చానళ్లపై ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇప్పటికే రఘురామకృష్ణంరాజును అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్, టీవీ5 చానళ్లపై కేసు నమోదు చేయడాన్ని ఏపీ బీజేపీ అసలు పట్టించుకోలేదు.
మరీ ముఖ్యంగా ఏబీఎన్ చానల్‌లో తమ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై ఓ పథకం ప్రకారం దాడి జరిగిందని ఏపీ బీజేపీ బలంగా నమ్ముతోంది. ఇందులో భాగంగా ఆ చానల్ వైఖరిని నిరసిస్తూ ….బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ చానళ్లు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తాయో గత కొంత కాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు అదే చానళ్ల వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బాబు ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పావుగా వాడుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. ప్రస్తుత సీఐడీ కేసులను కూడా రాజకీయ కోణంలో అన్ని పార్టీలు చూస్తున్నాయి. అయితే ఇవేవీ పట్టని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై స్పందించడంపై ఏపీ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. తనకు సంబంధం లేని వ్యవహారాలపై బండి సంజయ్ జోక్యం ఏంటని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ ఘటనపై, మరీ ముఖ్యంగా చానళ్లపై కేసును ఏపీ బీజేపీ నేతలు మాత్రం మాట మాత్రం కూడా ఖండించలేదు. దీంతో తెలంగాణ బీజేపీ నుంచి నేతల అభిప్రాయాలను దిగుమతి చేసుకుని ఆంధ్రా ఎడిషన్‌లో ప్రచురించు కోవాల్సిన దుస్థితి ఏర్పడడం కొట్టొచ్చినట్టు కనిపించింది.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ నేత కావడంతో, ఆయన స్పందించడాన్ని అర్థం చేసుకోవచ్చని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. కానీ బండి సంజయ్ అత్యుత్సాహం ఏంటని నిలదీస్తున్నారు. ఇదెక్కడి దాష్టీకం అని బండి ప్రశ్నించారు. కొందరి మెప్పుకోసం రఘురామపై పోలీస్‌లు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని ఆరోపిం చారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5పై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే మీడియాను నియంత్రించడం అనేది నియంతృత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇదే ఆవేదన, ఆక్రోశం విష్ణుపై దాడి సందర్భంలో బండి సంజయ్‌లో ఎందుకు కన్పించలేదనేదే ఏపీ బీజేపీ ప్రశ్న. ఏబీఎన్‌ను బహిష్కరించిన ఏపీ బీజేపీ వైఖరిని కూడా బండి సంజయ్ తప్పు పడతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ బీజేపీని అవమానించేలా బండి సంజయ్ వ్యవహారం ఉందనే టాక్ నడుస్తోంది.