నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, అనంతర పరిణామాలపై ప్రజాకోర్టులో స్పందన కరువైంది. రఘురామ ఎపిసోడ్‌పై రాజకీయ, మీడియా రగడ తప్ప, మరెక్కడా ఎలాంటి స్పందనా కనిపించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గం నరసాపురంలో కూడా ఏ ఒక్కరూ ఆయనకు మద్దతుగా ఆందోళన చేయడం పక్కన పెడితే, ప్రెస్‌మీట్ పెట్టిన పాపాన పోలేదు. దీన్ని బట్టి రఘురామకు పౌర సమాజం నుంచి వస్తున్న మద్దతు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
తనను గెలిపించిన అధికార పార్టీతో విభేదాలు వచ్చినప్పటి నుంచి రఘురామకృష్ణంరాజు తన పార్లమెంట్ నియోజక వర్గానికి వెళ్లలేదు. రఘురామ కేరాఫ్ హైదరాబాద్ లేదా ఢిల్లీ. జగన్‌ను జైలుకు పంపిన తర్వాతే ఆంధ్రాలో అడుగు పెడతానని రఘురామ ఇటీవల శపథం కూడా చేశారు. అయితే దానికి భంగం కలిగింది.
తమ పార్లమెంట్ సభ్యుడైన రఘురామను టీవీల్లో చూడడమే తప్ప, ఆయన్ను ప్రత్యక్షంగా చూసే భాగ్యానికి నోచుకోలేదని నరసాపురం ప్రజానీకం చెబుతోంది. చివరికి అరెస్ట్, లాఠీ దెబ్బలతో రఘురామను మీడియాలో చూసుకోవాల్సి వస్తోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఐడీ కస్టడీలో రఘురామకృష్ణంరాజు గాయాలుపాలు కావడంపై హైకోర్టు మండిపడింది. కస్టడీలో ఉన్న ఎంపీని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ శరీరంపై ఉన్నవి పోలీసు దెబ్బలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించింది. ఒక ఎంపీని లాఠీలతో చితకబాదడాన్ని ఎవరూ కూడా సమర్థించరు. ఇలాంటి సంస్కృతి ఎంత మాత్రం మంచిది కాదు. హైకోర్టు అన్నట్టు ….ఎంపీపై పోలీసులు దాడి చేశారని తెలిస్తే మాత్రం కఠిన శిక్ష తప్పదు.
అయితే హైకోర్టు, చట్టాలు , పోలీసులు ఎప్పటి నుంచో తమ పని తాము చేసుకుపోతున్నట్టే …జగన్ పాలనలో కూడా వాటికవే చేసుకుపోతాయి. కానీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్‌పై ప్రజాకోర్టు అభిప్రాయం, నిర్ణయమే కీలకమైనవి. ఎందుకంటే రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే. రఘురామకృష్ణంరాజు ఏపీ అధికార పార్టీ ఎంపీ. కారణాలేవో తెలియదు కానీ, సొంత పార్టీతో ఆయనకు విభేదాలొచ్చాయి. మొదట్లో మా ముఖ్యమంత్రి , మా మంత్రులు, మా ప్రభుత్వం అంటూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించే వాళ్లు.
అప్పట్లో ఆయనకు పార్టీ షోకాస్ నోటీసు ఇచ్చింది. తనదైన స్టైల్‌లో ఘాటు రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఏమీ కాలేదు. దీంతో తనను ఏమీ చేసుకోలేరనే ధీమా రఘురామకృష్ణంరాజులో అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తన ధిక్కరణ స్వరాన్ని ఆయన మరింత పెంచారు. ఆయనకు టీడీపీ అనుకూల పత్రికలు, చానళ్లు మద్దతు ఇస్తూ వచ్చాయి.
దీంతో ఆయన మాటకు అడ్డూఅదుపూ లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి జగన్, ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిపై ఒరేయ్, తురేయ్ అంటూ చెలరేగిపోతూ వస్తున్నారు. రెడ్లు, క్రిస్టియన్లు అంటూ తిట్లదండకానికి దిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాపు అయితే, జగన్ మాత్రం రెడ్డి ఎలా అయ్యాడంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇలా వ్యవహారం తెగే వరకూ లాగారు.
వైసీపీ దిగువస్థాయి నాయకులు, పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు రఘురామ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించడమే తప్ప …ముఖ్యమంత్రి జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం నోరు తెరవలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే గౌరవ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ చర్చకు దారి తీసింది. రఘురామ అరెస్ట్‌పై ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చెందడం తప్పితే, పౌర సమాజ నుంచి సానుభూతి కరువైంది. అయ్యో పాపం అనే వాళ్లు లేకపోయారు.
అలాగని జగన్ చర్యలకు బ్రహ్మరథం పట్టడం లేదు. ఇదంతా తమకు సంబంధించిన వ్యవహారం కాదనే అభిప్రాయంలో జనం ఉన్నారు. అయితే ఇదంత రఘురామ స్వయంకృతాపరాధం అనేవాళ్లే ఎక్కువ. ఒక ఎంపీ స్థాయిలో ఉండి …ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ప్రభుత్వ పెద్దలపై అసభ్య పదజాలాన్ని ప్రయోగించొచ్చా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కరోనాతో అల్లాడుతున్న తమను పట్టించుకునే దిక్కు లేదని, పెద్దోళ్ల రాజకీయ గొడవలు తమకెందుకుని పౌర సమాజం అంటోంది. రఘురామ రోజూ బూతులు తిడుతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఎదుటి వాళ్లను గెలుక్కునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని, ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కోవాలే తప్ప నిందించడం వల్ల ప్రయోజనం లేదని బుద్ధి జీవులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనే అభిప్రాయం …రఘురామకృష్ణంరాజు విషయంలో జనాభిప్రాయం. తమకు సంబంధం లేని వాటిపై ఏ స్థాయి రాజకీయ రగడ జరుగుతున్నా ….పౌర సమాజం పట్టించుకోదనేందుకు ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనం.