క్షత్రియులపై కక్ష సాధింపా..? ఇదెక్కడి లాజిక్..!

అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కూడా.. ప్రతిపక్షాలతో చేతులు కలిపి, కుట్రపూరితంగా అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారం చేస్తూ సీఐడీ కేసులో ఇరుక్కున్నారు రఘురామకృష్ణంరాజు. ఆయన చేసిన రచ్చబండ కార్యక్రమాల వీడియోలు చూసిన ఎవరికైనా…

అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కూడా.. ప్రతిపక్షాలతో చేతులు కలిపి, కుట్రపూరితంగా అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారం చేస్తూ సీఐడీ కేసులో ఇరుక్కున్నారు రఘురామకృష్ణంరాజు. ఆయన చేసిన రచ్చబండ కార్యక్రమాల వీడియోలు చూసిన ఎవరికైనా అది రాజద్రోహం అనిపించక మానదు. అయితే 'రాజ'ద్రోహం అంటే అది కాదని, రాజుల సామాజిక వర్గానికి చేస్తున్న ద్రోహం అని కొంతమంది వక్రభాష్యాలు చెబుతున్నారు.

రాజకీయాల్లో ప్రతి విషయానికి కులం, మతం ఆపాదించడం చూస్తూనే ఉన్నాం. అవసరం ఉన్నా, లేకున్నా అన్ని విషయాల్లో కులాన్ని తీసుకొచ్చి.. మా కులపోళ్లకి ఇంత అన్యాయం చేస్తారా అంటూ ఎగిరెగిరిపడటం, కాస్తో కూస్తో సదరు సామాజిక వర్గంలో సింపతీ కోసం ట్రై చేయడం ఇటీవల కొంతమంది బాగా వంటబట్టించుకున్న విద్య. అయితే విచిత్రంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా కులం తెరపైకి వచ్చింది.

వాస్తవానికి సదరు ఎంపీ తన పేరుకి తగ్గట్టు, స్థాయికి తగ్గట్టు, సామాజిక వర్గానికున్న పెద్దరికానికి తగ్గట్టు ఎక్కడా ప్రవర్తించ లేదు. మరి ఇన్నాళ్లూ పిచ్చి వాగుడు వాగుతుంటే గుర్తురాని కులం ఇప్పుడే కొంతమందికి ఎందుకు గుర్తొచ్చింది. రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడి హోదాలో గొట్టుముక్కల రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. క్షత్రియులపై ఇది కక్షసాధింపంటూ ఆయన మండిపడ్డారు. క్షత్రియులంతా వైసీపీపై తిరగబడతారంటూ స్వరం పెంచారు.

అసలు ఎంపీ అరెస్ట్ కి, క్షత్రియులపై కక్షసాధింపుకి సంబంధం ఉందా అనే కోణంలో ఆలోచిస్తే ఎవరికైనా సమాధానం ఇట్టే తడుతుంది. మరి ఈ క్షత్రియ సంఘం అధ్యక్షుడికి ఎందుకు తట్టడం లేదో! రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో నిజంగానే క్షత్రియుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటే.. కచ్చితంగా జగన్ కే మద్దతు దక్కుతుంది తప్ప, రఘురామకు కానే కాదు.

ఇక ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు సరేసరి. అశోక్ గజపతి రాజు అరెస్ట్ ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ క్షత్రియులపై జగన్ దాడి చేస్తున్నారని ఆరోపించారాయన. గతంలో అశోక్ గజపతిపై అక్రమ కేసులు పెట్టారని, ఇప్పుడు ఏకంగా అదే సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుచేసిన వారు క్షత్రియులైతే ఎలాంటి విచారణ లేకుండా వదిలిపెట్టాలని కొత్త లాజిక్ చెప్పారు మంతెన.

సత్యం పేరు ఇరికించడం పరాకాష్ట..

ఈ ఎపిసోడ్ మొత్తంలో సత్యం రామలింగరాజు పేరు ఇరికించడం ఈ దిగజారుడుతనానికి పరాకాష్ట. గతంలో వైఎస్సార్ హయాంలో ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్న సత్యం రామలింగరాజు.. ఆ తర్వాతి కాలంలో కార్పొరేట్ ఫ్రాడ్ బయటకు రావడంతో జైలుకెళ్లారు. మైటాస్ పేరుతో ఉన్న సత్యం గ్రూపు కంపెనీకి హైదరాబాద్ మెట్రో పనులు అప్పగించడంలో ఏదో గోల్ మాల్ జరిగిందని, వైఎస్ఆర్ పుణ్యమా అని సత్యం రామలింగరాజు అరెస్ట్ అయ్యారని ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది.

'అప్పుడు తండ్రి హయాంలో రామలింగరాజు, ఇప్పుడు తనయుడు జగన్ హయాంలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్' అంటూ ఓ చెత్త లాజిక్ తీస్తున్నారు కొంతమంది. అసలింతకీ క్షత్రియులు నిజంగానే రఘురామకృష్ణంరాజుకి మద్దతు తెలుపుతున్నారా? అనేది అనుమానం. క్షత్రియుల పేరుతో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రఘురామ ఎపిసోడ్ ని వాడుకుంటున్నారు, జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మొదలు పెట్టారు.