టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియాకు అన్ని వైపుల నుంచి మద్దతు కొరవడింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో రెండు టీడీపీ అనుకూల చానళ్లపై కూడా సీఐడీ కేసులు పెట్టింది. దీనిపై సదరు చానళ్లు తమకు మద్దతు కూడగట్టేందుకు శ్రమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ చానళ్లు కోరుకున్న స్థాయిలో రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. ఆంధ్రజ్యోతిలో మీడియాపై కేసులా? అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించారు. ఈ కథనమే ఏబీఎన్, టీవీ5 చానళ్లకు కనీసం రాజకీయ పక్షాల నుంచి కూడా మద్దతు లేదని చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం.
“ఇది భావ ప్రకటనపై దాడేనని రాజకీయ వర్గాలు, జర్నలిస్టు సంఘాలు, మేధావి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తన అభిప్రాయాలను వెల్లడించేందుకు మీడియా సంస్థల విలేకరులతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. పలు మీడియా సంస్థల ప్రతినిధులు ఉన్నప్పటికీ ఏబీఎన్-ఆంధ్ర జ్యోతి, టీవీ-5 సంస్థల ప్రతినిధులపై కేసులు పెట్టడాన్ని రాజకీయ పక్షాలు, జర్నలిస్టు సంఘాలు, మేధావి వర్గాలు తప్పుబడుతున్నాయి” …అని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు.
రాజకీయ వర్గాలు, జర్నలిస్టు సంఘాలు, మేధావి వర్గాలు తమ చానళ్లపై సీఐడీ కేసును తప్పు పడుతున్నట్టే రాయడమే తప్ప, వాళ్ల కోసం వెతికితే ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం ఏపీయూడబ్ల్యూజే ,ఏపీడబ్ల్యూజేఎఫ్ అనే జర్నలిస్టు సంఘాలు మాత్రమే …మర్యాద కోసం సీఐడీ కేసులను తప్పు పడుతున్నట్టుగా ఓ మొక్కుబడి ప్రకటన ఇచ్చాయి. మరి రాజకీయ వర్గాలు, మేధావి వర్గాల ప్రతినిధులెవరో తెలియడం లేదు.
ఇక టీడీపీ, ఎల్లో మీడియాకు తేడా లేకపోవడంతో వాటి ఖండనలు ఉన్నా లేకున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అడ్జెంట్‌గా ఆ చానళ్లకు తమపై సీఐడీ కేసులను ఖండించే రాజకీయ పక్షాలు కావాలి. రఘురామకృష్ణంరాజు మాదిరిగానే ఈ చానళ్లు కూడా పరిధి దాటి ప్రవర్తించడం వల్లే పౌర సమాజం, మేధావులు, రాజకీయ విశ్లేషకుల నుంచి మద్దతు కోల్పోయినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది.