ముల్లును ముల్లుతోనే తీయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో ఎక్కువ తప్పులు చేయించి, ప్రజల నుంచి సానుభూతి లేకుండా చేయగలిగింది. ఇందులో జగన్ ప్రభుత్వం మొదటి విజయం సాధించింది.
ప్రజా స్వామ్యంలో ఎప్పుడైనా ప్రజాభిప్రాయమే కీలకం. మిగిలినవన్నీ తాత్కాలికమైనవి. రఘురామకృష్ణంరాజు తాను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాననే సూక్ష్మాన్ని మరిచిపోయి …అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్‌పై చెలరేగిపోవడం వల్లే చిక్కులు కొని తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బహుశా తానింకా రాచరిక వ్యవస్థలో ఉన్నానని, ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి రాజుననే భ్రమలో ఉన్నారో, ఎవరైనా అలా పెట్టారో తెలియదని, మొత్తానికి మూల్యం మాత్రం ఆయనే చెల్లించాల్సి వస్తోందనే అభిప్రాయాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.
చివరికి తన సొంత సామాజిక వర్గం నుంచి కూడా రఘు రామకృష్ణంరాజుకు ఆదరణ దక్కలేదు. పైగా ఆయనకు వ్యతిరేకంగా రాజులు గళం విప్పుతున్నారు. రఘురామకృష్ణంరాజుకు తగిన శాస్తి జరిగిందని బలంగా చెబుతున్నారు.
రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మీడియాతో మాట్లాడుతూ ఎంపీపై మండిపడ్డారు. ఇటీవల ప్రభుత్వంతో పాటు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ టికెట్‌పై గెలిచి అదే పార్టీపై విమర్శలు చేయడం దారుణ మన్నారు.
ఎమ్మెల్యే ముదుసూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఎంపీగా తన బాధ్యతలు విస్మరించి రఘురామకృష్ణంరాజు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. ఎంపీగా ఉన్న ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పథకం ప్రకారం కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని దారుణంగా నిందిస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి హోదాకు కనీస గౌరవం ఇవ్వకుండా ఎగతాళి చేయడం, కించపరుస్తూ మాట్లాడ్డం సరికాదన్నారు. కోవిడ్‌తో బాధపడుతున్న ప్రజలను ఆదుకోవాలనే తలంపు ఎంపీలో లేకపోవడం విచారకరమన్నారు. కులాల మధ్య గొడవలు పెడుతున్న ఎంపీ శిక్షకు అర్హుడన్నారు.
పవన్‌కల్యాణ్‌పై గెలిచిన, ఎంపీ సొంత జిల్లాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలు చేస్తూ రఘురామను పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
ఎంపీగా రఘురామకృష్ణంరాజు తమ ఖ్యాతిని పెంచకపోగా, భ్రష్టు పట్టిస్తున్నాడని క్షత్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనడం గమనార్హం. ఇలా అనేక మంది ప్రజాప్రతినిధులు రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన తీరును తప్పు పడుతున్నారు.